Chandrababu Polavaram :  " ఇదేమి ఖర్మ.. రాష్ట్రానికి  "కార్యక్రమంలో భాగంగా గోదావరి జిల్లాల్లో పర్యటిస్తున్న చంద్రబాబు పోలవరంలో పర్యటించేందుకు పోలీసులు అడ్డంకులు సృష్టించారు. పోలవరం వైపు వెళ్లకుండా పోలీసులు పెద్ద ఎత్తున వాహనాలను రోడ్డుకు అడ్డంగా పెట్టారు. మధ్యాహ్నం నుంచే పోలీసులు పోలవరం ప్రాంతంలో మహోరించారు. టీడీపీ శ్రేణులు, చంద్రబాబు పోలవరం వైపు వెళ్లకుండా బారీకేడ్లు ఏర్పాటు చేశారు. వాటిని పెద్ద సంఖ్యలో ఉన్న టీడీపీ కార్యకర్తలు తోసుకెళ్లే అవకాశం ఉండటంతో పోలవరం ప్రాజెక్ట్ నిర్మాణంలో ఉపయోగించే పెద్ద పెద్ద లారీలను తీసుకొచ్చి  రోడ్డుకు అడ్డంగా పెట్టారు. చంద్రబాబు వచ్చే సరికి రోడ్డు పూర్తిగా బ్లాక్ అయిపోయింది. దీంతో చంద్రబాబునాయుడు పోలీసులపై మండిపడ్డారు. 


పోలవరం నిషేధిత ప్రాంతమా..ఎందుకు వెళ్లకూడనది ప్రశ్నించారు. పోలీసుల తీరుకు నిరసనగా అక్కడే ధర్నాకు కూర్చున్నారు. అయినప్పటికీ పోలీసులు దారి ఇవ్వలేదు. ధర్నా సమయంలో మీడియాతో మాట్లాడిన చంద్రబాబు పోలవరం ప్రాజెక్టును వైసీపీ ప్రభుత్వం పట్టించుకోవడం లేదని మండిపడ్డారు. రాష్ట్ర విభజన సమయంలో పోలవరం ప్రాజెక్ట్ కోసం ఎంతో శ్రమించానన్నారు. ఏడు మండలాలు కలిపితేనే ప్రమాణస్వీకారం చేస్తానని చెప్పానన్నారు. ఆ తర్వాత కూడా కేంద్రం ఇచ్చిన నిధులతో వేగంగా నిర్మాణం చేశామని అన్నారు. కానీ జగన్ సీఎం అయిన తర్వాత రివర్స్ టెండరింగ్ పేరుతో పూర్తిగా నాశనం చేశారని విమర్శలు గుప్పించారు.  టీడీపీ హయాంలోనే పోలవరాన్ని 75 శాతం పూర్తిచేశామని, ప్రాజెక్ట్‌ పెండింగ్‌ పనులను కూడా ప్రభుత్వం పూర్తిచేయట్లేదని తప్పుబట్టారు. టీడీపీని విమర్శించడం తప్ప ప్రభుత్వం చేసిందేమీ లేదని చంద్రబాబు మండిపడ్డారు.


జగన్‌రెడ్డి పాలనలో ఒక్కరికైనా జాబు వచ్చిందా? అని ప్రశ్నించారు. జగన్‌రెడ్డి వచ్చాక ఏపీ నుంచి పెట్టుబడులన్నీ తరలివెళ్తున్నాయని తెలిపారు. యువతకు జాబు రావాలంటే బాబు రావాలన్నారు. జగన్‌రెడ్డి పాలనలో ఇసుక, మద్యం, ఖనిజాల దోపిడీకి పాల్పడుతున్నారని ఆరోపించారు. ప్రభుత్వం టిడ్కో ఇళ్లను పేదలకు ఇప్పటికీ ఇవ్వడంలేదన్నారు. పేదలకు 30 లక్షల ఇళ్లు కట్టి ఇస్తామన్న జగన్‌రెడ్డి హామీ ఏమైంది? అని ప్రశ్నించారు. మద్యపాన నిషేధమంటూ జేబ్రాండ్లు తీసుకొచ్చారని, కల్తీ మద్యంతో ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతున్నారని చంద్రబాబు మండిపడ్డారు.


అంతకు ముందు చంద్రబాబు పోలవరం పర్యటనకు వెళ్తున్నారని తెలిసిన తర్వాత మంత్రి అంబటి రాంబాబు అమరావతిలో కీలక వ్యాఖ్యలు చేశారు. పోలవరం దగ్గర బహిరంగసభ పెట్టడానికి అనుమతి లేదని ఉద్రిక్త పరిస్థితులు సృష్టించడానికి వెళ్తురన్నారని విమర్శలు గుప్పించారు. పోలవరం ప్రాజెక్టుకు అయ్యే ఖర్చు అంతా కేంద్రం భరించి నిర్మాణం చేయాలని విభజన చట్టంలో ఉంది,ఆ చట్టాన్ని పక్కన పెట్టేసి మేమే పోలవరం నిర్మిస్తామని చంద్రబాబు ఎందుకు భుజాన వేసుకున్నారో చెప్పాలని అంబటి రాంబాబు ప్రశ్నించారు.  2018 కల్లా పోలవరం లెఫ్ట్ అండ్ రైట్ కెనాల్ కి నీళ్లు ఇచ్చి ఎన్నికలకు వెళ్తామని శాసనసభలో బల్ల గుద్ది సవాల్ చేసిన చంద్రబాబు ఎందుకు పూర్తి చేయలేదన్నారు.  ఫర్ డ్యాం నిర్మాణం లేకుండా డయాఫ్రమ్వాల్ ఎలా నిర్మించారు ఇది చరితాత్మకమైన తప్పిదం కాదా….? అని ప్రశ్నించారు.