Appalraju In Tirumala : శ్రీనివాసుడి ముందు అందరూ సమానమే. కానీ వీఐపీలు మాత్రం తాము ఎక్కువ సమానం అన్నట్లుగా వ్యవహరిస్తున్నారు. అనుచరులతో కొండపైకి వచ్చి లెక్కాపత్రం .. టిక్కెట్లు లాంటివేమీ లేకుండా నేరుగా ప్రోటోకాల్ దర్శనాలు పొందుతున్నారు. తాజాగా శ్రీకాకుళం నుంచి 140 మంది అనుచరులతో తిరుమల వచ్చిన మంత్రి అప్పల రాజు చేసిన రచ్చ మరోసారి చర్చనీయాంశం అయింది.
కేవలం పది మందికి మాత్రమే ప్రోటోకాల్ దర్శనాలు జారీ నిబంధనలు ఉన్నప్పటికి పదుల సంఖ్యలో అనుచరులని వెంట పెట్టుకుని మంత్రులు రావడం.. అనుమతించకపోవడంతో తీవ్ర స్థాయిలో ఒత్తిళ్లు తీసుకు రావడం కామన్‌గా మారింది. శ్రీవారి దర్శనాలు అమలు విధానంలో టీటీడి అవలంభిస్తున్న తీరు వివాదాస్పదంగా మారింది.. భక్తుల రద్దీ పేరుతో సామాన్య భక్తులను గంటల తరబడి వేచి ఉంచే టిటిడి.. ప్రముఖులకు మాత్రం సాగిలపడి సేవలు అందిస్తోంది. గురువారం ఉదయం వి.ఐ.పి బ్రేక్ దర్శనంలో ఏపి మంత్రి అప్పలరాజుతో పాటుగా తన అనుచరులైన దాదాపు 140 మందికి బ్రేక్ దర్శనం కల్పించడం చర్చనీయంగా మారింది.
ఇక దర్శనం తర్వాత బయటకు వచ్చిన మంత్రే స్వయంగా 140 మంది తన నియోజకవర్గం ప్రజలు కలిసి స్వామి వారి దర్శనం చేసుకోవడం చాలా సంతోషంగా ఉందని చెప్పడం దుమారం రేపుతోంది. సిఫారస్సు లేఖలపై స్వయంగా ప్రముఖులు వస్తే కానీ టిక్కెట్లను కేటాయించని టీటీడి.. అందులోను ప్రముఖులు మరియు వారి కుటుంబ సభ్యులకు మాత్రమే దర్శనాలను కేటాయిస్తుంది . అలాంటిది అధికారపార్టికి చేందిన మంత్రి కావడంతో అధికారులు ఈ నిబం
ధనలను పక్కన పెట్టేశారు. 10 కాదు, 20కాదు, ఏకంగా 140 టిక్కెట్లను జారీ చేయడమే కాకుండా అందరి కంటే ముందు మంత్రిని ఆయన పరివారాన్ని ఆలయంలోకి పంపించి ప్రోటోకాల్ మర్యాదలతో స్వామి వారి దర్శనాని కల్పించారు.
ఇక భక్తులకు మాత్రం ఓ సిఫార్సు లేఖపై కేవలం 6బ్రేక్ దర్శన టిక్కెట్లను మాత్రమే జారీ చేస్తుంది టీటీడీ. తమ కుటుంబ సభ్యులలో ఒక్కరిద్దరు అదనంగా ఉన్నారు దర్శనం కల్పించాలని ఎంత విన్నవించుకున్నా ఒక్క సిఫారస్సు లేఖపై 6మందికి మాత్రమే దర్శన టిక్కెట్లను కేటాయిస్తారు. ప్రముఖులకు మాత్రం ఇబ్బడి ముబ్బడిగా టిక్కెట్లను జారీ చేయడంపై భక్తులు మండి పడుతున్నారు.. తమకో న్యాయం ప్రముఖులకు మరోక్క న్యాయమా అంటూ భక్తులు టీటీడీ తీరుపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు..
మంత్రి అప్పలరాజు అనుచరులతో కలిసి శ్రీవారి దర్శనం చేసుకున్న తీరును టీటీడీ సమర్థిస్తోంది. మంత్రితో పాటుగా వచ్చిన వారు కేవలం నలభై మంది మాత్రమేనని ఇక మంత్రితో పాటుగా వచ్చిన వారి అనుచరులు వంద మంది తన దర్శనంకు వివిధ రాజకీయ ప్రముఖులు, అధికారుల సిఫార్సు లేఖలు తీసుకుని వచ్చారని చెబుతున్నారు. మంత్రి అప్పలరాజు తనతో పాటుగా వచ్చిన నలభై మంది ప్రోటోకాల్ దర్శనం కావాలని కోరాగా, అందుకు టిటిడి ఈవో ధర్మారెడ్డి నిరాకరించి ప్రోటోకాల్ ప్రకారం కేవలం ఇరవై మందికి మాత్రమే దర్శనంకు అనుమతించే అవకాశం ఉందని,ఈ మేరకు ఇరవై మందికి ప్రోటోకాల్, ఇరవై మందికి జనరల్ బ్రేక్ దర్శనం కేటాయించడం జరిగిందని టిటిడి అధికారులు చెబుతున్నారు.