ద్వితీయ శ్రేణి నగరం అయిన ఆదిలాబాద్‌లో ఐటీ కంపెనీ నెలకొల్పేందుకు ఓ సంస్థ ముందుకొచ్చింది. ఎన్​డీబీఎస్ ఇండియా అనే సంస్థ ఆదిలాబాద్‌లో ఐటీ సంస్థ పెట్టాలని నిర్ణయించగా.. వారిని ఐటీ శాఖ మంత్రి కేటీఆర్‌ అభినందించారు. హైదరాబాద్‌లో కాకుండా రాష్ట్రంలోని రెండో శ్రేణి పట్టణాలు, నగరాల్లోనూ ఐటీ కంపెనీలను ప్రోత్సహించేందుకు ప్రభుత్వం కృషి చేస్తోందని కేటీఆర్ తెలిపారు. ఆదిలాబాద్‌లో ఐటీ కంపెనీ పెట్టేందుకు ఎన్​డీబీఎస్​ఇండియా ముందురావడం కీలక అడుగుగా కేటీఆర్​అభిప్రాయపడ్డారు. బుధవారం హైదరాబాద్‌లో ఎన్​డీబీఎస్​ ఇండియా సీఈఓ, ఎండీ సంజయ్‌ దేశ్‌పాండే మంత్రి కేటీఆర్‌ను కలిశారు. ఈ సందర్భంగా కంపెనీ ప్రతినిధులను మంత్రి సాదరంగా స్వాగతించారు. మాజీ మంత్రి జోగు రామన్న కూడా ఆయన వెంట ఉన్నారు.


ఆదిలాబాద్‌లో త్వరలో ఐటీ టవర్‌తోపాటు టెక్స్‌టైల్‌ పార్క్‌ కూడా ఏర్పాటు చేస్తామని మంత్రి కేటీఆర్ వారికి తెలిపారు. అంతేకాకుండా ఆదిలాబాద్‌ జిల్లాలోని సిమెంట్‌ కార్పొరేషన్‌ ఆఫ్‌ ఇండియా(సీసీఐ)ను పునరుద్ధరిస్తే కొత్త కంపెనీ తరహాలో రాయితీలు ఇచ్చేందుకు రాష్ట్ర ప్రభుత్వం సిద్ధంగా ఉందని మరోసారి తెలిపారు. ఈ విషయాన్ని కేంద్రం దృష్టికి కూడా తీసుకెళ్లామని వివరించారు. ఉమ్మడి ఆదిలాబాద్‌ జిల్లాలో పరిశ్రమల స్థాపన ద్వారా ఉపాధి అవకాశాలు కల్పించేందుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రయత్నిస్తుండగా, కేంద్రం మాత్రం ప్రభుత్వరంగ సంస్థను అమ్మేందుకు కుట్రలు చేస్తోందని కేటీఆర్ అన్నారు. సిర్పూర్‌ పేపర్‌ మిల్లును రాష్ట్ర ప్రభుత్వం తిరిగి ప్రారంభించగా.. మరోవైపు సింగరేణి సంస్థ ప్రైవేటీకరణకు కేంద్రం తెరలేపిందని ఆగ్రహం వ్యక్తం చేశారు.


ఆదిలాబాద్‌ సీసీఐ యూనిట్‌ పునరుద్ధర ణకు కేంద్రంపై ఒత్తిడి తెచ్చేందుకు సీసీఐ సాధన సమితి ఏర్పాటు చేసి ఉద్యమ కార్యాచరణ చేపడతామని ఈ సందర్భంగా ఆ జిల్లా నేతలు వెల్లడించారు. ఈ విషయమై బీజేపీ ఎంపీపై కూడా ఒత్తిడి తెస్తామని అన్నారు.


అంతేకాక, ఆదివాసీలకు కూడా కేటీఆర్ శుభవార్త చెప్పారు. ఆదివాసీ రైతులు సాగుచేసుకుంటున్న అటవీ భూములపై హక్కులు కల్పించే విషయంలో ప్రభుత్వం సానుకూలంగా ఉందని మంత్రి అన్నారు. టీఆర్‌ఎస్‌కి చెందిన ఆదివాసీ ప్రజాప్రతినిధులు, ఆదివాసీ సంఘాల ప్రతినిధులు బుధవారం వేర్వేరుగా ప్రగతి భవన్‌లో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా కేటీఆర్‌ మాట్లాడుతూ ఆదివాసీలకు సంబంధించిన అన్ని సమస్యలపై త్వరలో ఆదివాసీ ప్రజా ప్రతినిధులు, వివిధ శాఖల అధికారులతో ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేస్తామని వారికి హామీ ఇచ్చారు. ఈ భేటీలో ప్రభుత్వ విప్‌ కాంతారావు, ఎమ్మెల్యే ఆత్రం సక్కుతో పాటు పలువురు టీఆర్‌ఎస్‌ ప్రజా ప్రతినిధులు, ఆదివాసీ సంఘాల నేతలు ఉన్నారు.