AP Latest News: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాలలో వివిధ పార్టీల నాయకులు రాజకీయ వైరంతో కాకుండా ప్రత్యర్థి పార్టీ నేతలను శత్రువులుగా చూస్తున్న పరిస్థితిని ప్రస్తుతం మనం చూస్తూనే ఉన్నాం. ముఖ్యంగా రెండు దశాబ్దల క్రితం రాజకీయ వైరం.. రాజకీయ నేతల స్నేహం చూసేవాళ్ళం. గతంలో రాష్ట్రంలో ఏ పార్టీ అధికారంలో ఉన్నా కేవలం అసెంబ్లీలో మాత్రమే వారు ప్రత్యర్థి పార్టీ నేతలకు చురకలు అంటించే విధంగా మాత్రమే మాట్లాడేవారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఆ పరిస్థితి కనిపించడం లేదు. ఏకంగా పార్టీ అధినేతలను.. పార్టీ సీనియర్ నేతలను వ్యక్తిగత విషయాలను కూడా బహిరంగంగానే మాట్లాడుకుంటూ బద్ధశత్రువులగా ఉన్న పరిస్థితిని మనం చూస్తూనే ఉన్నాం.


కానీ, ప్రస్తుతం సత్యసాయి జిల్లా మడకశిర నియోజకవర్గం ఎమ్మెల్యే యంఎస్ రాజు ఇందుకు భిన్నంగా వ్యవహరించిన తీరు ప్రస్తుతం సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది. మడకశిర నియోజకవర్గం గుడిబండ మండలం సర్వసభ్య సమావేశానికి ఎమ్మెల్యే ఎమ్మెస్ రాజు వెళ్తున్న సందర్భంలో దారి మధ్యలో మడకశిర నియోజకవర్గం వైసీపీ పార్టీ అభ్యర్థి ఈర లక్కప్పను వారి ఇంటి వద్దనే ఎమ్మెల్యే ఎమ్మెస్ రాజు కలిశారు. 


2024 ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ నుంచి ఎమ్మెస్ రాజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి ఈర లక్కప్ప పోటీ చేశారు ఈ ఎన్నికల్లో వైఎస్ఆర్సీపీ అభ్యర్థి ఎమ్మెస్ రాజు విజయం సాధించారు. ఎమ్మెల్యేగా ఎన్నికైన అనంతరం మొదటిసారి గుడిబండ మండలానికి వెళ్లిన ఎమ్మెల్యే రాజు ఈర లక్కప్పను కలవడం అందరిని ఆశ్చర్యానికి గురిచేసింది. అయితే ఈ సందర్భంగా ఎమ్మెస్ రాజు మాట్లాడుతూ.. ఎన్నికల్లో మాత్రమే మా పార్టీకి వ్యక్తులు ఉంటారు కానీ ఎన్నికలు అయిపోయిన తర్వాత అందరితో కలిసికట్టుగా అన్నదమ్ముల్లాగా ఉంటామని అన్నారు. మడకశిర నియోజకవర్గం అభివృద్ధికి కృషి చేసే ఎవరినైనా తాము కలుపుకొని వెళ్తానని మాట్లాడారు.