TRS EX MLA Jalagam venkatrao: ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి జలగం వెంగళరావు తనయుడు రాజకీయంగా ఎలాంటి నిర్ణయం తీసుకోబోతున్నారు..? ఇప్పుడు ఉమ్మడి ఖమ్మం జిల్లాలో చర్చానీయాంశంగా మారిన అంశం. జలగం వెంగళరావు తనయుడు జలగం వెంకటరావు రెండు సార్లు ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. ఒకసారి కాంగ్రెస్‌ పార్టీనుంచి సత్తుపల్లి నియోజకవర్గానికి ప్రాతినిద్యం వహించారు. 2014లో టీఆర్‌ఎస్‌ పార్టీలో చేరిన ఆయన ఉమ్మడి ఖమ్మం జిల్లా నుంచి గులాబీ పార్టీ నుంచి గెలిచిన ఏకైక ఎమ్మెల్యేగా చరిత్ర సృష్టించారు.


ఉమ్మడి ఖమ్మం జిల్లా అభివృద్ధిలో అప్పట్లో కీలకంగా మారిన మాజీ ముఖ్యమంత్రి జలగం వెంగళరావుకు జిల్లాలో బలమైన అనుచరగణం ఉండేది. ఆయన వారసుడిగా రాజకీయ అరంగ్రేటం చేసిన జలగం ప్రసాదరావు కాంగ్రెస్‌ పార్టీలో కీలక నేతగా ఎదిగారు. అనంతరం జరిగిన పరిణామాల్లో ప్రసాదరావు సోదరుడు జలగం వెంకటరావు సత్తుపల్లి నియోజకవర్గం నుంచి ఎన్నికయ్యారు. చిన్న వయస్సులోనే ఎమ్మెల్యేగా గెలుపొంది ఖమ్మం జిల్లా రాజకీయాల్లో కీలకంగా మారారు. రాష్ట్ర విభజన అనంతరం వెంకటరావు టీఆర్‌ఎస్‌ పార్టీలో చేరి ఉమ్మడి ఖమ్మం జిల్లాలో టీఆర్‌ఎస్‌ పార్టీ నుంచి ఏకైక ఎమ్మెల్యేగా గెలుపొందారు.  అనంతరం ఆయనకు మంత్రి పదవి వస్తుందని భావించినా సీఎం కేసీఆర్‌ తీసుకున్న నిర్ణయంతో తుమ్మల నాగేశ్వరరావుకు ఖమ్మం జిల్లా నుంచి మంత్రి పదవి లభించింది. అయితే అప్పట్నుంచి జిల్లాలో బలమైన వర్గాన్ని ఏర్పాటు చేసుకునప్పటికీ 2018 ఎన్నికల్లో వెంకటరావు ఓటమి చెందడంతో ఆయన వర్గం సైలెంట్ అయింది. ఆ తర్వాత మారిన పార్టీ ఫిరాయింపులతో ఆయన ఖమ్మం జిల్లాకు దూరంగానే ఉంటున్నారు. ప్రస్తుతం రాష్టంలో మారుతున్న రాజకీయ పరిణామాలతో జలగం వెంకటరావు టీఆర్‌ఎస్‌లో కొనసాగుతారా..? లేక సొంత గూటికి చేరి కాంగ్రెస్‌ పార్టీకి వస్తారా..? అనే అంశం ఇప్పుడు ఉమ్మడి జిల్లాలో హాట్ టాపిక్‌గా మారింది. 
పది నియోజకవర్గాలో బలమైన ఫాలోయింగ్..
దివంగత ముఖ్యమంత్రి జలగం వెంగళరావు వారసులుగా రాజకీయ అరంగేట్రం చేసిన ప్రసాదరావు, వెంకటరావులకు జిల్లాలోని పది నియోజకవర్గాల్లో బలమైన అనుచరగణం ఉంది. తెలంగాణ ఏర్పాటైన అనంతరం ఇద్దరు అన్నదమ్ములు టీఆర్‌ఎస్‌ పార్టీలో చేరినప్పటికీ వారికి సముచిత స్థానం కల్పించలేదని వారి అనుచరులు భావిస్తున్నారు. 2018లో జరిగిన ఎన్నికల్లో వెంకటరావు ఓటమి పాలవ్వడంతో జలగం కుటుంబం రాజకీయాలకు దూరంగా ఉంటున్నారు. అయితే ఇటీవల కాలంలో వెంకటరావు కొత్తగూడెం నియోజకవర్గంలో పర్యటించి అనుచరులతో సమావేశం నిర్వహించారు. ప్రస్తుతం టీఆర్‌ఎస్‌ పార్టీ పొత్తులతో పోటీపై చర్చ జరుగుతుంది. 
టీఆర్‌ఎస్, సీపీఐ పొత్తు ఉంటే..
రాష్ట్ర వ్యాప్తంగా టీఆర్‌ఎస్‌ పార్టీతో సీపీఐ పొత్తు ఉంటే కొత్తగూడెం నియోజకవర్గంపై సీపీఐ ఫోకస్‌ చేసే అవకాశం ఉంది. పార్టీ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరావు 2009లో ఇక్కడ్నుంచే ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. ఆయన రాష్ట్ర కార్యదర్శిగా ఎన్నిక కావడంతో ప్రధానంగా కొత్తగూడెం నియోజకవర్గానే ఆ పార్టీ అడిగే అవకాశం ఉంది. ఇదిలా ఉండగా సీపీఐ పార్టీకి కొత్తగూడెం నియోజకవర్గం తప్పనిసరిగా కేటాయిస్తారని ఆ పార్టీ నాయకులు ప్రచారం సాగిస్తున్నారు.


ఈ పరిస్థితుల్లో జలగం వెంకటరావు ఏ పార్టీ నుంచి పోటీ చేస్తారనే విషయం చర్చ జరుగుతుంది. సొంత గూటికి వెళ్లి కాంగ్రెస్‌ పార్టీ నుంచి బరిలోకి దిగుతారా..? లేక స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేస్తారా.. అనే విషయం చర్చ జరుగుతుంది. ఏది ఏమైనప్పటికీ 2014లో కొత్తగూడెం నియోజకవర్గం నుంచి భారీ మెజారిటీతో విజయం సాదించిన వెంకటరావు మాత్రం వచ్చే ఎన్నికల్లో ఇక్కడ్నుంచే పోటీ చేసేందుకు సిద్దమవుతుండటం, ఆయన ఎలాంటి నిర్ణయం తీసుకుంటారనే విషయం ఇప్పుడు రాజకీయంగా చర్చకు దారి తీస్తోంది. మరి ఆయన ఎలాంటి నిర్ణయం తీసుకుంటాడనే విషయం తెలియాలంటే కొంతకాలం వేచి చూడాల్సిందే.