Priyanka Gandhi Speech: తెలంగాణలో యువతకు ఉద్యోగాలు కావాలంటే అందరూ కాంగ్రెస్‌కు ఓట్లు గెలిపించాలని ప్రియాంక గాంధీ కోరారు. ఈ ప్రభుత్వం ప్రజలు కష్టాల్లో ఉన్నప్పుడు అండగా నిలబడలేదని అన్నారు. నిత్యావసర ధరలు కూడా విపరీతంగా పెరిగాయని అన్నారు. కేసీఆర్ ప్రభుత్వం కళ్లు మూసుకుని నిద్రపోతోందని ఎద్దేవా చేశారు. వ్యవసాయం చేసుకోవాలనే రైతులకు రుణాలు ఇవ్వడం లేదని, ఆఖరికి మాట ఇచ్చిన రుణమాఫీ కూడా జరగలేదని ప్రియాంక అన్నారు. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల కోసం కాంగ్రెస్‌ అగ్రనేత ప్రియాంక గాంధీ భువనగిరిలో రోడ్‌ షో నిర్వహించారు. భువనగిరి కాంగ్రెస్‌ అభ్యర్థికి మద్దతుగా ఆమె ప్రచారం చేశారు.


నిరుద్యోగులు ఉద్యోగాల కోసం ఎంతో కష్టపడి చదివి, పరీక్షలు రాస్తే.. ఆ ప్రశ్నాపత్రాలు లీక్ అయ్యాయని ప్రియాంక గాంధీ ఆరోపించారు. ప్రభుత్వంలో ఎక్కడ చూసినా అవినీతి ఉందని, కాళేశ్వరం ప్రాజెక్టులో ఎంత అవినీతి జరిగిందో అందరికీ తెలుసని అన్నారు. బీజేపీ, బీఆర్ఎస్ పార్టీలు అధికారం కోసం మాత్రమే చూస్తున్నాయని, ప్రజల కష్టాలను పట్టించుకోవడం లేదని విమర్శించారు.


తెలంగాణ కోసం యువకులు, విద్యార్థులు రక్తాన్ని చిందించి రాష్ట్రాన్ని సాధించుకుంటే.. కాళేశ్వరం ప్రాజెక్టులో అవినీతి చేసుకొని బీఆర్ఎస్ నాయకులు డబ్బు సంపాదించుకున్నారని అన్నారు. ప్రాణాలకు అర్పించి ప్రత్యేక రాష్ట్రం తెచ్చుకున్నది ఇందుకేనా అని ప్రశ్నించారు. బీఆర్ఎస్ ప్రభుత్వం 10 ఏళ్లపాటు తెలంగాణలో ఉండి సాధించింది ఏమీ లేదని అన్నారు. ఈ ఎన్నికల్లో వారికి బుద్ధి చెప్పాల్సిన అవసరం ఉందని.. కాంగ్రెస్ వస్తే ప్రజల ప్రభుత్వం వస్తుందని అన్నారు. కాంగ్రెస్ వచ్చాక  ఇళ్లు కట్టుకోటానికి రుణాలు ఇప్పిస్తామని అన్నారు. మహిళలకు ప్రతి నెల రూ.2,500 ఇస్తామని చెప్పారు. తెలంగాణలో ఎక్కడికి ప్రయాణించాలన్నా ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పిస్తామని అన్నారు. కర్ణాటక, ఛత్తీస్‌గఢ్‌, రాజస్థాన్‌లో ఆరు గ్యారంటీలను ఇచ్చినట్లుగా చెప్పారు. తెలంగాణలో కూడా ఆ గ్యారంటీలను అమలు చేస్తామని వివరించారు. కాంగ్రెస్ ఎప్పుడూ ప్రజల గురించే ఆలోచిస్తుందని.. ప్రియాంక గాంధీ తెలిపారు.