YS Sharmila : వైఎస్ఆర్టీపీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల శుక్రవారం హైదరాబాద్ లో అడిషనల్ డీజీపీని కలిశారు. తన పాదయాత్రకు భద్రత కల్పించాలని కోరారు. ఇటీవల వరంగల్ జిల్లా నర్సంపేట నియోజకవర్గంలో షర్మిల పాదయాత్రను టీఆర్ఎస్ కార్యకర్తలు అడ్డుకున్నారు. షర్మిల ఫ్లెక్సీలు, ప్రచార రథానికి నిప్పుపెట్టారు. వాహనాలపై రాళ్లదాడి చేశారు. అనంతరం పరిస్థితి ఉద్రిక్తంగా మారడంతో పోలీసులు షర్మిలను అరెస్టు చేసి హైదరాబాద్ కు తరలించారు. షర్మిల పాదయాత్రకు హైకోర్టు గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో తాను తిరిగి పాదయాత్ర ప్రారంభిస్తున్నట్లు ఆమె ప్రకటించారు. పాదయాత్రకు భద్రత కల్పించాలని అడిషనల్ డీజీపీకి వినతి పత్రం అందించారు. డీజీపీని కలిసిన అనంతరం షర్మిల మీడియాతో మాట్లాడారు.
డిసెంబర్ 4న పాదయాత్ర తిరిగి ప్రారంభం
"ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేసింది పోలీసులే అన్న మచ్చ డిపార్ట్ మెంట్ కు వస్తుందని చెప్పాం. ఇది తగదు మాకు సరైన భద్రత కల్పించాలని కోరాం. డిసెంబర్ 4వ తేదీన పాదయాత్ర తిరిగి ప్రారంభిస్తాం. పాదయాత్ర ఎక్కడ నిలిచిపోయిందో అక్కడి నుంచి తిరిగి మొదలుపెడతాం. ఇప్పటికే 3500 కిలోమీటర్ల పాదయాత్ర పూర్తిచేశాం. టీఆర్ఎస్ గూండాల కోసం పోలీసులు ఎక్కడైతే మా పాదయాత్రను అడ్డుకున్నారో అక్కడి నుంచే పాదయాత్రను తిరిగి ప్రారంభిస్తాం. డిసెంబర్ 14న పాదయాత్ర ముగిస్తాం. దాదాపు 4 వేల కిలోమీటర్ల పాదయాత్ర చేస్తున్నాం. "- వైఎస్ షర్మిల
టీఆర్ఎస్ గూండాల దాడులు!
టీఆర్ఎస్ పార్టీ ఒకప్పుడు ఉద్యమకారులున్న పార్టీ, ఇప్పుడు స్వార్థపరులతో నిండిపోయిందని వైఎస్ షర్మిల విమర్శించారు. ఇప్పుడున్న టీఆర్ఎస్ కార్యకర్తలు గుండాలుగా మారిపోయారన్నారు. తెలంగాణలో తాలిబాన్ల రాజ్యం కొనసాగుతోంది. 'నల్లిని నలిపినట్లు నలిపేస్తాం, ఇంటి నుంచి బయటకు అడుగుపెట్టనీయం, మీకు ఏం జరిగినా మా బాధ్యత కాదు' ఇలాంటి మాటలు వింటుంటే ఇది తాలిబాన్ల రాజ్యం అని నిర్థారణ అవుతోందన్నారు. టీఆర్ఎస్ నాయకుల ముసుగులో గూండాలు చెలరేగిపోతున్నారని మండిపడ్డారు. కేసీఆర్ తాలిబన్ల అధ్యక్షుడని తీవ్రంగా వ్యాఖ్యానించారు. ఈ తాలిబాన్ల మాటలకు మేం బెదరమని షర్మిల అన్నారు. ఇక్కడున్నది రాజశేఖర్ బిడ్డ అన్న షర్మిల... ఎన్ని అవరోధాలు ఎదురైనా పాదయాత్రను కొనసాగిస్తామన్నారు. తెలంగాణలో వైఎస్ఆర్టీపీని ఎదుగుదలను ఎవరూ అడ్డుకోలేరన్నారు. వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ ఉదయించే సూర్యుడు అన్నారు. కేసీఆర్ వైఫల్యాలను ప్రతిరోజు ఎత్తిచూపుతామన్నారు. ప్రజల పక్షాన పోరాడతామన్నారు. కాంట్రాక్టుల పేరు చెప్పి కేసీఆర్ తెలంగాణను దోచుకుంటున్నారన్నారు. కేసీఆర్ బిడ్డ లిక్కర్ పేరు చెప్పి దోచుకుంటున్నారని విమర్శించారు. రాష్ట్రాన్ని అప్పుల కుప్ప చేసి కేసీఆర్ కుటుంబం లక్షల కోట్ల ఆస్తి సంపాదించిందని షర్మిల ఆరోపించారు.
దేశంలో అత్యంత ధనిక కుటుంబం కేసీఆర్ దే
లోటస్ పాండ్ లో వైఎస్ఆర్టీపీ కార్యకర్తలతో ఆ పార్టీ అధినేత్రి వైఎస్ షర్మిల భేటీ అయ్యారు. ఈ సమావేశంలో పాదయాత్ర కొనసాగింపుపై షర్మిల కీలక వ్యాఖ్యలు చేశారు. ఈనెల 4 నుంచి 14 వరకు పాదయాత్రను యథావిధిగా కొనసాగిస్తామన్నారు. ఎన్ని బెదిరింపులు వచ్చినా పాదయాత్ర ఆపేది లేదన్నారు. వైఎస్సార్టీపీకి ఆదరణ పెరగడంతో టీఆర్ఎస్ భయపడుతుందన్నారు. అందుకే పాదయాత్రను అడ్డుకోవాలని కుట్ర చేశారని ఆరోపించారు. తనను అరెస్ట్ చేస్తే తప్ప పాదయాత్ర ఆపలేమని అందుకే అరెస్టు చేసి రిమాండ్ చేయాలని చూశారన్నారు. ట్రాఫిక్ కు అంతరాయం కలిగిస్తే రిమాండ్ కు పంపిస్తారా అంటూ మండిపడ్డారు. సీఎం కేసీఆర్ డైరక్షన్ లోనే ఇదంతా జరిగిందన్నారు. దేశంలో అత్యంత ధనిక కుటుంబం కేసీఆర్ దే అన్నారు. వైఎస్ఆర్ బిడ్డ తెలంగాణ ముఖ్యమంత్రి కావాలని ప్రజలు కోరుతున్నారన్నారు.
అప్పుల కుప్ప
"కేసీఆర్ రాష్ట్రాన్ని అప్పుల కుప్పగా మార్చారు. రాష్ట్రంలో కేసీఆర్ ప్రభుత్వం గద్దె దిగే వరకు నా పోరాటం ఆగదు. నా పాదయాత్రను ఆపే ప్రయత్నం కేసీఆర్ చేస్తున్నారు. నేను గవర్నర్ ను కలసి నా పాదయాత్రకు సంబంధించిన విషయాలతో పాటు రాష్ట్రంలో జరుగుతున్న పరిణామాలను వివరించాను. నా ఆస్తులపై విచారణకు సిద్ధం. తెలంగాణ మళ్లీ ఆంధ్రాలో కలవడం సాధ్యమేనా? నేను తెలంగాణ కోడలిని, తెలంగాణ పేరుతోనే పార్టీ ఏర్పాటు చేసుకున్నాను. కేసీఆర్ బీజేపీతో డ్యూయెట్లు పాడుతున్నారు. లిక్కర్ స్కామ్, ప్రాజెక్ట్ లలో కేసీఆర్ కుటుంబం లక్షల కోట్లు సంపాదించుకున్నారు. ప్రాజెక్టుల మీద ఎంక్వైరీ జరగాలి. తెలంగాణలో జరుగుతున్న ప్రతి అవినీతి బయటపెట్టాలి."- వైఎస్ షర్మిల