Yadadri News: యాదాద్రి పునర్నిర్మాణాన్ని టీఆర్ఎస్ ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకుని పూర్తి చేసి దివ్య క్షేత్రంగా మలిచింది. పర్యావరణ అనుకూల విధానాలతో, హరిత క్షేత్రంగా యాదాద్రిని తీర్చిదిద్దారు. అద్భుత శిల్పకళ, అత్యద్భుత నిర్మాణ కౌశలంతో యాదాద్రి శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి దివ్య క్షేత్రం రూపుదిద్దుకుంది. పూర్తిగా కృష్ణ శిలతో నిర్మితమైన ఆలయం, దాని పరిసరాలు భక్తులను, పర్యాటకులను మంత్ర ముగ్దులను చేస్తుందనడంలో అతిశయోక్తి లేదు. అలాంటి ఈ అద్భుత కళాఖండం మరో ఘనత సాధించింది.


2022 - 25 సంవత్సరాలకు గాను ప్రతిష్టాత్మక గ్రీన్ ప్లేస్ ఆఫ్ వర్షిప్ గుర్తింపును కైవసం చేసుకుంది. 40 శాతం పచ్చదనంతో విద్యుత్తు వినియోగాన్ని సాధ్యమైనంత వరకు తగ్గించేలా యాదాద్రి ఆలయాన్ని నిర్మించగా.. ఇండియన్ గ్రీన్ బిల్డింగ్ కౌన్సిల్(ఐజీబీసీ) ఈ గుర్తింపును ఇచ్చింది. భారత పరిశ్రమల సంఖ్య (సీఐఐ) అనుబంధ సంస్థ అయిన ఐజీబీసీ నిర్మాణ రంగంలో హరిత విధానాలను ప్రోత్సహించడం ద్వారా పర్యావరణాన్ని సమతుల్యంగా ఉంచేందుకు గాను కృషి చేస్తోంది. 2025 నాటికి ప్రపంచంలో అత్యుత్తమ పర్యావరణ అనుకూల నిర్మాణాలు జరిపే దేశాల సరసన భారత్ ను నిలపాలని ఇండియన్ గ్రీన్ బిల్డింగ్ కౌన్సిల్(ఐజీబీసీ) లక్ష్యంగా పెట్టుకుంది.


హరిత పుణ్యక్షేత్రానికి గౌరవం


స్వయంభువుగా వెలిసిన స్వామి వారి విగ్రహానికి ఏమాత్రం డ్యామేజీ జరగకుండా ఆలయాన్ని అత్యద్భుతంగా తీర్చిదిద్దినందుకు గానూ ఈ ప్రతిష్టాత్మక అవార్డు వచ్చినట్లు యాదాద్రి ఆలయ వైస్ ఛైర్మన్ జి. కిషన్ రావు వెల్లడించారు. సన్ పైప్ ద్వారా ప్రధాన ఆలయంలోకి సహజ సిద్ధంగా గాలి, వెలుతురు ధారాళంగా వచ్చేలా నిర్మాణం చేపట్టారు. అలాగే భక్తుల కోసం 14 లక్షల లీటర్ల సామర్థ్యం గల కొలను ఏర్పాటు చేశారు. స్వచ్ఛమైన మంచి నీటి సరఫరా వ్యవస్థను ఏర్పాటు చేయడం ఈ గుర్తింపుకు మరో కారణం అని వైస్ ఛైర్మన్ జి. కిషన్ రావు తెలిపారు. 


'తెలంగాణ ఆధ్యాత్మిక వారసత్వానికి దక్కిన గుర్తింపు'


యాదాద్రి శ్రీలక్ష్మీ నరసింహస్వామి ఆలయానికి గ్రీన్ ప్లేస్ ఆఫ్ వర్షిప్ గుర్తింపు రావడంపై ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్ రావు హర్షం వ్యక్తం చేశారు. మన సాంస్కృతిక, ఆధ్యాత్మిక వారసత్వానికి దక్కిన గొప్ప గౌరవం ఇదని సీఎం పేర్కొన్నారు. ప్రజల మనోభావాలను, మత సాంప్రదాయాలను గౌరవిస్తూ రాష్ట్ర సర్కారు అత్యంత ప్రతిష్టాత్మకంగా పునర్నిర్మించిన ఈ ఆలయం.. భారత ఆధ్యాత్మిక పునరుజ్జీవ వైభవానికి ప్రతీకగా నిలిచిందని ముఖ్యమంత్రి అన్నారు. యాదాద్రి ఆలయ పవిత్రతకు, ప్రాశస్థ్యానికి భంగం వాటిల్లకుండా యాదాద్రి ఆలయాన్ని ఆధునికీకరించడాన్ని ఇండియన్ గ్రీన్ బిల్డింగ్ కౌన్సిల్(ఐజీబీసీ) ప్రశంసించడం తెలంగాణ సర్కారుకు దక్కిన గౌరవమని చెప్పారు.


'స్థిరమైన హరిత పరిష్కారాల ఫలితం'


ఆధ్యాత్మిక హరిత పుణ్యక్షేత్రం, తెలంగాణ ఆత్మ గౌరవమైన యాదాద్రి ఆలయానికి ఇండియన్ గ్రీన్ బిల్డింగ్ కౌన్సిల్ ప్లాటినం రేటింగ్ లభించినందుకు చాలా గర్వంగా ఉందని ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ ట్విట్టర్ ద్వారా ప్రకటించారు. ఘనమైన సంస్కృతి, వారసత్వం, స్థిరమైన హరిత పరిష్కారాల సమ్మేళనం అద్భుతంగా పని చేస్తుందని గౌరవనీయులైన సీఎం కేసీఆర్ నిరూపించారని ఆయన పేర్కొన్నారు.