Court Rejected Bail in Phone Tapping Case: తెలంగాణలో ఫోన్ ట్యాపింగ్ కేసు ప్రకంపనలు సృష్టిస్తోన్న సంగతి తెలిసిందే. రోజుకో ట్విస్ట్‌తో కేసులో పలు కీలక విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. ఈ కేసు విచారణలో పోలీసులు దూకుడు పెంచారు. పోలీసులు నాంపల్లి కోర్టులో ఛార్జిషీట్ దాఖలు చేశారు. ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంపై మార్చి 10వ తేదీన పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. ఇప్పటి వరకు ప్రణీత్‌రావు, భుజంగరావు, తిరుపతన్న, రాధాకిషన్‌రావులను అరెస్ట్ చేశారు. కేసులో ప్రధానంగా ఆరుగురిని నిందితులుగా చేర్చారు.
బెయిల్ తిరస్కరణ
ఈ కేసులో నిందితులకు నాంపల్లి కోర్టులో చుక్కెదురైంది. అడిషినల్ ఎస్పీలు భుజంగరావు, తిరుపతన్నలు బెయిల్ కోసం దాఖలు చేసిన పిటిషన్లపై నేడు కోర్టు విచారించింది. వారు దాఖలు చేసిన బెయిల్ పిటిషన్లను కోర్టు కొట్టివేసింది. రాజకీయ దురుద్దేశంతోనే తమను అరెస్టు చేశారని, కేసులో సాక్ష్యాలను కోర్టుకు సమర్పించలేదని పిటిషనర్ల తరఫు న్యాయవాదులు కోర్టుకు విన్నవించారు. పోలీసులు ఛార్జిషీట్ దాఖలు చేసినందున ఇంకా విచారించాల్సి ఉందని నిందితులకు బెయిల్ మంజూరు చేయొద్దని పబ్లిక్ ప్రాసిక్యూటర్ కోర్టును కోరారు. బెయిల్ పిటిషన్లపై మంగళవారమే వాదనలు పూర్తయ్యాయి. ఈ పిటిషన్లను కొట్టివేస్తూ న్యాయమూర్తి బుధవారం ఆదేశాలు జారీ చేశారు.
రెడ్ కార్నర్ నోటీసులు
ఇది ఇలా ఉంటే.. ఈ కేసులో ప్రధాన నిందితుడిగా భావిస్తున్న ఎస్ఐబీ మాజీ చీఫ్ ప్రభాకర్‌రావుతో పాటు, ఓ తెలుగు న్యూస్ ఛానల్ ఎండీ శ్రవణ్ కుమార్ రావుకు పోలీసులు రెడ్ కార్నర్ నోటీసులు జారీ చేశారు. ప్రభాకర్ రావు ప్రస్తుతం అమెరికాలో ఉన్నారు. ఇటు శ్రవణ్ కుమార్ లండన్ లో ఉన్నారు. ఫోన్ ట్యాపింగ్ కేసులో వీరిద్దరూ ముందస్తు ప్లాన్ తోనే విదేశాలకు వెళ్లినట్లు ఆరోపణలు వస్తున్నాయి. వీరిని ఎలాగైనా అరెస్ట్ చేసేందుకు పోలీసులు చేస్తున్న ప్రయత్నాల్లో భాగంగా మొదట లుక్ ఔట్ నోటీసులతో పాటు బ్లూ కార్నర్ నోటీసులు జారీ చేశారు. తాజాగా ఇప్పుడు ఇద్దరికీ రెడ్ కార్నర్ నోటీసులు జారీ చేశారు. ఈ నోటీసులు జారీ కావడంతో విదేశీ దర్యాప్తు సంస్థల సహకారంతో ప్రభాకర్ రావు, శ్రవణ్ రావును అరెస్ట్ చేసి స్వదేశానికి రప్పించే అవకాశం ఉంటుంది.
ఇష్యూ సీరియస్ గా తీసుకున్న కాంగ్రెస్
గత ప్రభుత్వ హయాంలో పలువురు ప్రతిపక్ష నేతలు, సినీ నటులు, రియల్టర్లు, వ్యాపారుల ఫోన్లు ట్యాప్ అయినట్లు వెలుగులోకి రావడంతో కాంగ్రెస్ ప్రభుత్వం ఈ ఫోన్ ట్యాపింగ్ అంశాన్ని సీరియస్ గా తీసుకుంది. ఈ వ్యవహారంపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. అయితే ఈ కేసుపై ఇటీవల సీఎం రేవంత్ రెడ్డి పోలీసులతో సమీక్ష నిర్వహించారు.