కొత్త రేషన్ కార్డుల కోసం దరఖాస్తు చేసుకున్నవారికి రేషన్ కార్డులు మంజూరు కానున్నాయి. అర్హులైన పేదలకు రేషన్ కార్డుల జారీ ప్రక్రియ సోమవారం నుంచి ప్రారంభం అవుతుంది. 3.09 లక్షల మంది లబ్ధిదారులకు మంత్రులు, ఎమ్మెల్యేలు, స్థానిక ప్రజాప్రతినిధుల చేతుల మీదుగా కార్డులను పంపిణీ జరగనుంది. ఇప్పటికే అన్ని జిల్లాలకు.. పౌర సరఫరాల శాఖ సమాచారం ఇచ్చింది.
సీఎం కేసీఆర్ సూచనల మేరకు జులై 26 నుంచి 31వ తేదీ వరకు రేషన్ కార్డులు పంపీణీ కార్యక్రమం జరుగుతుంది. కొత్త రేషన్ కార్డు లబ్ధిదారులకు ఆగస్టు నెల నుంచే రేషన్ బియ్యం అందజేస్తారు. జూన్ నెలలోనే రేషన్ కార్డులు జారీ చేయాలని నిర్ణయించారు. కానీ ఆ సమయంలో కార్డుల కోసం దరఖాస్తు చేసుకున్న లబ్ధిదారుల సంఖ్య 4,46,169గా ఉండగా, వీటిని పరిశీలన చేశారు.
డూప్లికేట్లు లేకుండా, ప్రభుత్వం విధించిన నిబంధనలకు లోబడి అన్ని కోణాల్లో పరిశీలించారు. అధికారులు రేషన్ కార్డులో కోసం అప్లై చేసిన వారిని వివిధ అంశాల్లో పరిశీలించిన తర్వాత 3,09,083 మందిని అర్హులుగా గుర్తించారు. అధికంగా హైదరాబాద్‌లో 56,064 మందిని అర్హులుగా తేల్చారు. రంగారెడ్డిలో 35,488 మందిని, మేడ్చల్‌లో 30,055 మందిని అర్హులుగా గుర్తించారు.
లబ్ధిదారులకు ప్రస్తుతం నూతన కార్డు మంజూరు చేస్తున్నట్లుగా ధ్రువీకరణ పత్రం అందిస్తామన్నారు. ఆ తర్వాత త్వరలోనే ప్రత్యేక నమూనాతో కూడిన కార్డులను ముద్రించి ఇవ్వనున్నట్టు తెలిసింది. పారదర్శకంగా ప్రక్రియ పూర్తిచేశామని, అర్హులైన ప్రతి కుటుంబానికి రేషన్‌కార్డు అందిస్తామని పౌరసరఫరాలశాఖ మంత్రి గంగుల కమలాకర్ వెల్లడించారు.
రేషన్ కార్డుల జారీలో అనర్హులకు చెక్ పెట్టేందుకు పౌరసరఫరాల శాఖ చాలా రకాలుగా జల్లెడ పట్టింది. కొత్తగా కార్డు కోసం దరఖాస్తు చేసుకున్న ప్రతి ఒక్కరి వివరాలను '360 డిగ్రీల సాఫ్ట్‌వేర్'తో పరిశీలించింది. ఈ ప్రక్రియలో అర్హులని తేలితేనే ఆ దరఖాస్తును పరిశీలించారు. లేదంటే తిరస్కరించినట్లు సంబంధిత దరఖాస్తుదారుకు సమాచారం ఇచ్చినట్టు తెలుస్తోంది. చౌకధరల దుకాణాల ద్వారా పంపిణీ చేసే సరకులను చాలా మంది తీసుకోవడం లేదు. సరకుల కోటా చాలా వరకు మిగిలిపోతుంది. ఎందుకీ పరిస్థితి అని అప్పట్లో పౌరసరఫరాల శాఖ అధికారులు ఆరా తీయగా ప్రభుత్వ పథకాల కింద లబ్ధి పొందడానికే చాలామంది రేషన్ కార్డులను తీసుకుంటున్నారని తేలింది. ఈ క్రమంలో ఆదాయపు పన్ను, ఇంటి పన్ను చెల్లించేవారు, ప్రభుత్వోద్యోగులు, పింఛను తీసుకునే వారు, కారు కలిగి ఉన్న వారి వివరాలను ఆయా శాఖల నుంచి సేకరించారు. ఆ సమాచారం ఆధారంగా వారి కార్డులను తొలగించారు.
Also Read: Revanth Reddy: లక్షమందితో దండోరా.. ఎన్నికలు ఎక్కడుంటే అక్కడే పథకాలా?