Nama Meets Tummala : భారత రాష్ట్ర సమితి జాబితా ప్రకటన తర్వాత  అసంతృప్తుల్ని బుజ్జగించేందుకు బీఆర్ఎస్ నేతలు ప్రయత్నిస్తున్నారు. ఖమ్మం జిల్లాలో కీలక నేత తుమ్మల నాగేశ్వరరావు పార్టీ మారబోతున్నారన్న ప్రచారం జరుగుతోంది. దీంతో కేసీఆర్ ఆదేశంతో ఎంపీ నామా నాగేశ్వరరావు ఖమ్మంలో తుమ్మల నాగేశ్వరరావుతో సమావేశం అయ్యారు. తొందరపడి ఏ నిర్ణయమూ తీసుకోవద్దని చెప్పినట్లుగా తెలుస్తోంది.  


పోటీ చేయాలన్న పట్టుదలతో ఉన్న  తుమ్మల


టీడీపీ నుంచి టీఆర్ఎస్‌లో చేరిన తర్వాత వచ్చిన పాలేరు ఉపఎన్నికల్లో తుమ్మల నాగేశ్వరరావు పోటీ చేసి గెలిచారు. కానీ తర్వాత జరిగిన ఎన్నికల్లో స్వల్ప తేడాతో కాంగ్రెస్ అభ్యర్థి చేతిలో ఓడిపోయారు. కానీ గెలిచిన కాంగ్రెస్ అభ్యర్థి కందాళ ఉపేందర్ రెడ్డి బీఆర్ఎస్ లో చేరడంతో తుమ్మలకు టిక్కెట్ విషయంలో మొండి చేయి చూపారు. ఇటీవలి కాలంలో పాలేరులో పర్యటించినప్పుడల్లా పోటీ చేసి తీరుతానని తుమ్మల నాగేశ్వరరావు చెబుతూ వస్తున్నారు. చాలా అరుదుగా మాత్రమే వివాదాస్పద కామెంట్లు చేస్తూంటారు. అయితే ఈ మధ్య పార్టీ హైకమాండ్ కూడా ఆయనకు  పోటీ చేయడానికి చాన్సిస్తామని చెప్పినట్లుగా ప్రచారం జరిగింది. కానీ అలాంటి అవకాశాలు లేకపోవడంతో తుమ్మల ఇప్పుడు వేరే పార్టీల వైపు చూస్తున్నారన్న చర్చ జరుగుతోంది. 


తమ్మలను ఆహ్వానిస్తున్న కాంగ్రెస్, బీజేపీ                                     


మరో వైపు ఖమ్మంలో నాయకుల కొరత ఎదుర్కొంటున్న బీజేపీ తుమ్మల నాగేశ్వరరావును తమ పార్టీలోకి ఆహ్వానించింది. జిల్లా వ్యాప్తంగా అనుచరగణం ఉన్న నేత వస్తే బీజేపీ లాభపడుతుందని అనుకుంటున్నారు. అయితే.. తుమ్మల నాగేశ్వరరావు బీజేపీ ఆహ్వానంపై ఇంకా ఎలాంటి స్పందన వ్యక్తం చేయలేదు. 27వ తేదీన అమిత్ షా తెలంగాణ పర్యటనకు వస్తున్నారు. ఈ లోపే ఆయనతో చర్చలు జరిపారు. ఇప్పటికే మాజీ ఎంపీ పొంగులేటిని చేర్చుకుని బలపడ్డామని భావిస్తున్న కాంగ్రెస్.. తుమ్మలను కూడా చేర్చుకోవాలని ప్రయత్నిస్తున్నారు. ఆయనకు పాలేరు సీటు కేటాయించేందుకు సిద్దమని సంకేతాలు పంపుతున్నట్లుగా చెబుతున్నారు. 


ఇప్పటికే తుమ్మల అనుచరుల రహస్య సమావేశం                                       


అధికార బీఆర్ఎస్ లో వర్గ పోరాటం ఎక్కువగా ఉంది. మంత్రి పువ్వాడ అజయ్ తీరుపై తుమ్మల అనుచురులు అసంతృప్తిగా ఉన్నారు. బీఆర్ఎస్ ప్రాధాన్యత లభించడం లేదని.. వేరే పార్టీలో చేరిపోవాలని ఆయన అనుచరులు ఒత్తిడి తెస్తున్నారు. బీఆర్ఎస్ లిస్ట్ ప్రకటన తర్వాత తుమ్మల అనుచరులు రహస్య సమావేశం నిర్వహించారు. 


హైకమాండ్ సందేశాన్ని  నామా నాగేశ్వరరావు.. తుమ్మలకు అందించారు. ఇప్పుడు తుమ్మల ఏ నిర్ణయం తీసుకుంటారన్నది ఆసక్తికరంగా మారింది.