తెలంగాణ ఎన్నికల ప్రచారం తారాస్థాయికి చేరింది. బీఆర్ఎస్, కాంగ్రెస్, బీజేపీ అగ్రనేతల పర్యటనలతో తెలంగాణ రాజకీయాలు వేడెక్కాయి. ఈ తరుణంలో బీజేపీ నేతల చేస్తోన్న వ్యాఖ్యలు బీఆర్ఎస్ నెత్తిమీద పాలు పోసేలా ఉన్నాయా.. ఎన్నికల ప్రచారంలో బీజేపీ వ్యూహాత్మకంగా కాంగ్రెస్ ను కార్నర్ చేస్తోందా.. కారు సాఫీగా సాగేందుకు సరి కొత్త వ్యూహం తెలంగాణలో అమలవుతుందా.. అదేంటో ఈ కథనం ద్వారా చూద్దాం..


నిన్న కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ చేసిన వ్యాఖ్యలు ఈ ఎన్నికల యుద్దంలో ఓ కొత్త ఆయుధాన్ని ఇచ్చినట్లైంది. మొన్నటి వరకు కాంగ్రెస్ - బీఆర్ఎస్ పార్టీల మధ్య కరెంట్ వార్ జరుగుతోంది. రైతులకు  మూడు గంటలు విద్యుత్ ఇస్తే చాలు 24 గంటల ఉచిత విద్యుత్ అవసరం లేదని తెలంగాణ పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి చెప్పారంటూ బీఆర్ఎస్ నేతలు ప్రతీ  ఎన్నికల సభలో ప్రస్తావిస్తున్నారు. కాంగ్రెస్ కు అధికారం వస్తే తెలంగాణలో రైతులకు విద్యుత్ కోతలేనని బీఆర్ఎస్ చీఫ్ కేసీఆర్,  ఆ పార్టీ ముఖ్య నేతలు కేటీఆర్, హరీశ్ రావు, కవితలు ప్రచారం చేస్తున్నారు. రైతులే  లక్ష్యంగా గులాబీ నేతలు ప్రతీ చోట ఈ అంశాన్ని హైలెట్ చేస్తూ ప్రసంగాలు చేస్తున్నారు. దీన్ని తిప్పికొడుతూ రేవంత్ రెడ్డి 24 గంటల కరెంటు ఎక్కడ ఇస్తున్నారో నిరూపించండి అంటూ ప్రతి సవాల్ విసిరారు. 


కాంగ్రెస్ అధికారంలో ఉన్న చత్తీస్ ఘడ్ నుండి విద్యుత్ కొనుగోలు చేయడమే కాకుండా యూనిట్ విద్యుత్ ను అధిక ధరకు కొనుగోలు చేస్తున్నారని  ఎదురుదాడికి దిగారు. అసలు ఉచిత విద్యుత్ అనేది కాంగ్రెస్ పథకం అంటూ చెప్పుకొస్తున్నారు. ఇలా రెండు పార్టీల మధ్య ఉచిత విద్యుత్ అంశం పై వాదోపవాదాలు సాగుతుండగా మధ్యలో బీజేపీ ఈ వాగ్వాదంలోకి ఎంటరయింది. బీజేపీ అభ్యర్థుల ప్రచారం కోసం తెలంగాణకు వచ్చిన కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ మాట్లాడుతూ తెలంగాణ ప్రభుత్వం బావులకాడ విద్యుత్ మోటార్లకు మీటర్లు పెట్టనందుకే అదనపు రుణాలు ఇవ్వలేదని ఇతర రాష్ట్రాలు మోటార్లకు మీటర్లు పెట్టినందుకే తెలంగాణా కన్నా ఎక్కువ రుణ మొత్తం ఇవ్వడం జరిగిందని క్లారిటీ ఇచ్చారు. 


గతంలో ఇదే అంశాన్ని సీఎం కేసీఆర్ ప్రస్తావిస్తూ.. తెలంగాణకు కేంద్ర ప్రభుత్వం అన్యాయం చేస్తోందని, 25 వేల కోట్ల రూపాయల రుణాలు మీటర్లు పెట్టలేదన్న కారణంతో ఇవ్వకుండా తొక్కిపట్టిందని  చెప్పుకుంటూ వచ్చారు.  నిన్న కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ చేసిన వ్యాఖ్యలు బీఆర్ఎస్ నేతల వాదన నిజమేనని స్టాంప్ వేసినట్లయింది. నిర్మాలా సీతారామన్ వ్యాఖ్యలు చేసిన కొద్ది గంటల్లోనే మంత్రులు హరీశ్ రావు, కేటీఆర్ సహా గులాబీ నేతలంతా  ఆ వ్యాఖ్యలను ప్రస్తావిస్తూ.. ఉచిత విద్యుత్ ఛాంపియన్ గులాబీ పార్టీయేనని, ఏ మాత్రం కాంగ్రెస్, బీజేపీల వైపు చూస్తే రైతులకు ఆత్మహత్యాసదృశ్యమవుతుందని ప్రచారం చేస్తున్నారు. ఇప్పటి దాకా విద్యుత్ అంశం బీఆర్ఎస్ వర్సెస్ కాంగ్రెస్ గా ఉంటే, ఇప్పుడు అది బీఆర్ఎస్ వర్సెస్ బీజేపీ గా మారింది. 


అయితే ఈ వ్యాఖ్యలు బీఆర్ఎస్ కు మద్ధతు పలికేందుకు వ్యూహాత్మకంగా బీజేపీ చేసినట్లు హస్తం నేతలు చెబుతున్నారు. తెలంగాణ ప్రజల మనసులు తమ నుండి మళ్లించి, సెంటిమెంట్ రగిల్చి కారు పార్టీకి మేలు చేసేందుకే అన్న అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు. అంతేకాకుండా కేవలం కాంగ్రెస్ నేతల ఇళ్లపై ఐటీ దాడులు ఇందులో భాగమేనని తమ పార్టీ అభ్యర్థులను మానసికంగా, ఆర్థికంగా దిగ్భింధించే వ్యూహంతో బీజేపీ కదులుతూ..బీఆర్ఎస్ కు  మార్గనిర్దేశనం చేస్తోందని కాంగ్రెస్ పార్టీ నేతలు చెబుతున్నారు. కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ వ్యాఖ్యలు బీఆర్ఎస్ కు నైతిక మద్ధతు ఇచ్చేలా ఉన్నాయని, ఇది కారు స్పీడుకు దోహదం చేస్తాయని రాజకీయ పరిశీలకులు చెబుతున్నారు. ఇదంతా  ఎన్నికల యుద్దంలో ఓటర్లను ప్రభావితం చేసే మైండ్ గేమన్నది మాత్రం సుస్ఫష్టం.