నాగార్జున సాగర్ ప్రాజెక్టు దగ్గర గురువారం (నవంబరు 30) తెల్లవారుఝామున ఉద్రిక్తత వాతావరణం నెలకొంది. ఆంధ్రప్రదేశ్ పోలీసులు నాగార్జున సాగర్ ప్రాజెక్టు వద్దకు వచ్చి నీటి విడుదలకు ప్రయత్నించారు. ఇందులో భాగంగా బుధవారం (నవంబరు 29) అర్ధరాత్రి దాటాక అక్రమంగా ప్రాజెక్టులోనికి చొరబడి డ్యామ్‌కు ముళ్లకంచె పెట్టారు. సాగర్ ప్రాజెక్టుకు ఉన్న 26 గేట్లలో సగ భాగం.. అంటే 13వ గేట్ వరకు ప్రాజెక్టు తమ పరిధిలోకి వస్తుందని ఏపీ పోలీసులు వాదిస్తున్నారు. నీటిపారుదల శాఖకు చెందిన ఉన్నతాధికారులు దాదాపు 500 మంది దాకా పోలీసు సిబ్బందితో నాగార్జున సాగర్ ప్రాజెక్టు వద్దకు వచ్చారు.
వారిని డ్యామ్ కు కాపలాగా ఉన్న స్పెషల్ ప్రొటెక్షన్ ఫోర్స్ సిబ్బందిపై దాడి చేసి.. వారి మొబైల్ ఫోన్లు కూడా లాక్కున్నారు. 13వ గేట్ వద్దకు చేరుకొని ముళ్ల కంచె పెట్టి.. డ్యామ్‌ను తమ ఆధీనంలోకి తీసుకున్నారు.. ఏపీ పోలీసులు.
సాగర్ నుంచి నీటిని విడుదల చేసేందుకు అధికారులు సిద్దమయ్యారు. పల్నాడు జిల్లాలో భారీగా మోహరించి రాత్రి సమయంలో సాగర్ కు వెళ్లారు. సాగర్ వద్ద మీడియాపై పల్నాడు ఎస్పీ రవిశంకర్ రెడ్డి జులుం ప్రదర్శించారు. మీడియా ప్రతినిధుల ఫోన్లు కూడా ఏపీ పోలీసులు లాక్కున్నారు. తెలంగాణ ఎన్నికల నేపథ్యంలో ఏపీ పోలీసులు వెళ్లడంపై ఉత్కంఠ నెలకొని ఉంది.
ఇదంతా కేసీఆర్ పనే - ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి
సాగర్ డ్యాంపై పోలీసుల హడావిడిపై కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి స్పందించారు. సాగర్ డ్యాంపై పోలీసుల డ్రామా కేసీఆర్ పనే అని విమర్శించారు. ఓడిపోతున్నారని కేసీఆర్ కి అర్థమై తెలంగాణ సెంటిమెంట్ రగిలిస్తున్నారని ఆరోపించారు. ఇన్ని రోజులు లేని హడావిడి పోలింగ్ రోజే ఎందుకు అవుతోందని అనుమానం వ్యక్తం చేశారు. తెలంగాణ, ఏపీ పోలీసులు కలిసి చేసే డ్రామాలు ఎవరూ నమ్మవద్దని కోరారు. తెలంగాణ ఉద్యమాన్ని కేసీఆర్ ఎన్నికల కోసం వాడుతున్నారు. కాంగ్రెస్ గెలుపును ఎవరూ ఆపలేరని.. 90 సీట్లతో కాంగ్రెస్ అధికారంలోకి వస్తుందని కోమటిరెడ్డి విశ్వాసం వ్యక్తం చేశారు.
స్పందించిన ఎన్నికల కమిషనర్
నాగార్జున సాగర్ డ్యాం వద్ద జరుగుతున్న హైటెన్షన్ వ్యవహారంపై రాష్ట్ర ఎన్నికల కమిషనర్ వికాస్ రాజ్ స్పందించారు. రాజకీయ నేతలు ఎవరూ ఆ విషయంలో ఎలాంటి వ్యాఖ్యలు చేయొద్దని అన్నారు. డ్యాం దగ్గర జరుగుతున్న వ్యవహారాన్ని పోలీసులు చూసుకుంటారని చెప్పారు.