Revanth Reddy : తెలంగాణ కాంగ్రెస్ పరిస్థితి ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్నట్లుంది. పార్టీ పగ్గాలు ఎవరు చేపట్టినా పరిస్థితిలో మాత్రం మార్పు రావడంలేదు. తాజాగా సీనియర్ నేతలు ఒక్కొక్కరిగా పార్టీకి దూరం అవుతున్నారు. రేవంత్ రెడ్డి టీపీసీసీ అధ్యక్ష పదవి చేపట్టినప్పటి నుంచి కాంగ్రెస్ కు కాస్త మైలేజ్ వచ్చినప్పటికీ అంతర్గత కుమ్ములాటలు మాత్రం అలానే ఉన్నాయి. ప్రస్తుతం పార్టీలో సీనియర్స్ వర్సెస్ రేవంత్ రెడ్డి వార్ నడుస్తోంది. కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి, దాసోజు శ్రవణ్, మర్రి శశిధర్ రెడ్డి కాంగ్రెస్ కు గుడ్ బై చెప్పి ఇతర పార్టీల్లో చేరిపోయారు. పార్టీ మారుతున్నప్పుడు మాత్రం వీరు చెప్పిన కామన్ పాయింట్ మాత్రం రేవంత్ రెడ్డి. తెలంగాణ కాంగ్రెస్ పై అధిష్టానం దృష్టిపెట్టింది. కాంగ్రెస్ అగ్రనేత ప్రియాంక గాంధీకి తెలంగాణ కాంగ్రెస్ బాధ్యతలు అప్పగించారు. కాంగ్రెస్ అంతర్గత వ్యవహారాలను చక్కదిద్దేందుకు ప్రియాంక గాంధీ త్వరలో తెలంగాణలో పర్యటించనున్నారు.  


కాంగ్రెస్ ట్రస్ట్ నిధులు స్వాహా చేసిన శశిధర్ రెడ్డి! 


సీనియర్ నేతలు పార్టీని వీడుతుండడంపై టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి స్పందించారు. నేతలు ఒక్కొక్కరుగా పార్టీని వీడుతున్న క్రమంలో రేవంత్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. కాంగ్రెస్ పార్టీలో అందరూ తన న్యాయకత్వాన్ని అంగీకరిస్తున్నారని స్పష్టం చేశారు. టీపీసీసీ చీఫ్ పదవిని ఆశిస్తున్న ఆ నలుగురు వ్యక్తులు మాత్రం తన న్యాయకత్వాన్ని అంగీకరించడంలేదన్నారు. పార్టీలో అందరి అభిప్రాయాలు తీసుకున్నాకే నిర్ణయాలు తీసుకుంటామని, కానీ ఫలితం తేడా వస్తే మాత్రం అధ్యక్షుడిని తప్పుబడుతున్నారన్నారు. కాంగ్రెస్ ట్రస్ట్ కు సంబంధించి కోట్ల రూపాయలు మర్రి శశిధర్ రెడ్డి స్వాహా చేశారని రేవంత్  రెడ్డి ఆరోపించారు. ఆ లెక్కలు అడిగినందుకే శశిధర్ రెడ్డి బీజేపీలో చేరారని విమర్శించారు. దాసోజు శ్రవణ్ పార్టీని వీడడంపై కూడా రేవంత్ రెడ్డి మాట్లాడారు. ఖైరతాబాద్ కార్పొరేటర్ విజయారెడ్డి పార్టీలో చేరారని, ఆమెకు ఎమ్మెల్సీ టికెట్ ఇస్తామని, సర్వేలు అనుకూలంగా ఉంటే మాత్రం ఖైరతాబాద్ టికెట్ కూడా ఇస్తామని హామీ ఇచ్చామన్నారు. అయితే విజయారెడ్డిని తనకు వ్యతిరేకంగా తీసుకొచ్చామని భావించిన దాసోజు శ్రవణ్ పార్టీని వీడారని తెలిపారు. తాను టీపీసీసీ బాధ్యతలు చేపట్టిన తర్వాత నుంచి ముగ్గురు మాత్రమే పార్టీని వీడారని రేవంత్ రెడ్డి తెలిపారు. కానీ ఇదే సమయంలో కాంగ్రెస్ లోకి 30 మందికి పైగా నాయకులు చేరారన్నారు. రేవంత్ నాయకత్వాన్ని అంగీకరించని ఆ నలుగురు సీనియర్ నాయకులు ఎవరా అనే విషయంపై పార్టీలో చర్చ జరుగుతుంది. 


రేవంత్ పాదయాత్ర వర్సెస్ భట్టి పాదయాత్ర 


తాజాగా పాదయాత్ర విషయంలో కాంగ్రెస్ పార్టీలో  పెద్ద పంచాయితీనే నడుస్తోంది. ఇది ఎప్పుడైనా బ్లాస్ట్ కావొచ్చని ఆ పార్టీ నేతలు కంగారు పడుతున్నారు. ఈ పాదయాత్ర విషయంలో రేవంత్ రెడ్డి వర్సెస్ భట్టి విక్రమార్క అన్నట్లుగా పోరు నడుస్తోంది. రేవంత్ రెడ్డి తెలంగాణలో పాదయాత్రకు ముహుర్తం ఖరారు చేసుకున్నారు . డిసెంబర్ 9 నుంచి ఆయన పాదయాత్ర చేసేందుకు  సైలెంట్‌గా హైకమాండ్ వద్ద తనకు కావాల్సిన అన్ని రకాల అనుమతులు తెచ్చుకున్నారు.  తెలంగాణలో రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్రకు మంచి స్పందన వచ్చింది. అదే సమయంలో తెలంగాణలో కాంగ్రెస్‌ను అధికారంలోకి తేవడానికి తాను కూడా పాదయాత్ర చేయాలనుకుంటున్నానని చెప్పడంతో రాహుల్ అంగీకరించారు. ఇంకా అధికారిక ప్రకటన చేయలేదు కానీ.. కాంగ్రెస్ పార్టీలోని రేవంత్ వర్గీయులు ఇప్పటికే పాదయాత్ర ఏర్పాట్లు, రూట్ మ్యాప్ వంటి అంశాలపై కసరత్తు దాదాపుగా పూర్తి  చేశారు.  తెలంగాణలో ఎన్నికలకు ఇంకా ఖచ్చితంగా ఏడాది మాత్రమే సమయం ఉంది. ఆరు నెలల్లో తెలంగాణ మొత్తం పాదయాత్ర పూర్తి చేసి ఆ తర్వాత .. ఎన్నికల సన్నాహాలను ముందుండి చేయాలని రేవంత్ భావిస్తున్నట్లుగా తెలుస్తోంది.  


పాదయాత్ర తానూ చేస్తానని పట్టుదలగా భట్టి విక్రమార్క !


అయితే పాదాయత్ర ద్వారా కాంగ్రెస్ పార్టీకికాదని..  రేవంత్ వ్యక్తిగత ఇమేజ్ పెరుగుతుందని సీనియర్లు కాంగ్రెస్ పార్టీ హైకమాండ్‌కు ఫిర్యాదు చేశారు. ఒక్కరేవంత్ రెడ్డి మాత్రమే కాకుండా ఇతర నేతలు కూడా పాదయాత్ర చేసేలా అంగీకరించాలని ఒత్తిడి చేశారు. ఇప్పటికే కాంగ్రెస్ హైకమాండ్ రాహుల్‌గాంధీ చేపట్టిన భారత్‌ జోడో యాత్ర ముగిసిన రాష్ట్రాల్లో ఆయా రాష్ట్రాలకు చెందిన కాంగ్రెస్‌ నేతలంతా పాదయాత్ర చేయాలని ఏఐసీసీ ఆదేశించింది.   ఇదే కోణంలో తెలంగాణలోనూ ఇద్దరితో పాదయాత్ర చేయించాలని కోరారు. దీంతో  హైకమాండ్ కూడా ఈ విషయంలో ఆలోచన చేసింది. దీంతో రేవంత్‌కు తోటుగా భట్టి విక్రమార్క కూడా పాదయాత్రకు రెడీ అవుతున్నారు.  ఇద్దరూ కలిసి చేయాలని కొందరు అంటుంటే, భట్టి పాదయాత్ర చేస్తే ఇతర బాధ్యతలను రేవంత్‌ చూసుకోవచ్చని మరికొందరు, రేవంత్‌ కచ్చితంగా పాదయాత్ర చేయాలని ఇంకొందరు సలహాలిస్తున్నారు.