Jupally Krishna Rao About Srisailam Dam Water | కొల్లాపూర్: పోతిరెడ్డిపాడు కాల్వ ద్వారా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం కృష్ణా జలాలను ఇప్పటికే భారీగా తరలించుకుపోతున్నదని, పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్ విస్తరణతో మన ప్రాంతానికి తీవ్ర అన్యాయం జరగనుందని, శ్రీశైలం రిజర్వాయర్ లోని నీళ్లు రెండు మూడు నెలల్లోనూ ఖాళీ అయ్యే ప్రమాదం ఉందని మంత్రి జూపల్లి కృష్ణారావు ఆందోళన వ్యక్తం చేశారు. ఈ ప్రాంత నీటీ సమస్య తీరాలంటే వెల్టూరు, చిన్నమర్రి మధ్య కృష్ణ నదిపై డ్యాం నిర్మించాల్సిన అవసరం ఉందని, ఒక్క ఎకరం ముంపు ముప్పు లేకుండా సుమారు 60 టీఎంసీల నీటిని నిల్వ చేసుకునే అవకాశం ఉంటుందన్నారు. ఈ అంశాన్ని తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి దృష్టికి తీసుకెళ్తామని, డిప్యూటీ సీఎం భట్టివిక్రమార్క సహకారం కోరాలన్నారు.
ఇక్కడ డ్యాం నిర్మాణం వల్ల నాగర్ కర్నూల్ జిల్లాతో పాటు నార్లాపూర్ మోటర్లు, కల్వకుర్తి లిప్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ లో భాగంగా చేపట్టిన ఎల్లూర్ లిప్ట్, పాలమూరు - రంగారెడ్డి ప్రాజెక్టులకు నీటిని వినియోగించుకోవచ్చని తెలిపారు. కొల్లాపూర్ పట్టణంలో రేషన్ కార్డుల పంపిణీ కార్యక్రమంతో పాటు నిర్వహించిన పలు అభివృద్ధి కార్యక్రమాలలో పాల్గొన్న డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్కని మంత్రి జూపల్లి సమక్షంలో మాజీ మున్సిపల్ చైర్ పర్సన్ మేకల రమ్య నాగరాజు శాలువాతో సత్కరించి, జ్ఞాపిక ను అందజేశారు..
బీఆర్ఎస్ పాలనలో రాష్ట్రం ఆధోగతిపాలుపదేండ్ల బీఆర్ఎస్ పాలనలో తెలంగాణ రాష్ట్రం ఆధోగతి పాలైందన్నారు. విభనకు మందు మిగులు రాష్ట్రంగా ఉన్న తెలంగాణ అప్పులు కుప్పగా మారిందని గత ప్రభుత్వ వైఫల్యాలను ఎండగట్టారు. తెలంగాణకు ఏర్పడక ముందు రూ. 75 వేల కోట్ల అప్పు ఉంటే.. పదేండ్ల బీఆర్ఎస్ పాలనలో రూ. 8 లక్షల కోట్ల అప్పు అయిందని, గతంలో ఏడాదికి రూ. 6500 కోట్ల వడ్డీ చెల్లిస్తే... ఇప్పుడు నెలకు రూ. 6500 వడ్డీ కట్టాల్సిన పరిస్థితికి వచ్చిందని ఆవేదన వక్తం చేశారు.
ఎన్ని ఆర్థిక ఇబ్బందులు ఉన్నప్పటికీ ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చేందుకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సారధ్యంలోని ప్రజా ప్రభుత్వం చిత్తశుద్ధితో పని చేస్తుందని అన్నారు. పదేండ్లలో కొత్త రేషన్ కార్డులు ఇచ్చిన దాఖలాలు లేవని ఎద్దేవా చేశారు. ఇంకా చేయాల్సింది చాలా ఉందని, వాటిన్నింటిని అమలు చేసి తీరుతామని, ఈ టర్మ్ తో పాటు మరో ఐదేండ్లు కాంగ్రెస్ ప్రభుత్వమే అధికారంలో ఉంటుందని ధీమా వ్యక్తం చేశారు.
ముంపు బాధితులకు అండగా ఉంటాంగతంలో శ్రీశైలం ప్రాజెక్ట్ నిర్మాణంతో సుమారు 35 గ్రామాలు మంపునకు గురయ్యాయని, అప్పుడు చెల్లించిన నష్టపరిహారం సరిపోలేదని పేర్కొన్నారు. మంపు గ్రామాల ప్రజలు అనాడు నిర్మించుకున్న మట్టి మిద్దెలు కూలిపోతున్నాయని, ఈ గ్రామాలతో పాటు జీవో నం. 123 తో నష్టపోయిన నార్లాపూర్ రిజర్వాయర్ ముంపు బాధితులకు ఇందిరమ్మ ఇండ్లు మంజూరు చేయాలని డిప్యూటీ సీయంను కోరారు.
కొల్లాపూర్ లో ఇంజనీరింగ్, పాలిటెక్నిక్, ఐటీఐ ఏర్పాటుకు కృషికొల్లాపూర్ లో విద్యాభివృద్ధికి ఇంజనీరింగ్, పాలిటెక్నిక్, ఐటీఐ కాలేజీలను ఏర్పాటు చేయాలని సూచించారు. శ్రీశైలం ప్రాజెక్ట్ ముంపు బాధితులకు 98 జీవో ద్వారా ఉద్యోగ,ఉపాధి అవకాశాలు కల్పించాల్సి ఉండే కానీ అది నెరవేరలేదని, వారికి కనీసం పంచాయతీ సెక్రటరీ లేదా లష్కర్ ఉద్యోగాలు ఇవ్వాలని లేకపోతే ఒక్కో కుటుంబానికి రూ. 25 లక్షల నష్టపరిహారం చెల్లించాలని విజ్ఞప్తి చేశారు. వాల్మీకి బోయలను ఎస్టీ జాబితాలో చేర్చాలని, మాదాసీలకు ఎస్సీ సర్టిఫికెట్లు జారీకి కృషి చేయాలని కోరారు. నాగర్ కర్నూల్ జిల్లాలో లైబ్రరీల అభివృద్ధికి కోటి రూపాయాలు ఇస్తానని ప్రకటించిన ఎంపీ మల్లు రవికి ఈ సందర్భంగా మంత్రి జూపల్లి కృతజ్ఞతలు తెలిపారు.