కీర్తి సురేష్ ప్రధాన పాత్రలో నటించిన ‘గుడ్ లక్ సఖి’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్ బుధవారం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వచ్చిన మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తేజ్.. కీర్తి సురేష్‌తో నాటు నాటు స్టెప్ వేసి ప్రేక్షకులను అలరించారు. ముందు ఈ ఈవెంట్‌కు ముఖ్య అతిథిగా మెగా స్టార్ చిరంజీవి రావాల్సి ఉండగా.. ఆయనకు కరోనా పాజిటివ్‌గా నిర్థారణ కావడంతో చివరి నిమిషంలో రామ్ చరణ్ వచ్చారు.


తన తండ్రి చిరంజీవికి మెసెంజర్‌గా ఈ ఫంక్షన్‌కు వచ్చినట్లు చరణ్ తెలిపారు. గుడ్ లక్ సఖిని అందరూ చిన్న సినిమా అంటున్నారని, కానీ జాతీయ అవార్డు అందుకున్న నటి కీర్తి సురేష్, జాతీయ అవార్డు అందుకున్న దర్శకుడు నగేష్ కుకునూర్‌లు తీసిన ఈ సినిమాను తాను చిన్న సినిమా అనబోనని తెలిపారు.


అజ్ఞాత వాసి, మహానటి సినిమాల్లో కీర్తి సురేష్ నటన తనకు చాలా ఇష్టమని చరణ్ అన్నారు. ఈ సినిమా నిర్మాతలు కూడా ఎంతో కష్టపడి ఈ సినిమాను నిర్మించారని, తమ అభిమానులు కూడా ఈ సినిమా చూడాలని పిలుపునిచ్చారు. స్పీచ్ ముగిసిన అనంతరం ‘మీతో నాటు నాటు స్టెప్ వేయాలని ఉంది’ అని కీర్తి సురేష్ అడిగారు. రామ్ చరణ్ వెంటనే ‘నాకెంతో ఇష్టమైన మహానటి కీర్తి సురేష్ అడిగారు కాబట్టి ఏమాత్రం ఆలోచించకుండా ఒప్పుకుంటున్నా’ అని రామ్ చరణ్ అన్నారు.


ఆ తర్వాత ‘ఒకసారి వేసి చూపించండి’ అని స్టేజ్ మీదనే కీర్తి సురేష్‌ను అడిగి.. ఆ తర్వాత తనతో కలిసి స్టెప్ వేశాడు మెగా పవర్ స్టార్. దీంతో ఈవెంట్‌కు హాజరైన ఫ్యాన్స్ ఫుల్‌గా ఎంజాయ్ చేశారు.