Swachh Bharat Gramin : ప్రతి ఇంటికీ నల్లాల ద్వారా మంచినీటి సరఫరా చేస్తూ సురక్షితమైన మంచినీటిని అందించడంలో తెలంగాణ రాష్ట్రాన్ని దేశంలోనే నంబర్ 1గా భారత ప్రభుత్వం ప్రకటించింది. 'క్రమబద్ధత' ( Regularity) విభాగంలో మిషన్ భగీరథ మొదటి స్థానంలో నిలిచింది. ఈ మేరకు ఈఎన్సీ కృపాకర్ రెడ్డి ఇతర అధికారుల మిషన్ భగీరథ బృందం, గాంధీ జయంతి 'స్వచ్ఛ భారత్ దివస్' వేడుకల సందర్భంగా ఆదివారం న్యూఢిల్లీలో కేంద్ర జలశక్తి మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్ చేతుల మీదుగా అవార్డు అందుకున్నారు.
స్వచ్ఛ భారత్ గ్రామీణ్ లో తెలంగాణ టాప్
స్వచ్ఛ భారత్ గ్రామీణ్‌లో తెలంగాణ దేశంలోనే అగ్రస్థానంలో నిలిచింది. మరికొన్ని విభాగాల్లోనూ రాష్ట్రానికి అవార్డులు దక్కాయి. మిషన్ భగీరథ పథకం కింద ఇంటింటికీ మంచినీరు అందిస్తున్న తెలంగాణకు కేంద్ర జలజీవన్ మిషన్ అవార్డు లభించింది. గ్రామాల్లో ఇంటింటికీ 100 శాతం నల్లాల ద్వారా నీరు అందిస్తున్న పెద్ద రాష్ట్రంగా తెలంగాణ ఉంది. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము చేతుల మీదుగా మిషన్ భగీరథకు జలజీవన్ పురస్కారం అందుకున్నారు మిషన్ భగీరథ బృందం. స్వచ్ఛ సర్వేక్షన్ అవార్డుల్లో దేశవ్యాప్తంగా తెలంగాణ రెండో స్థానంలో నిలిచింది. కేంద్ర పట్టణాభివృద్ధిశాఖ సహాయ మంత్రి కౌశల్ కిషోర్ చేతుల మీదుగా మంత్రి కేటీఆర్ ఈ అవార్డు అందుకున్నారు.
తెలంగాణకు 13 అవార్డులు
తెలంగాణలోని 16 పట్టణ, స్థానిక సంస్థలకు స్వచ్ఛ సర్వేక్షణ్-2022 అవార్డులు వచ్చాయి. తెలంగాణకు అవార్డులు దక్కడంపై మంత్రి కేటీఆర్ హర్షం వ్యక్తం చేశారు. అన్ని రంగాల్లో కలిపి తెలంగాణకు మొత్తం 13 అవార్డులు దక్కాయని మంత్రి కేటీఆర్ తెలిపారు. టీఆర్ఎస్ ప్రభుత్వ పనితీరుకు ఈ అవార్డులు నిదర్శనం అన్నారు. స్వచ్ఛ సర్వేక్షణ్ ర్యాంకుల్లో విశాఖ నాలుగో స్థానంలో, విజయవాడ ఐదో స్థానంలో నిలిచాయి. టాప్ 100 ర్యాంకుల్లో ఏపీకి చెందిన ఐదు నగరాలకు చోటు దక్కింది. పది లక్షల్లోపు జనాభా ఉన్న నగరాల్లో తిరుపతికి అగ్రస్థానం దక్కింది. రాజమండ్రి 91వ స్థానం, కడప 93, కర్నూలు 55, నెల్లూరు 60వ స్థానం దక్కాయి.
నాలుగో స్థానంలో విశాఖ
దేశవ్యాప్తంగా చేపట్టిన స్వచ్ఛ సర్వేక్షణ్ సర్వేలో అత్యంత స్వచ్ఛమైన రాష్ట్రంగా నిలిచింది మధ్యప్రదేశ్. ఆ తరవాత ఛత్తీస్‌గఢ్, మహారాష్ట్ర ఉన్నాయి. గృహ, పట్టణాభివృద్ధి మంత్రిత్వ శాఖ చేపట్టిన ఈ సర్వే ఏటా చేపడుతుంది. ఈ సారి ర్యాంకుల ప్రకటనా కార్యక్రమంలో కేంద్రమంత్రి హర్‌దీప్ సింగ్ పురితో పాటు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము కూడా పాల్గొన్నారు. నగరాల్లో విశాఖపట్నం 7500 మార్కులకు 6701 మార్కులతో నాలుగో స్థానంలో, 6699 మార్కులతో విజయవాడ 5 స్థానంలో, 6584 మార్కులతో తిరుపతి ఏడో స్థానంలో , 75వ ర్యాంకుతో కర్నూలు, 81వ స్థానంలో నెల్లూరు పట్టణాలు స్వచ్ఛభారత్ ర్యాంకుల్ని సాధించాయి. దిల్లీ తాల్ కటొరా స్టేడియంలో జరిగిన స్వచ్ఛ సర్వేక్షణ్ అవార్డుల ప్రధానోత్సవానికి రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. స్వచ్ఛత, పరిశుభ్రత అంశాల్లో ఉన్నతంగా నిలిచిన మున్సిపాలిటీలు, నగరాలకు చెందిన ప్రతినిధులకు అవార్డులు అందజేశారు.