Nirmal Bus Electrocution : నిర్మల్ జిల్లాలో విద్యార్థులు ప్రయాణిస్తున్న బస్సుకు ప్రమాదం జరిగింది. జిల్లాలోని కుంటాల మండలం కల్లూరు గ్రామంలో సాయిబాబా ఆలయం వద్ద ఓ ప్రైవేట్ బస్సుకు విద్యుత్ తీగలు తగిలాయి. దీంతో బస్సులో ప్రయాణిస్తున్న ఇద్దరు విద్యార్థులకు గాయాలయ్యాయి. ఆదిలాబాద్ కు చెందిన ఓ ప్రైవేట్ బస్ లో ఓ ప్రైవేట్ పాఠశాలకు చెందిన 56 మంది విద్యార్థులు విహారయాత్రలో భాగంగా బాసర అమ్మవారిని దర్శించుకున్నారు. అనంతరం కల్లూరులోని సాయిబాబా దర్శనం కోసం వస్తుండగా బస్ పై భాగంలో విద్యుత్ తీగ తగలడంతో స్పార్క్ వచ్చింది. దీంతో బస్సులో పలువురు విద్యార్థులకు గాయాలయ్యాయి. ఈ విద్యుత్ ప్రమాదంలో ఇద్దరు విద్యార్థులకు తీవ్ర గాయాలు కావడంతో వారిని హుటా హుటీన భైంసా ఏరియా ఆసుపత్రి తరలించారు. ఆసుపత్రిలో వైద్యులు వారికి మెరుగైన చికిత్స అందిస్తున్నారు. బస్సు డ్రైవర్ చాక చాకచక్యంగా వ్యవహరించి బస్సును పక్కకు తీసుకెళ్లడంతో పెద్ద ప్రమాదం తప్పింది. విద్యార్థులకు గాయాలు కావడంతో తల్లిదండ్రులు ఆందోళన చెందుతున్నారు.
సెల్ ఛార్జింగ్ తీస్తుండగా విద్యుత్ షాక్
జోగులాంబ గద్వాల్ జిల్లాలో ఇటీవల ఓ విషాద ఘటన జరిగింది. సెల్‌ఫోన్ ఛార్జర్ పదేళ్ల బాలికను బలితీసుకుంది. 10 ఏళ్ల బాలిక నిహారిక స్విచ్ బోర్డ్ ప్లగ్ నుంచి సెల్ ఫోన్ ఛార్జర్ తీసేందుకు ప్రయత్నిస్తుండగా విద్యుత్ షాక్ తగిలింది. దీంతో ఆ చిన్నారి అక్కడికక్కడే మృతి చెందింది. విద్యుత్ సరఫరా లైన్లలో సమస్య కారణంగా ఈ ఘోరం జరిగిందని కుటుంబ సభ్యులు అంటున్నారు. ఆ సమయంలో హై వోల్టేజీ సరఫరా అయిందని అంటున్నారు. ఛార్జింగ్‌లో ఉన్న సెల్ ఫోన్ తీస్తుండగా షాక్ తగిలి నిహారిక అనే పదేళ్ల బాలిక అక్కడికక్కడే మృతిచెందింది. నిహారిక స్థానిక పాఠశాలలో 4వ తరగతి చదువుతుంది. కూతురు ఆకస్మిక మరణంతో తల్లిదండ్రులు గుండెలు పగిలేలా రోధిస్తున్నారు. ఇటీవల కాలంలో సెల్‌ఫోన్‌లు, ఎలక్ట్రిక్ వాహనాలు పేలుతున్న ఘటనలు జరుగుతున్నాయి. ఈ ప్రమాదాల్లో ప్రాణాలు కోల్పోయిన సందర్భాలు కూడా ఉన్నాయి. ఛార్జింగ్ పెట్టి ఫోన్ మాట్లాడవద్దని, పిల్లలను ఎలక్ట్రిక్ పరికరాలకు దూరంగా ఉంచాలని నిపుణులు సూచిస్తున్నారు. ఛార్జింగ్ పెట్టిన ఫోన్ లో మాట్లాడుతుండగా పేలిన సందర్భాలు ఉన్నాయి. అలాగే ఫోన్ ఓవర్ హీట్ కారణంగా ప్రమాదాలు జరిగాయి. నిత్యం ఉపయోగించే సెల్ కూడా కొన్నిసార్లు తీవ్ర ప్రమాదాలకు కారణం అవుతున్నాయి. సెల్ ఫోన్ వినియోగంలోనూ జాగ్రత్తలు పాటించాల్సి ఉంటుందని ఇలాంటి ఘటనలు మనకు తెలియజేస్తున్నాయి.
విద్యుత్ షాక్ తో చిన్నారి మృతి
తూర్పుగోదావరి జిల్లాలో ఇటీవల విద్యుదాఘాతానికి గురైన బాలుడు మృతి చెందాడు. తూర్పు గోదావరి జిల్లా తాళ్లపూడి మండలం పైడిమెట్ట గ్రామానికి జొన్నకూటి వినోద్ లారీ డ్రైవర్, భార్య చాందిని గృహిణి. వీరి పెద్ద కుమారుడు అక్షిత్ యూకేజీ చదువుతున్నాడు. రెండో కుమారుడు దర్శిత్ కు మూడేళ్లు. నవంబర్ 12వ తేదీన తల్లి భవనంపై దుస్తులు ఆరేయడానికి తల్లి వెళ్లగా.. ఆమెతో పాటే దర్శిత్ కూడా వెళ్లాడు. ఆమె పనిలో నిమగ్నం అవ్వగా.. చిన్నారి అక్కడున్న 33 కేవీ విద్యుత్తు తీగల సమీపానికి వెళ్లి విద్యుదాఘాతానికి గురై స్పృహ కోల్పోయాడు. అప్పటి వరకు ఆడుకుంటున్న కుమారుడు పడిపోవడంతో చాందిని ఆందోళనకు గురైంది. హుటాహుటిన స్థానిక ప్రైవేటు ఆస్పత్రికి తరలించారు. అక్కడి నుంచి మెరుగైన చికిత్సకు కాకినాడలోని జీజీహెచ్ కు తీసుకెళ్లారు. నాలుగు రోజుల చికిత్స అనంతరం ఇన్ ఫెక్షన్ సోకడంతో బాలుడికి రెండు కాళ్లూ మోకాళ్ల కింది వరకు తొలగించారు వైద్యులు. అనంతరం బాలుడి పరిస్థితి మరింత విషమించి మృతి చెందాడు.