ఆరోపణలు, విమర్శలు నిజమేనా? అన్న మాటలకు ఇప్పుడు తెలంగాణ రాష్ట్రంలో ఇటు అధికార అటు కేంద్ర సంస్థలు జరుపుతున్న విచారణలే సమాధానాలు చెబుతున్నాయి. టీఆర్‌ఎస్‌, బీజేపీ పోటాపోటీగా ఒకరిపై ఒకరు చేసుకుంటున్న ఆరోపణలకు ఈడీ, సిట్‌, సీబీఐ, ఐటీ సంస్థల విచారణలో ప్రజలకు తెలియాల్సిందంతా తెలుస్తోందా? ఈ దాడులతో ఎవరికి లబ్ది చేకూరుతోంది? 


ఇప్పుడు తెలుగురాష్ట్రాల్లో ముఖ్యంగా తెలంగాణలో అధికార టీఆర్‌ఎస్‌, బీజేపీ మధ్య నువ్వానేనా అన్న రేంజ్‌లో యుద్ధం సాగుతోంది. ఇందులో ఈడీ, సిట్‌, సీబీఐ ప్రధాన అస్త్రాలుగా మారాయి. ఒకరిపై ఒకరు చేసుకుంటున్న ఆరోపణలకు ఈ సంస్థలు కేరాఫ్‌గా మారాయి. తెలంగాణ రాష్ట్రం ఏర్పాటైనప్పటి నుంచి టీఆర్‌ఎస్‌ పార్టీ అధికారంలో ఉంది. దాదాపు 8ఏళ్ల పాలనలో కెసిఆర్‌ ప్రభుత్వం భారీగా అవినీతికి పాల్పడిందని ప్రతిపక్షాలన్నీ ఆరోపణలు చేశాయి. అంతేకాదు బీజేపీ-టీఆర్‌ఎస్‌ మధ్య యుద్ధం రోడ్డు మీదకి చేరడంతో ఇప్పుడు ఆయా నేతల గుట్టు బయటపడుతోందన్న వాదనలు వినిపిస్తున్నాయి. 


ఢిల్లీ లిక్కర్‌ స్కాంలో ఎప్పుడైతే ఎమ్మెల్సీ కవిత పేరు వినిపించిందో ఇక అప్పటి నుంచి ఈ నోటీసుల ప్రక్రియ స్పీడందుకుంది. గత కొన్నిరోజులుగా టీఆర్‌ఎస్‌ నేతలను టార్గెట్‌ చేస్తూ ఈడీ, ఐటీ నోటీసులు పంపుతున్నారు. ఫెమా ఉల్లంఘన కేసులో ఎమ్యెల్యే కిషన్‌ రెడ్డి ఈడీ ఎదుట హాజరైతే మైనింగ్‌ కేసుకి సంబంధించి మంత్రి గంగుల ఆయన కుటుంబసభ్యులు, ఎంపీ వద్దిరాజు రవిచంద్ర ఇళ్లపై ఈడీ దాడులు జరిపింది. క్యాసినో కేసులో ఇప్పటికే ఎమ్మెల్సీ రమణ ఈడీ ముందు హాజరయ్యారు. మంత్రి తలసాని సోదరులకు, పీఏ, తలసాని కొడుక్కి కూడా ఈడీ నోటీసులు పంపింది. త్వరలోనే ఇంకొంతమందికి ఈడీ, ఐటీ నోటీసులు రానున్నట్లు స్వయంగా కేసీఆరే చెప్పారు. 


బీజేపీ ఆడుతున్న ఆటకు ప్రతిగా టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం కూడా సీబీఐ రాకను అడ్డుకుంటూ జీవో విడుదల చేసింది. ప్రభుత్వ వెబ్‌ సైట్లలోనూ, రైట్‌ టు ఇన్ఫర్మేషన్‌ యాక్ట్‌ కింద కూడా అవకాశం లేకుండా పకడ్బందీగా వ్యవరించిందన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. పార్టీ ఫిరాయింపుల కేసులో బీజేపీ నేతలను జైలుకి పంపించి సిట్‌తో దర్యాప్తు చేయిస్తోంది. ఈ కేసులో లింక్‌ ఉన్నట్లు ఆరోపణలు ఎదుర్కొంటోన్న బీజేపీ రాష్ట్ర పెద్దలకు సిట్‌ నోటీసులు ఇచ్చినా వాళ్లు హాజరుకాకపోవడంతో ఏ క్షణానైనా అరెస్ట్‌ ఉండచ్చన్న వార్తలు వినిపిస్తున్నాయి. ఇలా ఇరుపార్టీలు ఒకరిపై ఒకరు ఆరోపణలకు చేసుకోవడమే కాకుండా ఆయా సంస్థలను కూడా రంగంలోకి దింపడంతో ఏఏ పార్టీ.. ఏఏ రాజకీయనాయకుడు... ఏఏ రూపంలో... ఏ విధంగా ఏ రూట్లో అవినీతికి పాల్పడ్డాడన్నది ఆధారాలతో సహా ప్రజలకు తెలిసే టైమ్‌ వచ్చేసిందని రాజకీయవిశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఇప్పటివరకు తెర వెనక జరిగిన అవినీతంతా ఇప్పుడు ఆయా సంస్థల ఎంట్రీతో బయటపడుతుందని చెబుతున్నారు. 


దీన్ని రాజకీయకోణంలో ఆలోచించే వాళ్లు మాత్రం ఇదంతా ఓ నాటకమని కొట్టిపారేస్తున్నారు. రాజకీయకక్షసాధింపు చర్యల్లో భాగమే తప్ప ఏ రాజకీయనాయకుడి అవినీతి బయటపడదంటున్నారు. ప్రజల దృష్టిని మరల్చేందుకే తప్ప ఈ విచారణలతో సామాన్యులకి ఒరిగేది ఏమీ లేదంటున్నారు. 2G స్కాం, బొగ్గు గనుల కేటాయింపుల స్కాం, బోఫోర్స్‌ కేసు, రాఫెల్‌ యుద్ద విమానాలతోపాటు పలు స్కాంల్లో కోట్లు ఖర్చు పెట్టి చివరికి ఎవరి తప్పు లేదని ఆ కేసులను ముగించిన విషయాలను గుర్తు చేస్తున్నారు. తెలంగాణలో జరుగుతున్న ఈడీ, ఐటీ, సిట్‌ కేసులు కూడా అంతేనని జోస్యం చెబుతున్నారు. అంతేకాదు 2023 ఎలక్షన్స్ వరకు ఈ దాడులు ఇలానే హీట్ గా ఉంటాయి, ఎలక్షన్స్ అయిపోయాక అంతా సైలెంట్ అనే వారు లేకపోలేదు.