Nalgonda Crime News: తండ్రిని చంపితే అతని పేరిట ఉన్న పొలం అంతా తనకే దక్కుతుందని కుమారుడు, భర్తను చంపితే తనకు నెలనెలా పింఛన్ వస్తుందని భావించిన భార్య కలిసి.. కుటుంబం పెద్దను చంపేద్దామనుకున్నారు. ఇందుకోసం ప్రత్యేకంగా పథకాన్ని సిద్ధం చేసుకున్నారు. ఇద్దరూ కలిసి డబ్బులు పోగేసి మరీ కిరాయి హంతకుడితో భర్తను హత్య చేయించారు. అయితే వారు అనుకున్నట్లు పొలం, పింఛన్ కు బదులుగా.. జైల్లో ఊచలు లెక్కబెడుతున్నారు. 


వెంకటయ్య హత్యకు లక్ష రూపాయల సుపారీ..


నల్గొండ జిల్లా పెద్దవూర మండలం చిన్నగూడెం గ్రామానికి చెందిన దాసరి వెంకటయ్యకు భార్య సుగుణమ్మ, కుమారుడు కోటేశ్, ముగ్గురు కుమార్తెలు ఉన్నారు. కుమార్తెలకు పెళ్లిళ్లు కాగా... వెంకటయ్య చిన్నగూడెంలో ఉంటున్నాడు. ఆయన భార్య, కుమారుడు మాత్రం అనుముల మండలం పులిమామిడిలో ఉంటున్నారు. చిన్నగూడెంలోని ఎకరం పొలాన్ని అమ్మాలని భార్య, కుమారుడు కొన్ని రోజులుగా వెంకట్యపై ఒత్తిడి తెస్తున్నారు. అయితే అందుకు మాత్రం ఆయన ఒప్పుకోవడం లేదు. దీంతో ఎలాగైనా సరే అతడిని అడ్డు తొలగించుకుంటే తనకు పొలం దక్కుతుందని కుమారుడు భావించాడు. భర్తను హత్య చేస్తే తనకు వితంతు పింఛన్ వస్తుందని ఆశ పడింది. ఇందుకోసం వీరిద్దరూ కలిసి మారేపల్లిలోని అనుముల మహేష్‌తో ఒప్పందం కుదుర్చుకున్నారు. లక్ష రూపాయలు ఇస్తే.. వెంకటయ్యను చంపేందుకు అతను కూడా ఓకే చెప్పాడు. ముందస్తుగా 15 వేల రూపాయలు కూడా చెల్లించారు. 


చంపి మృతదేహంపై ఉన్న బట్టలు తొలగింపు..


పథకం ప్రకారం తల్లి, కుమారుడు కలిసి వెంకటయ్యను ఈనెల 14వ తేదీన ఉదయం పులిమామిడికి రప్పించారు. అదే రోజు సాయంత్రం తిరిగి చిన్నగూడెంలో దింపుతామని కోటేశ్, మహేశ్‌ తీసుకొచ్చిన కారులో తన తండ్రిని ఎక్కించుకొని మారేపల్లి వైపు తీసుకెళ్లాడు. మార్గ మధ్యంలో వెంకటయ్యకు మద్యం తాగించారు. మద్యం మత్తులో ఉన్న ఆయన మెడకు కోటేశ్, మహేష్ టవల్ బిగించి హత్య చేశారు. ఆ తర్వాత మృతదేహాన్ని అనుముల సమీపంలో పడేసి అతని ఒంటిపై ఉన్న దుస్తులను తీసుకెళ్లారు. మరుసటి రోజు విషయం తెలుసుకున్న పోలీసులు మృతదేహం ఉన్న స్థలానికి వెళ్లి వివరాలు ఆరా తీశారు. అప్పుడే కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు. మృతుడి భఆర్య, కుమారుడిపై అనుమానంతో వారిద్దరి కాల్ డేటా పరిశీలించారు. 


చివరకు పోలీసులకు పట్టుబడిన తల్లీ, కుమారులు..


చివరకు వారిద్దరే ఈ కిరాతకానికి పాల్పడినట్లు నిర్ధారణకు వచ్చారు. సోమవారం నల్గొండ నుంచి పులిమామిడికి కారులో వస్తున్న ముగ్గురు నిందితులను పోలీసులు అదుపులోకి తీసకున్నారు. వారిని విచారించగా విషయం వెలుగులోకి వచ్చింది. భూము కొనుగోలుకు ఒప్పుకోకపోవడం వల్లే.. భూము కోసం తాను, పింఛన్ వస్తుందని తల్లి ఈ ఘాతుకానికి పాల్పడినట్లు ఒప్పుకున్నారు. ఈ క్రమంలోనే మహేష్ కు డబ్బులు ఇచ్చి మరీ హత్య చేశామని అంగీకరించారు. వారిపై కేసు నమోదు చేసిన పోలీసులు రిమాండ్ కు తరలించారు. 2019లో ఓ మైనర్ బాలిక అదృశ్యమైన కేసులో మహేశ్ నిందితుడని మిర్యాలగూడ డీఎస్పీ వెంకటేశ్వరరావు తెలిపారు.