Revanth Reddy: అప్పటినుంచి ఒంటరినయ్యా, నాపై వాళ్లకు ఎందుకీ కక్ష - కన్నీటి పర్యంతమైన రేవంత్ రెడ్డి

Revanth Reddy sensational Comments: రాజకీయంగా తనను దెబ్బతీయడానికి కుట్ర జరుగుతోందని, కొందరు నేతలు సీఎం కేసీఆర్ తో కుమ్మక్కయ్యారంటూ రేవంత్ రెడ్డి ఉద్వేగభరితంగా వ్యాఖ్యలు చేశారు.

Continues below advertisement

మునుగోడు ఉప ఎన్నికలు కాంగ్రెస్ పార్టీలో విభేదాలను బయటపెడుతున్నాయా అంటే టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి వ్యాఖ్యలు చూస్తే అవుననే అనిపిస్తుంది. తమ పార్టీ నేతల కుట్ర చేస్తున్నారంటూ, రేవంత్ రెడ్డి కన్నీటి పర్వంతం కావడం తెలంగాణ రాజకీయాల్లో హాట్ టాపిక్‌గా మారింది. తనను అభిమానించే వాళ్లకు, కార్యకర్తలకు, పార్టీ శ్రేణులకు తన మనసులో బాధ చెబుతున్న అంటూ.. రాజకీయంగా తనను దెబ్బతీయడానికి కుట్ర జరుగుతోందని, కొందరు నేతలు సీఎం కేసీఆర్ తో కుమ్మక్కయ్యారంటూ రేవంత్ రెడ్డి ఉద్వేగభరితంగా వ్యాఖ్యలు చేశారు. 
పీసీపీ పదవి నుంచి దించేందుకు కుట్ర జరుగుతోంది..
కాంగ్రెస్ పార్టీని చంపేందుకు తెలంగాణ సీఎం కేసీఆర్, బీజేపీ కలిసి కుట్ర చేస్తున్నాయని రేవంత్ రెడ్డి ఆరోపించారు. మునుగోడు ఉపఎన్నికలో కాంగ్రెస్ పార్టీని ఓడించి, పీసీసీ పదవి నుంచి రేవంత్ రెడ్డిని తొలగించాలనే కుట్ర జరుగుతోందని సంచలన వ్యాఖ్యలు చేశారు. రేవంత్ రెడ్డి పీసీసీ చీఫ్ గా ఉన్నందుకే కాంగ్రెస్ బలహీనపడిందని నిరూపించాలని పార్టీకి చెందిన కొందరు నేతలు ప్రయత్నిస్తున్నారని చెప్పారు. లాఠీ తూటాలకైనా, తుపాకీ గుండ్లకైనా తాను సిద్ధంగా ఉన్నానన్నారు. కాంగ్రెస్ పార్టీ కోసం ప్రాణాలు సైతం ఇచ్చేందుకు, చివరి శ్వాస వరకు పనిచేస్తానంటూ భావోద్వేగానికి లోనయ్యారు. పీసీసీ పదవి సోనియా గాంధీ తనకు ఇచ్చిన అవకాశమని, కానీ అప్పటినుంచి పార్టీలో తాను ఒంటరివాడిని అయ్యానని.. అందుకు బీజేపీ, కేసీఆర్ కుట్రలు కూడా ఓ కారణమని ఆరోపించారు రేవంత్ రెడ్డి. 

Continues below advertisement

కేసీఆర్ సుపారి తీసుకున్నాడు !
‘దేశంలో కాంగ్రెస్ పార్టీని చంపేందుకు సీఎం కేసీఆర్ సుపారి తీసుకున్నాడు. పది రోజులపాటు ఢిల్లీలో ఉండి ప్రధాని నరేంద్ర మోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షాతో రహస్య మంతనాలు జరిపాడు కేసీఆర్. కాంగ్రెస్ పార్టీని లేకుండా చేయాలన్న కుట్రతోనే కేసీఆర్.. అమిత్ షా ఆడుతున్న డ్రామాలో భాగంగానే మునుగోడు ఉప ఎన్నికలో కాంగ్రెస్ ఓటమి కోసం కుట్రలు చేస్తున్నారు. కేంద్ర ప్రభుత్వం సిఆర్పిఎఫ్ బలగాలతో మునుగోడును చుట్టి ప్రజలను భయభ్రాంతులకు గురిచేసి కాంగ్రెస్ కార్యకర్తలను భయభ్రాంతులకు గురి చేస్తున్నారు. రాష్ట్ర పోలీసులు కేసీఆర్ కు కొమ్ముకాస్తూ ప్రజాస్వామ్యాన్ని పట్టించుకోకుండా వ్యవహరిస్తున్నారు. దివిసీమలా మన రాష్ట్రం కాకూడదు. లక్షలాదిగా కాంగ్రెస్ పార్టీ కార్యదక్షులు, ప్రాణాలు ఇచ్చే కార్యకర్తలు మునుగోడుకు తరలిరండి మన పార్టీని కాపాడుకుందాం.

పీసీసీ పదవి నుంచి తొలగించేందుకు మా నేతలు కుట్ర చేస్తున్నారు
పీసీసీ చీఫ్ పదవి నుంచి నన్ను తొలగించేందుకే సొంత పార్టీ నాయకులు భారీ కుట్ర చేస్తున్నారు. నాకు పీసీసీ శాశ్వతం కాదు. సోనియాగాంధీ ఇచ్చిన అవకాశం మాత్రమే ఆ పదవి. మునుగోడు ప్రజలారా ఆలోచించండి ప్రజాస్వామ్యాన్ని కాపాడండి. మునుగోడులో కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు దీక్షలు చేపట్టాలి. ప్రజాస్వామ్యాన్ని చంపేందుకు కుట్రలు చేస్తున్న రెండు ప్రభుత్వాలకు వ్యతిరేకంగా పోరాటం చేయాలి. మునుగోడు ఉపఎన్నికలో కాంగ్రెస్ పార్టీని ఓడగొట్టి రేవంత్ రెడ్డిని పీసీసీ నుండి తొలగించాలని సొంత పార్టీ నేతలు సీఎం కేసీఆర్ తో కలిసి కుట్రలు చేస్తున్నారు. కార్యకర్తలు, అభిమానులు, ప్రజలందరూ గమనించాలి (రేవంత్ భావోద్వేగం). పీసీసీ చీఫ్ అయ్యాక పార్టీలో ఒంటరినయ్యాను. ఎవరు కుట్రలు చేస్తున్నారో తొందర్లోనే అన్ని నిజాలు తెలుస్తాయి. రెండు అధికార పార్టీలు డబ్బులతో గెలుద్దామని చూస్తున్నాయి. ప్రజాస్వామ్యాన్ని చంపాలని ప్రయత్నిస్తున్నారు.  మునుగోడు ప్రజలకు, కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు కదలివచ్చి పాల్వాయి స్రవంతికి అండగా ఉందాం. మునుగోడు మనకు అన్నం పెడుతుంది’ అని రేవంత్ రెడ్డి అన్నారు.

Continues below advertisement