Nirmal News : నిర్మల్ జిల్లా కడెం మండలంలోని మారుమూల గ్రామాలలో ఖానాపూర్ ఎమ్మెల్యే అజ్మీర రేఖా నాయక్ పర్యటించారు. కడెం మండలంలోని మారుమూల గ్రామాలైనా గంగాపూర్, రామిగూడా, కొర్రతండాలతో పాటు సుమారు తొమ్మిది గ్రామాలకు గత కొద్దిరోజుల నుంచి కురుస్తున్న భారీ వర్షాల కారణంగా సుమారు 20 రోజుల నుంచి కనీస రోడ్డు సౌకర్యం లేకుండా ఇబ్బందులకు గురవుతున్న గ్రామస్తులను ఖానాపూర్ ఎమ్మెల్యే అజ్మీర రేఖా నాయక్ పరామర్శించి వారి సమస్యలు అడిగి తెలుసుకున్నారు.


వాగులు దాటి, తెప్పపై  


ఆ గ్రామాలకు వెళ్లాలంటే వాగులు దాటాలి. అయితే వాగు దాటేందుకు వంతెన లేదు. గ్రామస్తులు ఏర్పాటు చేసిన ఓ నాటు తెప్ప సాయంతో సాహసం చేసి ప్రయాణించాలి. అడవి మార్గంలో ఉన్న ఓ రోడ్డు, మార్గ మధ్యలోని 3 వాగులు ఉప్పొంగి ప్రవహించడంతో వంతెనలతో సహా రోడ్లు కూడా పూర్తిగా దెబ్బతిన్నాయి. అయితే సోమార్ పేట్ వద్ద నిర్మిస్తున్న వంతెనను ఎమ్మెల్యే రేఖా నాయక్ పరిశీలించి అక్కడ నుంచి వాగులో తెప్పపై సాహసంగా ప్రయాణం చేసి వాగు దాటి కాలినడకన కడెం మండలంలోని గ్రామాలలో పర్యటించారు. మార్గమధ్యలో రోడ్డు పూర్తిగా దెబ్బతినడంతో ఎడ్లబండిపై ప్రయాణించి ఆయా గ్రామాలకు చేరుకుని ప్రజల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. 


రోడ్లు, వంతెనలను పునరుద్ధరించాలని ఆదేశాలు 


గంగాపూర్, రామిగూడా, కొర్రతాండ గ్రామస్తులు, సర్పంచ్ లతో కలిసి భారీ వర్షాల కారణంగా జరిగిన నష్టం గురించి ఎమ్మెల్యే రేఖా నాయక్ ఆరా తీశారు. గ్రామాలలో దెబ్బతిన్న రోడ్లు, బ్రిడ్జిలు, కల్వర్టులను పరిశీలించి సంబంధిత శాఖ అధికారులకు త్వరితగతిన రోడ్లు, వంతెనల పనులను పునరుద్ధరించాలని ఎమ్మెల్యే సూచించారు. భారీ వర్షాలతో దెబ్బతిన్న పంటలను స్థానిక రైతులతో కలిసి పరిశీలించారు. గ్రామస్తుల చాలా ఇబ్బందులు పడుతున్నారని, త్వరలో నియోజకవర్గానికి రాబోతున్న సీఎం కేసీఆర్ దృష్టికి ముంపు గ్రామ ప్రజల సమస్యలను తీసుకువెళ్తామన్నారు. ముంపునకు గురైన వారి సమస్యలను తొందరలోనే పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. గ్రామస్తులు సైతం అత్యవసర పరిస్థితి ఉంటేనే వాగులో తెప్పపై జాగ్రత్తగా దాటాలని..వర్షంలో వాగు ఉప్పొంగినప్పుడు అనవసరంగా వెళ్ళొద్దని, భారీ వర్షాలతో అందరు అప్రమత్తంగా ఉండాలన్నారు. 


Also Read : Appalraju In Tirumala : 140 మంది మంత్రి అప్పల్రాజు అనుచరులకు వీఐపీ దర్శనాలు ! టీటీడీ రియాక్షన్ ఏంటి ?


Also Read : NTR District News : తల్లిదండ్రులకు భారం కాకూడదని విద్యార్థిని ఆత్మహత్య, కన్నీళ్లు పెట్టిస్తున్న సూసైడ్ నోట్!