Nirmal Police: మారణాయుధాలను చేతబట్టి రీల్స్ పేరుతో సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తూ అసాంఘిక కార్యక్రమాలకు పాల్పడితే కఠిన చర్యలు తప్పవని నిర్మల్ జిల్లా ఎస్పీ జానకి షర్మిల హెచ్చరించారు. గత కొన్ని రోజులుగా సోషల్ మీడియాలో పోస్టులు అప్లోడ్ చేస్తూ నేరాలకు పాల్పడుతున్న ముగ్గురు యువకుల ముఠాను పోలీసులు అరెస్టు చేశారు. నిర్మల్ జిల్లా కేంద్రంలోని జిల్లా పోలీసు కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో జిల్లా ఎస్పి వివరాలను వెల్లడించారు. నిర్మల్ జిల్లా కేంద్రానికి చెందిన అవేష్ చౌస్, మతీనొద్దీన్, షేక్ ఆదిల్ అనే ముగ్గురు యువకులు మతీన్ మాఫియా పేరుతో ఒక ముఠాగా ఏర్పడ్డట్లు తెలిపారు. 


రిల్స్ చేస్తూ.. రాత్రి సమయంలో ఒంటరిగా వెళ్తున్న వ్యక్తులపై, ఆర్టీసీ బస్టాండ్ లో ప్రయాణికులపై బెదిరింపులకు పాల్పడుతూ దొంగతనాలకు పాల్పడ్డారని తెలిపారు. ఉదయం నిర్మల్ పట్టణంలో వాహనాలను తనిఖీ చేస్తుండగా పోలీసులను చూసి పారిపోతున్న వీరిని పట్టుకున్నట్లు తెలిపారు. తమదైన శైలిలో విచారించడంతో నేరాలను ఒప్పుకున్నట్లు తెలిపారు. వీరి వద్దనుండి డమ్మీ తుపాకీతోపాటు మూడు సెల్ ఫోన్లు, ఒక స్కూటీని స్వాధీనం చేసుకున్నట్లు పేర్కొన్నారు.


ఎవరైనా సరే సోషల్ మీడియా మోజులో పడి అసాంఘిక కార్యక్రమాలకు పాల్పడవద్దని హితవు పలికారు. ప్రతి ఒక్కరి పోస్టులను సోషల్ మీడియా మానిటరీ సెల్ గమనిస్తూ ఉంటుందని, ప్రతి ఒక్కరు జాగ్రత్తగా ఉండాలని సూచించారు. పట్టుకున్న యువకులను రిమాండ్ కు తరలించినట్లు తెలిపారు. యువకులను చాకచక్యంగా పట్టుకున్న పోలీసు అధికారులను ఎస్పి అభినందించారు.