టీఆర్ఎస్ బలమైన రాజకీయ పార్టీ అని, ఎవరి తాటాకు చప్పుళ్లకు టీఆర్ఎస్ భయపడదు అని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. ఈరోజు హైదరాబాద్ టీఆర్ఎస్ అడ్డాగా మారిందని, ఇక ఎన్ని రాజకీయ పార్టీలు వచ్చినా గులాబీ దళాన్ని ఏమీ చేయలేరని... 8 ఏళ్ల పాలనలో సీఎం కేసీఆర్ అనేక సంక్షేమ కార్యక్రమాలు చేపట్టారని మంత్రి తలసాని చెప్పారు. కాంగ్రెస్, బీజేపీ పార్టీలపై కీలక వ్యాఖ్యలు చేశారు. 125 సంవత్సరాల చరిత్ర కలిగిన పార్టీ అంతరించిపోతోందని, ప్రస్తుతం దానికి అతీగతీ లేదని ఎద్దేవా చేశారు. కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ పార్టీ నీటి మీద గాలి బుడగ లాంటిందని వ్యాఖ్యానించారు.
అభివృద్ది నిజమైతే ప్రధాని మోదీ పరుగులెందుకు !
హైదరాబాద్ లోని తెలంగాణ భవన్లో ఆదివారం ఏర్పాటు చేసిన ఓ సమావేశంలో మంత్రి తలసాని మాట్లాడుతూ.. గుజరాత్ లో బీజేపీ నిజంగానే బ్రహ్మాండంగా పనులు చేసి ఉంటే, సంక్షేమ కార్యక్రమాలు చేపట్టినట్లయితే ప్రధాని నరేంద్ర మోదీ వందల సార్లు అక్కడికి ఎందుకు వెళ్తున్నారని ప్రశ్నించారు. ఇటీవల జరిగిన మునుగోడు ఉప ఎన్నికల్లో కేంద్ర మంత్రులు, ఎంతో మంది బీజేపీ నేతలు గద్దల్లా తిరిగారని.. ఇప్పుడు అక్కడ ఒక్క బీజేపీ నేత కన్నెత్తి చూడటం లేదన్నారు. కేవలం ఒక్క టీఆర్ఎస్ నేతలు, కార్యకర్తలు మాత్రమే మునుగోడులు తిరుగుతున్నారని మంత్రి తలసాని తెలిపారు.
బీజేపీ తాటాకు చప్పుళ్లకు భయపడే పార్టీ టీఆర్ఎస్ కాదన్నారు. కానీ రాజకీయంగా ఎదుర్కోలేక టీఆర్ఎస్ నేతలను మంత్రులు, ఎమ్మెల్యేలను కేంద్రం ఇబ్బందులు పెడుతోందని మంత్రి తలసాని ఆరోపించారు. రాష్ట్ర మంత్రి మల్లారెడ్డి నివాసం, ఆస్తులపై, ఆయన బంధువుల ఇళ్లల్లో ఐటీ అధికారులు దాడులు సమయంలో చాలా అనైతికంగా ప్రవర్తించారని ఆయన మండిపడ్డారు. దర్యాప్తు సంస్థలను కేంద్రంలోని బీజేపీ తమ కక్ష సాధింపు చర్యలకు వాడుకుని దుర్వినియోగం చేస్తుందని విమర్శించారు. అందరికీ టైమ్ వస్తుందని, రాబోయే రోజుల్లో బీజేపీ నేతలకు ఇలాంటి పరిస్థితి వస్తుందన్నారు.
టీఆర్ఎస్ అడ్డాగా హైదరాబాద్
టీఆర్ఎస్ పార్టీ ఒక్కో మెట్టు ఎదుగుతూ నేడు హైదరాబాద్ టీఆర్ఎస్ అడ్డాగా మార్చుకుందని తలసాని అన్నారు. గడిచిన ఎనిమిదేళ్లలో రాష్ట్ర వ్యాప్తంగా అన్ని వర్గాల కోసం అనేక కార్యక్రమాలు చేపట్టి సంక్షేమ అభివృద్ది చేశామన్నారు. తాము ఏం చేశామో ప్రజలకు చెప్పేందుకు ఆత్మీయ సమ్మేళనాలను వేదికగా మార్చుకోవాలని గులాబీ శ్రేణులకు మంత్రి తలసాని సూచించారు. సమ్మేళానాలలో ఏవైనా సమస్యలను గుర్తిస్తే, వాటికి అక్కడే పరిష్కారం కనుగొనే ప్రయత్నం చేసి ముందుకు వెళ్లాలన్నారు. గడిచిన ఎనిమిదేళ్లలో ఎంతో మందికి సీఎం కేసీఆర్ ఎన్నో అవకాశాలు ఇచ్చారని, తమకు ఛాన్స్ రాలేదని కొంతమంది చెబుతుంటారని, అసంతృప్తులు ఉండడం సహజమన్నారు. అవకాశం కోసం వేచి చూస్తే, వారికి సైతం రాబోయే రోజుల్లో ఛాన్స్ దొరుకుతుందని స్పష్టం చేశారు. మొదట ఆత్మీయ సమ్మేళనాలు నిర్వహించి వాటిని విజయవంతం చేశాక, నగరంలోని నిజాం కాలేజీ మైదానంలో భారీ సభను నిర్వహిస్తామని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ వెల్లడించారు.