Alleti Maheshwar Reddy : కాంగ్రెస్ లో మహేశ్వర్ రెడ్డి పనైపోయిందని, ఆయన పార్టీ మారడానికి సిద్ధంగా ఉన్నారని మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి అన్నారు. ఈ వ్యాఖ్యలపై ఏఐసీసీ కార్యక్రమాల అమలు కమిటీ ఛైర్మన్ ఏలేటి మహేశ్వర్ రెడ్డి స్పందించారు.  మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి తీరు వంద ఎలుకలు తిన్న పిల్లి, దొంగ జపం చేసినట్లు ఉందని కౌంటర్ ఇచ్చారు. పార్టీలు మారే రాజకీయాలు నేను చేయలేదు, రెండు సార్లు ఓటమి చవిచూసినా, కష్టాలు ఎదురైనా  కాంగ్రెస్ పార్టీలోనే ఉన్నా తప్పా పార్టీలు మారలేదని గుర్తుచేశారు. ఆరు నెలల్లోనే ఐదు పార్టీలు మారిన చరిత్ర, అవకాశ వాద రాజకీయాలు చేసే చరిత్ర మంత్రి ఇంద్రకరణ్ రెడ్డిదని విమర్శించారు. ఇంద్రకరణ్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు హాస్యాస్పదం, అలాంటి వ్యక్తి నాపైన వ్యాఖ్యలు చేయడం సిగ్గుచేటన్నారు. పార్టీ మారాలనుకుంటే నాకు అడ్డు ఎవరు, కష్టమైనా నష్టమైనా కాంగ్రెస్ పార్టీలోనే తొమ్మిది సంవత్సరాల నుంచి ఉన్నానన్నారు. అధికారం ఉందని నా మీద దొంగ కేసులు పెట్టించారని ఆరోపించారు. మున్సిపల్ ఉద్యోగాల్లో ఏం జరిగిందో నిర్మల్ ప్రజలందరికీ తెలుసని మహేశ్వర్ రెడ్డి అన్నారు. 


దమ్ముంటే వాస్తవాలు బయటపెట్టాలి 


"స్వయంగా మీ కౌన్సిలరే అవినీతి జరిగిందని చెప్పిన మాట వాస్తవం కాదా, బాధితులకు అండగా నేను దీక్ష చేస్తే భయంతో ఎంక్వైరీకి ఆదేశించిన మాట వాస్తవం కాదా? కలెక్టర్ బదిలీపై వెళ్తూ నియామకాలు రద్దు చేసిన విషయం నిజం కాదా? అభ్యర్థులు కోర్టుకు వెళ్లి పోరాటం చేస్తున్న మాట వాస్తవం కాదా? ఇప్పటికీ డబ్బులు ఇచ్చిన ఎంతోమంది నిరుద్యోగులు మీ ఇంటి చుట్టూ తిరుగుతున్న మాట వాస్తవం కాదా? మున్సిపల్ నియామకాల్లో జరిగిన అక్రమాలను ప్రశ్నిస్తే కేసులు పెట్టించడం కాదు, దుమ్ముంటే మంత్రిగా వాస్తవాలను బయటపెట్టాలి. మంచి చేయమని మంత్రిగా అవకాశం కల్పిస్తే తొమ్మిదేళ్లుగా నువ్వు నిర్మల్ ప్రజలకు చేసిన అభివృద్ధి ఏంటో బహిరంగ చర్చకు రావాలి. నీ కుటుంబ సభ్యుల పేర్ల మీద ఎక్కడ భూములు ఉన్నాయో అక్కడ డీ1 పట్టాల పేరుతో కబ్జాలు, ఎక్కడ గుట్టలు ఉన్నాయో అక్కడ క్రషర్స్ పెట్టడం తప్పా నిర్మల్ ప్రజలకు నీవు చేసిన అభివృద్ధి ఏదీ? దమ్ముంటే రా డిబేట్ కు నేను సిద్ధం." - మహేశ్వర్ రెడ్డి


మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి ఏమన్నారంటే? 


 మున్సిప‌ల్ ఉద్యోగాల నియమాకాల్లో  త‌న‌పై కాంగ్రెస్ నేత, మాజీ ఎమ్మెల్యే మ‌హేశ్వర్ రెడ్డి వ్యాఖ్యల‌ను మంత్రి ఇంద్రక‌ర‌ణ్ రెడ్డి ఖండించారు. నిరాధార ఆరోప‌ణ‌లు చేయ‌డం కాద‌ని, ఆధారాలుంటే బ‌య‌ట‌పెట్టాల‌ని స‌వాలు విసిరారు.  అస‌త్య ప్రచారం చేస్తున్నందుకు పోలీసులు మ‌హేశ్వర్ రెడ్డిపై కేసు న‌మోదు చేశార‌ని స్పష్టం చేశారు. పోలీసులు ఇప్పటికే ఆయ‌న‌కు నోటీసులు జారీ చేశార‌ని, ఆరోప‌ణ‌లకు రుజువులు చూపాల‌న్నారు. త‌ప్పు చేస్తే  చ‌ట్ట ప్రకారం ఎలాంటి శిక్షకైనా త‌ను సిద్ధమ‌ని మంత్రి అన్నారు. కాంగ్రెస్ పార్టీలో ఏలేటి మ‌హేశ్వర్ రెడ్డి ప‌నైపోయింద‌ని, రేపో మాపో ఆయ‌న పార్టీ మారుడు ఖాయ‌మ‌న్నారు.  రాహుల్ గాంధీపై అన‌ర్హత వేటు వేస్తే మ‌హేశ్వర్ రెడ్డి, ఆ పార్టీ కార్యక‌ర్తలు స్పందించలేదని ఆరోపించారు. మ‌హేశ్వర్ రెడ్డిపై పోలీసుల కేసు న‌మోదు చేస్తే మాత్రం కాంగ్రెస్ కార్యకర్తలు ధ‌ర్నాలు చేస్తున్నార‌ని ఎద్దేవా చేశారు. రాహుల్ గాంధీ  లోక్‌సభ సభ్యత్వాన్ని ర‌ద్దు చేస్తే.... మొద‌టి స్పందించింది బీఆర్ఎస్ పార్టీయేనని,  కానీ  కాంగ్రెస్ పార్టీ మాత్రం నిస్సహాయ స్థితిలో ఉంద‌ని వ్యాఖ్యానించారు.