హైదరాబాద్: కొత్త రేషన్ కార్డుల కోసం ఎదురుచూస్తున్న వారికి తెలంగాణ ప్రభుత్వం శుభవార్త చెప్పింది. నేడు కొత్త రేషన్ కార్డుల పంపిణీని తెలంగాణ ప్రభుత్వం ప్రారంభించనుంది. సూర్యాపేట జిల్లా తుంగతుర్తి నియోజకవర్గం తిరుమలగిరిలో సీఎం రేవంత్ రెడ్డి కొత్త రేషన్ కార్డుల పంపిణీ ప్రారంభించనున్నారు. కొత్తగా 3.58 లక్షల రేషన్ కార్డులను ప్రభుత్వం జారీ చేయనుంది.

తిరుమలగిరిలో బహిరంగ సభ

 సోమవారం (జులై 14న) సాయంత్రం తిరుమలగిరి బహిరంగసభ వేదికగా సీఎం రేవంత్ రెడ్డి లబ్ధిదారులకు రేషన్ కార్డులను పంపిణీ చేయనున్నారు. కొత్తగా జారీ చేస్తున్న రేషన్ కార్డులతో కలిపితే తెలంగాణలో మొత్తం కార్డులు 95,56,625కు చేరనుండగా లబ్ధిదారులు 3 కోట్లు దాటనున్నారని రాష్ట్ర పౌరసరఫరాలశాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఇటీవల తెలిపారు. కానీ కొన్ని రోజుల కింద చెప్పినట్లుగా రెండు రకాల కార్డులు జారీ చేస్తారా.. లేక మొత్తం ఒకే రకమైన కార్డులు జారీ చేస్తారా అనే దానిపై స్పష్టత రావాల్సి ఉంది.

కొత్త రేషన్ కార్డులతో సమస్యకు పరిష్కారం..

తెలంగాణ ప్రజలు గత కొన్నేళ్ల నుంచి కొత్త రేషన్ కార్డుల కోసం ఎదురుచూస్తున్నారు. ఎట్టకేలకు వారి సమస్యకు కొత్త కార్డుల ద్వారా పరిష్కారం దొరుకుతుందని లబ్ధిదారులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. పలు దఫాలుగా తెలంగాణ ప్రభుత్వం దరఖాస్తులు తీసుకుంది. ఈ ఏడాది జనవరి 26న నాలుగు పథకాలు ప్రారంభించిన సమయంలోనే గ్రామ సభలు నిర్వహించి కొత్త రేషన్ కార్డుల కోసం దరఖాస్తులు స్వీకరించింది. మీ సేవా కేంద్రాల్లోనూ రేషన్ కార్డుల కోసం దరఖాస్తులు స్వీకరించారు. ఏప్రిల్ నెలలోనే రేషన్ కార్డులు ఇస్తామని ప్రభుత్వం చెప్పింది. పలు దఫాలు ఈ కార్యక్రమం వాయిదా పడుతూ వస్తోంది. ఎట్టకేలకు జులై 14న కొత్త రేషన్ కార్డుల జారీతో లక్షలాది కుటుంబాలకు ఈ సమస్య తీరుతుంది.

ప్రభుత్వంపై ఏటా రూ.1150 కోట్ల భారం సోమవారం నాడు తెలంగాణ ప్రభుత్వం కొత్తగా 3,58,187 రేషన్‌కార్డులను జారీ చేయనుంది. వాటి ద్వారా కొత్తగా 11,11,223 మందికి లబ్ధి చేకూరుతుంది. పాత రేషన్ కార్డుల్లో కొత్త సభ్యులు 4,41,851 మందిని సైతం చేరుస్తున్నాం. దాంతో కొత్తగా 15,53,074 మందికి ఆహార భద్రత కింద రేషన్‌ ప్రయోజనం కలుగుతుంది. మొదటిదశగా నారాయణపేట జిల్లాలో నిర్వహించిన సభ ద్వారా 2 లక్షల 3 వేల కొత్త కార్డులు మంజూరుచేశాం. ఆ కార్డుల జారీతో కొత్తగా 5,90,488 మందికి లబ్ధి చేకూరింది. పాతకార్డుల్లో కొత్తగా 6,39,784 మందిని చేర్చడంతో మొత్తం 12,30,272 మంది కొత్తగా రేషన్‌ ప్రయోజనాలు పొందుతున్నారు. 

రెండోదశ కొత్త రేషన్ కార్డుల జారీని ఈనెల 14న చేపడుతున్నాం. కొత్త లబ్ధిదారుల 15,53,074 మందికి ప్రయోజనం కలగనుంది. కొత్త రేషన్ కార్డుల జారీతో పాటు పాత రేషన్ కార్డుల్లో కొత్త వ్యక్తుల చేరికతో తెలంగాణ ప్రభుత్వం ఖజానాపై ఏడాదికి అదనంగా రూ.1150.68 కోట్ల భారం పడుతుంది’ అని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఇటీవల తెలిపారు.