Revanth Reddy: వికారాబాద్ జిల్లా పర్యటనలో ఉన్న పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి.. ముఖ్యమంత్రి కేసీఆర్ సెటైర్లు వేశారు. కాంగ్రెస్ పార్టీకి భయపడిన వ్యక్తికి బీఆర్ఎస్ లో మంత్రి పదవి ఇచ్చారని రేవంత్ ఎద్దేవా చేశారు. గురువారం రోజు వికారాబాద్ జిల్లా పర్యటనలో భాగంగా.. పూడూరు మండలం మన్నేగూడలోని జేకే ఫంక్షన్ హాల్ లో నిర్వహించిన కాంగ్రెస్ చేవెళ్ల ప్రజాగర్జన సన్నాహక సమావేశంలో రేవంత్ రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడిన రేవంత్ రెడ్డి.. బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ పై విమర్శలు గుప్పించారు.


బీఆర్ఎస్ మంత్రివర్గంలో ఒక్క మాదిగ బిడ్డకు కూడా చోటు కల్పించలేదని, అలాంటప్పుడు మాదిగ బిడ్డలు బీఆర్ఎస్ కు ఎందుకు ఓటు వేయాలని టీపీసీసీ చీఫ్ ప్రశ్నించారు. కేసీఆర్ ఒక్క ముదిరాజ్ బిడ్డకూ ఎమ్మెల్యే టికెట్ ఇవ్వలేదని రేవంత్ రెడ్డి గుర్తు చేశారు. ముదిరాజ్ బిడ్డలు తెలంగాణ వారు కారా.. వారు తెలంగాణ ఉద్యమంలో లేరా అని ప్రశ్నించారు. ముదిరాజ్ బిడ్డలు కేసీఆర్ కు ఎందుకు ఓటు వేయాలన్నారు. ముదిరాజ్ లను బీసీడీ నుంచి బీసీఏ లోకి మార్చేందుకు కాంగ్రెస్ పార్టీ కృషి చేస్తుందని.. సుప్రీం కోర్టులో ముదిరాజ్ ల తరపున వాదిస్తామని హామీ ఇచ్చారు.


పాలమూరు ఎత్తిపోతల పూర్తి చేయడం ముఖ్యమంత్రి కేసీఆర్ కు ఇష్టం లేదని రేవంత్ రెడ్డి ఆరోపించారు. కృష్ణా నది జలాలు వికారాబాద్ జిల్లాకు ఎందుకు తీసుకురాలేదని ప్రశ్నిస్తే.. ఆంధ్రప్రదేశ్ సీఎం జగన్ అడ్డుకుంటున్నట్లు కేసీఆర్ సమాధానం చెబుతున్నారని రేవంత్ అన్నారు. జగన్ ను ప్రగతి భవన్ కు పిలిచి భోజనం పెట్టినప్పుడు ఈ విషయం కేసీఆర్ కు తెలియదా అని ప్రశ్నించారు. నీళ్లు జగన్ మోహన్ రెడ్డి తీసుకెళ్తున్నాడని, నిధులు మెగా కృష్ణా రెడ్డికి ఇచ్చారని, నియామకాలేమో కేసీఆర్ ఇంట్లోకి పోయాయని రేవంత్ రెడ్డి మండిపడ్డారు. తెలంగాణలో ఇందిరమ్మ రాజ్యం తెచ్చి రాష్ట్రం#లో దళిత గిరిజనులను ఏ విధంగా అభివృద్ధి చేసుకుంటామో డిక్లరేషన్ ద్వారా వివరిస్తామని రేవంత్ తెలిపారు. చేవెళ్ల సెంటిమెంట్ తో నిర్వహించే సభను అందరూ కలిసి విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు.


Also Read: Brics Summit 2023: బ్రిక్స్‌లో 6 దేశాలకు కొత్తగా సభ్యత్వం, కూటమి బలోపేతం అవుతుందన్న మోదీ


కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణలో కేసీఆర్ ఒక్క చుక్క నీరు ఇవ్వలేదని రేవంత్ రెడ్డి ఆరోపించారు. ప్రాణహిత చేవెళ్ల ప్రాజెక్టు ద్వారా చేవెళ్ల ప్రాంతానికి రావాల్సిన నీటిని అడ్డుకున్నారని అన్నారు. గోదావరి జలాలన్నీ మావే అన్నట్లు తమ నియోజకవర్గాలకు మళ్లించుకున్నారని కేసీఆర్ పై రేవంత్ రెడ్డి మండిపడ్డారు. కేసీఆర్ ఫాంహౌజ్ చుట్టూ కాల్వలు చేసుకుని సిరిసిల్ల, గజ్వేల్ కే నీళ్లు ఇస్తా అంటున్నారని విమర్శించారు. వికారాబాద్ ప్రాంతానికి కేసీఆర్ ముఖ్యమంత్రి కాదా అని ప్రశ్నించారు. ఈ ప్రాంతంలో ఉన్న ప్రజలు ఆలోచించాలని రేవంత్ రెడ్డి కోరారు. 


ఇందిరమ్మ ఇళ్లు లేని ఊరు ఉందా.. డబుల్ బెడ్రూమ్ ఇళ్లు ఉన్న ఊర్లు ఏమైనా ఉన్నాయా అని ప్రజలు ఆలోచించాలని రేవంత్ రెడ్డి కోరారు. వికారాబాద్ లో ఈసారి కాంగ్రెస్ జెండా ఎగురవేస్తామని ధీమా వ్యక్తం చేశారు. ఈ నెల 26వ తేదీన కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో చేవెళ్లలో ఎస్సీ, ఎస్టీ డిక్లరేషన్ సభను విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. మాజీ మంత్రి ఎ. చంద్రశేఖర్ జహీరాబాద్ నుంచి పోటీ చేస్తారని రేవంత్ రెడ్డి ముందే ప్రకటించారు. చేవెళ్లలో జరిగే ఎస్సీ, ఎస్టీ డిక్లరేషన్ సమావేశాన్ని మాజీ మంత్రి గడ్డం ప్రసాద్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు.