తెలంగాణ సీఎం కేసీఆర్ నల్లగొండ జిల్లా నాగార్జునసాగర్ నియోజకవర్గంలో పర్యటనకు షెడ్యూల్ ఖరారైంది. ఆగస్టు 2వ తేదీన సాగర్ నియోజకవర్గంలో సీఎం కేసీఆర్ పర్యటించనున్నారు. సీఎం పర్యటన వివరాలను రాష్ట్ర మంత్రి మంత్రి జగదీష్ రెడ్డి బుధవారం నాడు మీడియాకు వెల్లడించారు. అయితే నాగార్జునసాగర్ నియోజకవర్గంలో కేసీఆర్ పర్యటన వెనుక భారీ ప్లాన్ ఉందని విపక్ష నేతలు మండిపడుతున్నారు.


సీఎం కేసీఆర్ ఆగస్టు 2న సాగర్ నియోజకవర్గంలోని హాలియాకు వస్తారని మంత్రి జగదీష్ రెడ్డి తెలిపారు. హాలియాలో నిర్వహించనున్న ప్రగతి సమీక్షా కార్యక్రమంలో భాగంగా అధికారులతో సీఎం కేసీఆర్ సమావేశం అవుతారని వెల్లడించారు.  స్థానిక అధికారులతో సమీక్ష నిర్వహించి.. ఎన్నికల హామీలపై చర్చిస్తారని చెప్పారు. స్థానిక అభివృద్ధిపై సిద్ధం చేసిన ప్రణాళికలు, చేపట్టిన చర్యలపై సీఎం కేసీఆర్ చర్చించనున్నారు. సాగర్ ఉప ఎన్నికల నేపథ్యంలో ఇచ్చిన మాట నిలబెట్టుకునేందుకు సీఎం కేసీఆర్ అన్ని చర్యలు తీసుకున్నారని మంత్రి జగదీష్ రెడ్డి పేర్కొన్నారు. 


నాగార్జున సాగర్​ ఉపఎన్నికల ప్రచారంలో భాగంగా సాగర్, హుజూర్‌నగర్‌, మిర్యాలగూడ పరిధిలోని ఎత్తిపోతల పథకాలన్నీ పూర్తి చేస్తామని తెలంగాణ ప్రభుత్వం హామీ ఇచ్చింది. త్వరలో నిర్వహించనున్న సమీక్షా సమావేశంలో ఎత్తిపోతల పథకాలు,  ఆ నియోజకవర్గ అభివృద్ధిపై ప్రజాప్రతినిధులు, అధికారులతో చర్చించేందుకు అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు. ఎన్నికల హామీలు కచ్చితంగా అమలు చేస్తాననే నమ్మకం కల్పించేందుకు, జరిగిన పనులను నేరుగా వచ్చి తెలుసుకుంటానని స్థానిక ప్రజలలో సీఎం కేసీఆర్ భరోసా కల్పించడానికి సిద్ధమయ్యారు.


సాగర్ నియోజకవర్గంలో సీఎం కేసీఆర్ పర్యటనను రాజకీయ డ్రామాగా విపక్ష నేతలు పేర్కొన్నారు. వాస్తవానికి హుజూరాబాద్ ఉప ఎన్నికల నేపథ్యంలో తెలంగాణ సీఎం కేసీఆర్ దళిత బంధు అంటూ కొత్త మోసానికి తెరలేపారని విపక్ష నేతలు విమర్శిస్తున్నారు. ఎన్నికల సమయంలో హడావుడి చేసి, వాగ్దానాలు చేసే కేసీఆర్ ఆపై వాటిని గాలికొదిలేస్తారని, ప్రస్తుతం హుజూరాబాద్ ఉప ఎన్నిక నేపథ్యంలో అదే డ్రామా కొనసాగుతుందని కాంగ్రెస్, బీజేపీ నేతలు విమర్శనాస్త్రాలు ఎక్కుపెట్టారు. ప్రస్తుతం హుజూరాబాద్ విజయంపై ఫోకస్ చేసిన సీఎం కేసీఆర్ నాగార్జునసాగర్ నియోజకవర్గంలో పర్యటిస్తున్నారని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.


కాగా, నేడు నల్లగొండ జిల్లాలోని మనుగోడులో టెన్షన్ వాతావరణం నెలకొంది. స్థానికంగా రేషన్ కార్డుల పంపిణీ కార్యక్రమంలో మంత్రి జగదీష్ రెడ్డి పాల్గొనగా, ఈ నేపథ్యంలో ఎమ్మెల్యే కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి దళిత బంధు పథకం కోసం చలో మునుగోడు కార్యక్రమానికి  పిలుపునిచ్చారు. నియోజకవర్గంలో పలు ప్రాంతాల్లో కాంగ్రెస్ కార్యకర్తలను పోలీసులు ముందస్తుగా అరెస్ట్ చేశారు. మంత్రి జగదీష్ రెడ్డి కాన్వాయ్‌ను అడ్డుకునే ప్రయత్నం చేయగా ఉద్రిక్తత చోటుచేసుకుంది.