Sr NTR Statue At Lakaram Lake in Khammam: శ్రీకృష్ణుడి వేషధారణలో ఉన్న నందమూరి తారకరామారావు విగ్రహం ఇప్పుడు ఖమ్మం లకారం అందాలలో బాగం కానుంది. వచ్చే ఏడాది ఎన్టీఆర్100వ జయంతి సందర్భంగా ఈ విగ్రహాన్ని ఏర్పాటు చేసేందుకు అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. ఇప్పటికే విగ్రహం తయారీ పనులు పూర్తి కావస్తున్నాయి. రోజురోజుకు అభివృద్ధిలో దూసుకెళుతున్న ఖమ్మం నగరానికి లకారం ట్యాంక్ బండ్ మణిహారంలా మారింది. నగర ప్రజలకు అహ్లాదాన్ని అందిస్తుంది. ఇప్పటికే తీగల వంతెనకు స్థానికుల నుంచి మంచి ఆదరణ లభిస్తుండగా ఇప్పుడు లకారం అందాలలో ఎన్టీఆర్ విగ్రహం కనువిందు చేయనుంది.
ఖమ్మం నగరానికి చెందిన ఎన్‌ఆర్‌ఐలు, రవాణాశాఖ మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్ చొరవతో ఈ విగ్రహం ఏర్పాటు కోసం ప్రత్యేకంగా ఒక కమిటీని ఏర్పాటు చేశారు. ప్రభుత్వం నుంచి అనుమతులు మంజూరు కావడంతో 2023 మే 28న ఎన్టీఆర్ 100వ జయంతి సందర్భంగా ఈ విగ్రహాన్ని ఆవిష్కరించేందుకు కమిటీ ఏర్పాట్లు పూర్తి చేస్తుంది.
54 అడుగుల భారీ విగ్రహం..
శ్రీకృష్ణుడి వేషధారణలోని 54 అడుగుల భారీ విగ్రహాన్ని నిర్వాహకులు ఏర్పాటు చేయనున్నారు. హైదరాబాద్‌లోని ట్యాంక్‌బండ్ తరహాలోనే లకారం ట్యాంక్‌బండ్‌లో తీగల వంతెన సమీపంలో ఈ విగ్రహాన్ని ఏర్పాటు చేయనున్నారు. బేస్‌మెంట్‌తో కలిపి 34 అడుగుల ఎత్తు ఉండే విగ్రహాన్ని ఎటు చూసినా 36 అడుగుల బేస్‌మెంట్‌ను ఏర్పాటు చేయనున్నారు. లకారం ట్యాంక్ బండ్ మద్యలో ఈ విగ్రహం ఉండేలా ప్రణాళికలు రూపొందించారు. పౌరాణిక గాధలకు ప్రాణం పోసి తెలుగు ప్రేక్షకులకు దేవుడిలా మారిన నందమూరి తారకరామారావు విగ్రహం ఇక్కడ శ్రీ కృష్ణుడి అవతారంలో పర్యాటకులను ఆకర్షించనుంది.
రూ.2.3 కోట్ల వ్యయంతో..
ఎన్టీఆర్ విగ్రహాన్ని ఏర్పాటు చేసేందుకు రూ.2.3 కోట్లు వెచ్చిస్తున్నారు. ఖమ్మం నగరానికి చెందిన ఎన్‌ఆర్‌ఐలతోపాటు స్థానికంగా ఉన్న నేతలు, మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్ నేతృత్వంలో ఈ విగ్రహాన్ని ఏర్పాటు చేసేందుకు కమిటీని ఏర్పాటు చేశారు. ఈ కమిటీ ఆధ్వర్యంలో విగ్రహాన్ని రూపొందిస్తున్నారు. నిజామాబాద్‌కు చెందిన వర్మ అనే చిత్రకారుడు ఈ విగ్రహాన్ని రూపొందిస్తున్నారు. మే 28న జూనియర్ ఎన్టీఆర్ చేతుల మీదుగా ఈ విగ్రహాన్ని ఆవిష్కరించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ విగ్రహం ఏర్పాటు చేస్తే ఇప్పటికే ఖమ్మం నగరానికి కొత్త అందాలను తెచ్చిన లకారం ట్యాంక్ బండ్‌లో శ్రీ కృష్ణుడి వేషదారణలో ఉన్న ఎన్టీఆర్ పర్యాటకులను ఆకర్షించనున్నారు.
Also Read: Weather Updates: బీ అలర్ట్, తెలుగు రాష్ట్రాల్లో మరో 2 రోజులు వర్షాలు - ఎల్లో అలర్ట్ జారీ చేసిన వాతావరణ శాఖ
Also Read: Khammam Politics: రేగాకు షాక్! సొంత మండలం జడ్పీటీసీ రాజీనామా, ఆచితూచి జంప్ అవుతున్న నేతలు