Telangana Ration Card: తెలంగాణలో కొత్త రేషన్ కార్డుల పంపిణీకి ప్రభుత్వం సిద్ధమైంది. సోమవారం నాడు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేతుల మీదుగా పంపిణి కార్యక్రమం స్టార్ట్ అవుతుంది. చాలా కాలంగా కొత్త రేషన్ కార్డుల కోసం చూస్తున్న వారికి ఇది నిజంగానే శుభవార్త.  

తెలంగాణలో కొత్తగా రెండున్నర లక్షల కొత్త కార్డులు పంపిణీ చేయనుంది ప్రభుత్వం. అంటే పదకొండున్నర లక్షల మందికి లబ్ధిచేకూరనుంది. ఈ కొత్త రేషన్ కార్డులను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తుంగతుర్తి నియోజకవర్గంలోని తిరుమలగిరిలో ప్రజలకు అందజేయనున్నారు. అనంతరం రాష్ట్రవ్యాప్తంగా ప్రజాప్రతినిధులు, మంత్రుల సమక్షంలో పంపిణీ ప్రక్రియ ప్రారంభమవుతుంది. తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు అయిన తర్వాత జరుగుతున్న అతి పెద్ద కార్డుల పంపిణీ కార్యక్రమం. ఇప్పటి వరకు కొత్త రేషన్ కార్డులు ఇచ్చింది లేదు.  

పదేళ్ల నుంచి కొత్త రేషన్ కార్డులు మంజూరు చేయకపోవడంతో ఈసారి భారీగానే దరఖాస్తులు వచ్చాయి. వాటిని జిల్లా స్థాయిలో సమీక్షించి అర్హుల వడపోత చేపట్టారు. అర్హులైన వారికి మాత్రమే రేషన్ కార్డులు ఇచ్చేలా చర్యలు తీసుకున్నారు. తెలంగాణలో నివాసం, ఆదాయ స్థాయి, కుటుంబ సభ్యుల వివరాలు, ఆధార్ లింక్ వంటి అంశాలు పరిగణలోకి తీసుకున్నారు. ఇప్పటి వరకు రేషన్ కార్డులపై పురుషుల పేర్లు యజమానులుగా ఉండేవి ఈసారి మాత్రం స్త్రీలను యజమానులుగా చూపిస్తూ కార్డులు తీసుకొస్తున్నారు.  

కొత్తగా మంజూరు చేసిన రేషన్ కార్డులతో మొత్తం కార్డుల సంఖ్య 94.72 లక్షలకు చేరరుకోనుంది. మొత్తం 3.14 కోట్ల మంది ప్రజలకు ప్రయోజనం చేకూరనుంది. ఇప్పటి వరకు ఇచ్చే సంప్రదాయ కార్డులకు బదులు ఈసారి నుంచి కొత్తగా స్మార్ట్ కార్డులు ఇవ్వబోతున్నారు. ఇందులో ఆధునిక ఫీచర్లు ఉన్నాయి. వీటిపై క్యూఆర్‌ కోడ్ ఉంటుంది. దాన్ని స్కాన్ చేస్తే ఆ కార్డులో ఉన్న కుటుంబ సభ్యుల పేర్లు, రేషన్ డీలర్ వివరాలు అన్నీ చూపిస్తాయి.  ఇప్పుడు వచ్చే కార్డు ATM కార్డు పరిమాణంలో ఉంటుంది.  

ఆరు గ్యారంటీల్లో ఇదీ ఒకటి

రేషన్ కార్డుల పంపిణీపై రాష్ట్ర ఆహారం, పౌర సరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ..."రేషన్ కార్డుల పంపిణీ కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన ఆరు గ్యారంటీల్లో ఒకటి. పేదలకు ఆహార భద్రత కల్పించే దిశగా ఒక సంచలనాత్మక నిర్ణయం. అర్హత కలిగిన ప్రతి కుటుంబానికి రేషన్ కార్డు అందేలా చూస్తున్నాం. పూర్తి పారదర్శకతతో అవినీతిరహిత విధానాన్ని అనుసరించి కార్డులు అందజేస్తున్నాం." అని పేర్కొన్నారు.

కొత్త రేషన్ కార్డుల కోసం చాలా కాలంగా ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. మీసేవా కేంద్రాలు, ప్రజాపాలన కార్యక్రమం, గ్రామసభలు, ఇతర మాధ్యమాల ద్వారా ప్రజల నుంచి దరఖాస్తులు స్వీకరించింది. వాటిని జిల్లా స్థాయిలో సమీక్షించి, అర్హులైన లబ్ధిదారుల జాబితా సిద్ధం చేసింది. అనంతరం గ్రామసభల ద్వారా అర్హుల గురించి తెలియజేసింది. తర్వాత కూడా అభ్యంతరాలు స్వీకరించి తర్వాత ఫైనల్ జాబితా కన్ఫామ్ చేసింది.