Basara IIIT : నిర్మల్ జిల్లాలోని బాసర ట్రిపుల్ ఐటీ వరస వివాదాలతో నిత్యం వార్తల్లో నిలుస్తోంది. ట్రిపుల్ ఐటీలో సౌకర్యాలు సరిగ్గా లేవని విద్యార్థులు ఆందోళనతో మొదలైన తంతు నేటికీ ఏదో రూపంలో నడుస్తోంది. ఇటీవల మెస్ లలో ఫుడ్ పాయిజన్ అయి 300 పైగా విద్యార్థులు అస్వస్థతకు గురయ్యారు. మెస్ నిర్వాహకుల తీరుపై విద్యార్థులు ఆందోళన వ్యక్తంచేస్తున్నారు. చివరకి మంత్రి కలుగజేసుకున్నా ఇచ్చిన హామీలు నెరవేర్చలేదని విద్యార్థులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. విద్యా్ర్థుల సమస్యలను ప్రత్యక్షంగా అడిగి తెలుసుకునేందుకు గవర్నర్ తమిళి సై ట్రిపుల్ ఐటీలో పర్యటించనున్నారు. 


ట్రిపుల్ ఐటీకి గవర్నర్ 


ప్రభుత్వం తమ సమస్యలపై నిర్లక్ష్యం వహిస్తుందని విద్యార్థులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అధికారులు ఇచ్చిన హామీలు నెరవేర్చాలని అందుకోసం వారంపాటు ఆందోళనలను వాయిదా వేస్తున్నట్లు ప్రకటించారు. ఈ క్రమంలో గవర్నర్ తమిళిసై బాసర ట్రిపుల్ ఐటీలో విద్యార్థులతో భేటీ కానున్నారు. గవర్నర్‌ తమిళి సై సౌందరరాజన్ శనివారం రాత్రి రైలులో బాసర బయలుదేరనున్నారు. బాసర చేరుకున్న తర్వాత ముందుగా సరస్వతీ దేవీ ఆలయంలో ప్రత్యేక పూజలు చేయనున్నారు. అనంతరం గవర్నర్ తమిళి సై బాసర ట్రిపుల్‌ ఐటీ క్యాంపస్‌కు వెళ్తారు. ట్రిపుల్ ఐటీలో విద్యార్థులతో గవర్నర్ భేటీ అవుతారు. విద్యార్థుల సమస్యలను  స్వయంగా అడిగి తెలుసుకోనున్నారు. గవర్నర్‌ తమిళి సై రేపు రాత్రి బాసరలోనే బస చేయనున్నారు. 


గవర్నర్ వద్దకు విద్యార్థులు 


బాసర ట్రిపుల్ ఐటీ సమస్యలకు నిలయంగా మారింది. కుళ్లిన గుడ్లు, పురుగుల అన్నం పెడుతున్నారని విద్యార్థులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. మెస్ నిర్వాహకులను మార్చాలని కోరుతున్నారు. ఇటీవల బాసర ట్రిపుల్ ఐటీ విద్యార్థులు గవర్నర్ తమిళి సై ను కలిశారు. బాసర ట్రిపుల్ ఐటీలో నెలకొన్న సమస్యలపై విద్యార్థులు ఎన్ని ఆందోళనలు చేసినా ప్రభుత్వం పట్టించుకోవటం లేదని గవర్నర్ కు ఫిర్యాదు చేశారు. ప్రభుత్వం దృష్టికి ఎన్నిసార్లు తమ సమస్యలను తీసుకెళ్లినా పట్టించుకోవడంలేదని ట్రిపుల్ ఐటీ విద్యార్థులు గవర్నర్ కు వివరించారు. దీంతో విద్యార్థుల సమస్యలను స్వయంగా తెలుసుకునేందుకు గవర్నర్ బాసర ట్రిపుల్ ఐటీలో పర్యటించున్నారు. 


వివాదాల సుడిగుండంలో బాసర ట్రిపుల్ ఐటీ


బాసర ట్రిపుల్ ఐటీలో రోజుకో వివాదం వెలుగు చూస్తోంది. ఏదో వివాదంతో నిత్యం వార్తల్లోకి ఉండటం బాసర ట్రిపుల్ ఐటీకీ కామన్ అయిపోయింది. తాజాగా ట్రిపుల్ ఐటీ మెస్‌లోని సిబ్బంది అక్కడే స్నానం చేస్తున్న తీరును విద్యార్థులు వెలుగులోకి తెచ్చారు. ఓవైపు వంట చేస్తుండగా మరోవైపు సిబ్బంది స్నానం చేస్తున్నారు. అందుకు సంబంధించిన వీడియోలను విద్యార్థులు సెల్‌ఫోన్‌లో షూట్ చేశారు. వంట పక్కనే ఇంత నిర్లక్ష్యంగా స్నానాలు చేస్తుండటాన్ని విద్యార్థులు తప్పుబట్టారు. కనీస శుభ్రత పాటించటం లేదని వాపోతున్నారు. ఇటీవలి కాలంలో ఫుడ్ పాయిజన్ అయిన సందర్భాలు చాలానే ఉన్నాయి. నిన్నటికి నిన్న విద్యార్థులు కలుషిత ఆహారం తిని అస్వస్థతకు గురయ్యారు. ఇంత జరుగుతున్నా సిబ్బంది మెస్‌లోనే ఇలా స్నానాలు చేయటంపై విద్యార్ఖులు ఆందోళన చెందుతున్నారు. ఓ వైపు అధికారులు జాగ్రత్తలు తీసుకుంటున్నామని పైకి చెబుతునారే తప్ప లోపల మరోలా ఉందని విద్యార్థులు మండిపడుతున్నారు.