Suryapet MLA Jagadish Reddy: నల్లగొండ: బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో రైతులకు ఉచిత విద్యుత్ తో పాటు సాగునీళ్లు ఇచ్చామని, కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక రాష్ట్రంలో చాలా మార్పు వచ్చిందన్నారు మాజీ మంత్రి, సూర్యాపేట ఎమ్మెల్యే జగదీశ్ రెడ్డి. నల్లగొండ మండలం, అన్నపర్తి గ్రామంలో మాజీ ఎమ్మెల్యే భూపాల్ రెడ్డి తో కలిసి ఎండిన వరి పంట పొలాలను, నిమ్మ తోటలను జగదీష్ రెడ్డి పరిశీలించారు. అక్కడి రైతుల సమస్యలను అడిగి తెలుసుకున్నారు.
నాగార్జునసాగర్ ఆయకట్టు కోసం ఎగువనున్న నారాయణపుర్, ఆల్మట్టి డ్యామ్ లనుండి 10 టీఎంసీల నీటిని విడుదల చేయించి.. రైతులకి సాగునీరు అందించాలని జగదీశ్ రెడ్డితో పాటు బీఆర్ఎస్ నేతలు డిమాండ్ చేశారు. మూసీ ప్రాజెక్టు కింద నీరు అందించే అవకాశం ఉన్నా.. కాంగ్రెస్ ప్రభుత్వం నిమ్మకునీరెత్తినట్లు వ్యవహరిస్తుందని ఆగ్రహం వ్యక్తం చేశారు. తెలంగాణలో ఏ గ్రామానికి వెళ్లినా తమకు ఎండిన పంట పొలాలే దర్శనమిస్తున్నాయని, పెట్టుబడులన్నీ మట్టిలో కలిసిపోయి రైతులు విలపిస్తున్నారని చెప్పారు. సీఎం రేవంత్ రెడ్డి సహా జిల్లాల్లోని ఏ ఒక్క మంత్రి, ఎమ్మెల్యే, అధికారులు సైతం రైతుల వైపు కన్నెత్తి చూడటం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు.
కాంగ్రెస్ మంత్రులకు రాజకీయాలు, అక్రమ వసూళ్లు, దందాలు తప్ప, రైతుల గోడు పట్టట్లేదని జగదీశ్ రెడ్డి విమర్శించారు. ఉమ్మడి నల్గొండ జిల్లా మంత్రులు కోమటిరెడ్డి, ఉత్తమ్ కుమార్ రెడ్డిలు ఉత్తరకుమారులు అని, ప్రగల్భాలు పలకడం తప్ప దేనికి పనికిరారని ఎద్దేవా చేశారు. ఆ ఇద్దరికీ ఎంతసేపు రాజకీయాలు చేయడం తప్పా, రైతుల సంక్షేమం పట్టలేదన్నారు. కాంగ్రెస్ పార్టీ నిర్లక్ష్య పూరిత వైఖరితో రైతులు మరిన్ని సమస్యలు ఎదుర్కొంటున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇప్పటికైనా కళ్లు తెరిచి కరువుపై సర్వే చేయించి, నష్టపోయిన రైతులకు పరిహారం అందించి ఆదుకోవాలని జగదీష్ రెడ్డి డిమాండ్ చేశారు. లేకపోతే రైతుల ఉసురు తగిలి కాంగ్రెస్ ప్రభుత్వం నాశనం అవుతుందంటూ శాపనార్థాలు పెట్టారు.