Mla Raghunandan Rao : తెలంగాణలో కొనసాగుతున్న ఏపీ కేడర్‌కు చెందిన ఐఏఎస్, ఐపీఎస్ అధికారులపై ప్రధాని కార్యాలయానికి ఫిర్యాదు చేశామని బీజేపీ ఎమ్మెల్యే రఘునందన్ రావు తెలిపారు. హైదరాబాద్ బీజేపీ ఆఫీస్ లో మీడియాతో మాట్లాడిన రఘునందన్ రావు... ఐఏఎస్, ఐపీఎస్ అధికారులకు ఎక్కడ పోస్టింగ్ ఇస్తే అక్కడికి వెళ్లి పని చేయాలని సూచించారు. ఈ విషయంపై సుప్రీంకోర్టు కూడా స్పష్టం చేసిందన్నారు. కేంద్ర పరిపాలనా ట్రైబ్యునల్‌ (CAT) పేరుతో సుప్రీంకోర్టు తీర్పునకు వ్యతిరేకంగా 15 మందిని ఏపీకి పంపకుండా అడ్డుకున్నారని విమర్శించారు. మాజీ సీఎస్‌ సోమేశ్‌ కుమార్‌ తరహాలోనే తెలంగాణలో కొనసాగుతున్న ఏపీ కేడర్ అధికారులను ఆ రాష్ట్రానికి  పంపించాలన్నారు. అలాగే తెలంగాణ డీజీపీని కూడా ఏపీ కేడర్‌కు కేటాయించారని, అక్కడికే పంపించాలని ఎమ్మెల్యే రఘునందన్‌ రావు డిమాండ్ చేశారు.  


సీఎస్ కు లేఖ 


రాష్ట్రంలో చట్ట వ్యతిరేకమైన కార్యకలాపాలు జరుగుతున్నాయని ఎమ్మెల్యే రఘునందన్ రావు విమర్శించారు. సర్వే నంబర్ 78లో భూమిని ఇతరులకు కేటాయించడంపై ప్రభుత్వం ఆత్మ పరిశీలన చేసుకోవాలన్నారు. రంగారెడ్డి కలెక్టర్ అమోయ్ కుమార్ వ్యక్తులను బట్టి వ్యవహరిస్తున్నారని విమర్శించారు. ఎనిమిది ఎకరాలు తీసుకున్న వ్యక్తికి ఒక న్యాయం, 40 ఎకరాలు తీసుకున్న వ్యక్తికి మరో న్యాయమా? అంటూ మండిపడ్డారు. రంగారెడ్డి కలెక్టర్‌పై సీఎస్ చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. కలెక్టర్ అమోయ్ కుమార్ చేసిందా తప్పా, లేదా పరిశీలించి చర్యలు తీసుకోవాలన్నారు. ఈ మేరకు సీఎస్ లేఖ రాశారు. ప్రభుత్వం, ప్రగతి భవన్ గేట్లు మాకు ఎలాగూ తెరుచుకోవన్నారు. సమయం ఇస్తే మియపూర్ భూకబ్జాలపై  వివరిస్తామన్నారు. అధికారులకు  ఎక్కడ పోస్టింగ్ ఇస్తే అక్కడికి వెళ్లి పనిచేయాలని సూచించారు. ఈ విషయం సుప్రీంకోర్టు కూడా స్పష్టం చేసిందన్నారు.  తెలంగాణలో కొనసాగుతున్న 15 మంది ఏపీ కేడర్ అధికారుల అంశంపై ప్రధాని మోదీ దృష్టికి కూడా తీసుకెళ్తానని అన్నారు. ప్రధాని కార్యాలయానికి, డీవోపీటీకి లేఖ రాశానని రఘునందర్ రావు తెలిపారు. ఈ అంశంపై హైకోర్టులో కేసు ఉందని, ఈనెల 27న ఈ కేసుపై వాదనలు జరగనున్నాయని తెలిపారు. 13 మంది సివిల్ సర్వెంట్స్‌పై 2017లో కేంద్ర ప్రభుత్వం పిటిషన్లు దాఖలు చేసిందన్నారు. మాజీ సీఎస్ సోమేశ్ కుమార్‌కు ఆదేశాలు ఇచ్చినట్లే ఇతర అధికారులపై  చర్యలు తీసుకోవాలని రఘునందన్ రావు కోరారు.


హైకోర్టులో విచారణ 


తెలంగాణ డీజీపీగా ఉన్న అంజనీకుమార్‌ తెలంగాణలో కొనసాగుతారా ఏపీకి వెళ్తారా అనే ఉత్కంఠకు తెరపడ లేదు. అంజనీకుమార్‌తోపాటు మరికొందరు సివిల్‌ సర్వీస్‌ ఉద్యోగులను ఏపీకి కేటాయించినా వెళ్లకుండా తెలంగాణలోనే ఉండిపోయారు. దీనిపై తెలంగాణ హైకోర్టు ఇవాళ విచారణ చేపట్టింది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ విభజన టైంలో సోమేష్‌కుమారు, అంజనీకుమార్‌తోపాటు 12 మంది సివిల్ సర్వీస్ అధికారులను కేంద్రం ఏపీకి కేటాయించింది. వీళ్లంతా కేంద్ర పరిపాలన ట్రైబ్యునల్‌ను ఆశ్రయించి తెలంగాణలోనే విధులు నిర్వహిస్తున్నారు. దీనిపై హైకోర్టులో విచారణ జరుగుతోంది. ఈ విచారణలో తుది తీర్పు ఇవాళ వస్తుందని అంతా అనుకున్నారు. కానీ విచారణను వచ్చే వారానికి వాయిదా వేసింది కోర్టు.