Nallu Inndrasena Reddy: తెలంగాణలో ఇప్పుడు ఎక్కడ చూసినా మునుగోడు ఉప ఎన్నికలపై చర్చ నడుస్తోంది. అయితే సీఎం కేసీఆర్, టీఆర్ఎస్ పార్టీ నేతల తీరు చూస్తుంటే మునుగోడు ఉపఎన్నికలకు బదులు తెలంగాణలో ముందస్తు ఎన్నికలు వచ్చే అవకాశం ఉందని బీజేపీ రాష్ట్ర మాజీ అధ్యక్షుడు, జాతీయ కార్యవర్గ సభ్యుడు నల్లు ఇంద్రసేనా రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. కోమటి రెడ్డి రాజగోపాల్ రెడ్డి ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి ఆమోదించుకున్నప్పటికీ.. టీఆర్ఎస్ లో ఎలాంటి కదలిక లేదన్నారు. అయితే ఏ ఎన్నికలు వచ్చినా మునుగోడులో గెలిచేది మాత్రం కోమటి రెడ్డి రాజగోపాల్ రెడ్డియే అని వివరించారు. అక్కడ ఆయనకు గట్టి పట్టు ఉందని తెలిపారు. ఉప ఎన్నిక అంటే టీఆర్ఎస్ పార్టీకి వణుకు మొదలవుతుందన్నారు.


మునుగోడులో రాజగోపాల్ రెడ్డికి గట్టి పట్టుంది.. 
గతంలో తాను లోక్ సభ ఎన్నికల్లో పోటీ చేసినప్పుడు మునుగోడు సెగ్మెంట్ లో బీజేపీకి 30 వేల ఓట్లు మాత్రమే వచ్చాయని.. రాజగోపాల్ రెడ్డి ముందు నిలబడలేకపోయానని ఇంద్రసేనారెడ్డి గుర్తు చేశారు. అలాగే గత ఎన్నికల్లో టీఆర్ఎస్ 88 స్థానాలు దక్కించుకున్నప్పటికీ.. మునుగోడులో మాత్రం ఓడి పోయిందన్నారు. అందుకు ప్రధాన కారణం కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ప్రత్యర్థిగా ఉండటమేనని తెలిపారు. అప్పుడు గెలవని టీఆర్ఎస్ ఇప్పుడెలా గెలుస్తుందంటూ కామెంట్లు చేశారు. మునుగోడుకు ఉప ఎన్నిక వచ్చినా, టీఆర్ఎస్ ముందుస్తు ఎన్నికలకు వెళ్లినా మునుడోగులో విజయం సాధించేది రాజగోపాల్ రెడ్డియేనని స్పష్టం చేశారు. ఎంపీ రాహుల్ గాంధీ వచ్చి ప్రచారం చేసినా కాంగ్రెస్ ఓడిపోవడం ఖాయం అన్నారు. టీడీపీతో పొత్తు ఉండదని, బీజేపీ ఒంటరిగానే పోటీ చేస్తుందని ఇంద్రసేనారెడ్డి వివరించారు. 


రాజగోపాల్ రెడ్డిని కలిసిన బండి సంజయ్ 
బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ కుమార్ నిన్న కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డిని కలిశారు. ఆయన ప్రస్తుతం బీజేపీలో చేరేందుకు ఏర్పాట్లు చేసుకుంటున్నారు. ఈ క్రమంలోనే తన భవిష్యత్ కార్యాచరణ, బీజేపీలో ఎప్పుడు చేరుతానన్న విషయం గురించి బండి సంజయ్ తో చర్చించారు. యాదాద్రి జిల్లా పంతంగి వద్ద మాజీ ఎంపీలు వివేక్, కొండా విశ్వేశ్వర్ రెడ్డితో కలిసి భేటీ అయ్యారు.


ఈనెల 21వ తేదీన ముహూర్తం..


ఇప్పటికే దిల్లీలో పార్టీ జాతీయ నేతలలో కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి భేటీ అయ్యారు. అక్కడే పార్టీలో చేరాల్సి ఉన్నా.. తన నియోజకవర్గంలో బహిరంగ సభ ఏర్పాటు చేసి కేంద్ర హోంమంత్రి అమిత్ షా సమక్షంలోనే పార్టీలో చేరతానని ఆయన చెప్పినట్లు సమాచారం. అయితే అమిత్ షా ఈనెల 21వ తేదీన సమయం ఇవ్వడంతో రాజగోపాల్ రెడ్డితో పటు మరికొందరు కమలం గూటికి చేరేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. ఇదే విషయమై బండి సంజయ్ తో చర్చించిన రాజగోపాల్ బహిరంగ స్థలం, ఇతర ఏర్పాట్ల గురించి చర్చించారు. ఏది ఏమైనా మునుగోడు ఉప ఎన్నికల్లో బీజేపీనే గెలుస్తుందని.. అందుకోసం అందరం కలిసి కృషి చేస్తామని బండి సంజయ్ తెలిపారు. ఉప ఎన్నికలు కోరుకున్నది సీఎం కేసీఆర్ యే అంటూ విమర్శించారు. దుబ్బాక, నాగార్జున సాగర్, హుజూరాబాద్ ఉపఎన్నికల సమయాల్లో ఆరు నెలల చొప్పున కేసీఆర్ టైంపాస్ చేశారని.. ఇప్పుడు మునుగోడు ఉపఎన్నిక పేరుతో మరోసారి ఆరు నెలల టైంపాస్ చేస్తారని వ్యాఖ్యానించారు.