Bandi Sanjay :  బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ ఐదో విడత ప్రజా సంగ్రామ యాత్రకు పోలీసులు అనుమతి నిరాకరించారు.  నిర్మల్ వెళుతున్న బండి సంజయ్ ను జగిత్యాల దాటాక పోలీసులు అడ్డుకున్నారు. రోడ్డుకు అడ్డంగా వాహనాలను ఉంచి బండి సంజయ్ ను పోలీసులు చుట్టుముట్టారు. పాదయాత్రకు అనుమతి లేదంటూ పోలీసులు బండి సంజయ్ ను అడ్డుకున్నారు. పోలీసుల తీరుపై బీజేపీ కార్యకర్తలు మండిపడ్డారు. పోలీసులకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. దీంతో అక్కడ తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. ప్రజా సంగ్రామ యాత్రకు అనుమతి నిరాకరించడంతో కోరుట్ల సమీపంలోని వెంకటాపూర్ గ్రామ శివారులో బండి సంజయ్ కుమార్ ను పోలీసులు అడ్డుకున్నారు. దీంతో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. బీజేపీ కార్యకర్తలు, పోలీసుల మధ్య తోపులాట జరిగింది. బండి సంజయ్ ను అడ్డుకున్న పోలీసులు కరీంనగర్ కు తరలిస్తున్నారు. 


పాలన చేతకాకపోతే ఇంట్లో కూర్చోండి - బండి సంజయ్ 


పాద యాత్రకు ముందు అనుమతి ఇచ్చి ఇప్పుడు హఠాత్తుగా అనుమతి నిరాకరించడం ఏమిటని బీజేపీ చీఫ్ బండి సంజయ్ ప్రశ్నించారు. రేపు మహారాష్ట్ర ఉప ముఖ్యమంత్రి దేవేంద్ర పడ్నా వీస్ సభ కోసం ఏర్పాట్లు కూడా పూర్తయ్యాయని, రూట్ కూడా ప్రకటించాక హఠాత్తుగా పోలీసులు ఈ నిర్ణయం తీసుకున్నారని తెలిపారు. భైంసా సున్నిత ప్రాంతం అంటున్నారని, అదేమైనా నిషేధిత ప్రాంతమా? అక్కడికి ఎందుకు పోవద్దని బండి సంజయ్ ప్రశ్నించారు. భైంసానే కాపాడలేని ముఖ్యమంత్రి రాష్ట్రాన్ని ఏం కాపాడుతారని నిలదీశారు. సీఎంకు చేతకాకపోతే ఇంట్లో కూర్చోవాలన్నారు. పోలీసుల రిక్వెస్ట్ మేరకు తాను ప్రస్తుతానికి కరీంనగర్  వెళ్తున్నానన్నారు. రేపు(సోమవారం) మధ్యాహ్నం వరకు తమకు సమయం ఉందని, అప్పటి వరకూ వెయిట్ చేసి చూస్తామన్నారు. 


"రేపు సభకు వెళ్లి తీరుతా. పాదయాత్రకు అనుమతి కోసం న్యాయస్థానం తలుపు తడతాం. కేసీఆర్ నియంత పాలనకు ఇంతకంటే నిదర్శనం ఏం కావాలి? ప్రజాస్వామ్యబద్ధంగా పాదయాత్రకు వెళుతుంటే అడ్డుకుంటారా?" - బండి సంజయ్ 


బండి సంజయ్ పాదయాత్రకు అనుమతి నిరాకరణ 


నిర్మల్ జిల్లాలో బండి సంజయ్ నిర్వహించే 5వ విడత ప్రజా సంగ్రామ యాత్రకు పోలీసులు అనుమతి నిరాకరించారు. పాదయాత్రకు అనుమతి లేదని ఏఎస్పీ కిరణ్ ఖారే వెల్లడించారు. ప్రభుత్వ ఒత్తిడితోనే అనుమతి నిరారికరిస్తున్నారని బీజేపీ నాయకులు ఆందోళన చేస్తున్నారు. భైంసాలో పలువురు బీజేపీ నేతలను పోలీసులు హౌస్ అరెస్టు చేస్తున్నారు. దీంతో భైంసా లో టెన్షన్ వాతావరణం నెలకొంది. బీజేపీ నేతలు రామారావ్ పటేల్, మోహన్  రావ్ పటేల్ ను పోలీసులు హౌస్ అరెస్టు చేశారు. పోలీసులతో రామారావ్ పటేల్, బీజేపీ కార్యకర్తలు వాగ్వాదానికి దిగారు. పలువురు ఆందోళనకారులను పోలీసులు అరెస్టు చేశారు.  


భైంసాలో టెన్షన్ టెన్షన్ 


భైంసా టౌన్‌లో బీజేపీ ఆధ్వర్యంలో ప్రజా సంగ్రామ యాత్ర,  బహిరంగ సభకు అనుమతి నిరాకరిస్తున్నట్లు పోలీసులు తెలిపారు. భైంసా పట్టణం సున్నిత ప్రాంతం కావడంతో  అనుమతి నిరాకరించాని పోలీసులు వెల్లడించారు.  సోమవారం నుంచి భైంసాలో ప్రారంభమయ్యే 5వ విడత ప్రజా సంగ్రామ యాత్రకు పోలీసులు ఎన్ని అంక్షలు పెట్టినా సభ నిర్వహించి తీరుతామని ముధోల్ అసెంబ్లీ నాయకులు పవర్ రామారావు పటేల్ అన్నారు. బహిరంగ సభ పాదయాత్ర కోసం పోలీసుల అనుమతి కోరితే కావాలని అడ్డుకుంటున్నారని అన్నారు. బహిరంగ సభ పాదయాత్ర జరగకుండా ప్రభుత్వం కుట్రలు చేస్తుందని, కావాలనే అడ్డంకులు సృష్టిస్తుందని తెలిపారు. ప్రజా సంగ్రామ యాత్ర భారీ సక్సెస్ అవుతుందనే భయం ప్రభుత్వంలో పట్టుకుందని అందుకే అడ్డంకులు సృష్టిస్తుందని అన్నారు. లక్ష మందితో సభ పెట్టి తీరుతామని ప్రజా సమస్యల పై పోరాడుతామని రామారావు పటేల్ పేర్కొన్నారు.