కోమటిరెడ్డి రాజగోపాల్‌ రెడ్డి కాంగ్రెస్‌ పార్టీకి, ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తూ చేస్తూ తెలంగాణ పీసీసీ అధ్యక్షుడు రేవంత్‌ పై విమర్శలు చేశారు. అసలు ఆయన వల్లే ఎన్నో ఏళ్లుగా కాంగ్రెస్‌ లో ఉంటోన్న తాను పార్టీని వీడాల్సి వచ్చిందని చెప్పుకొచ్చారు. అయితే ఈ వ్యాఖ్యలపై ఫైర్‌ అయిన రేవంత్‌ రెడ్డి ఆవేశంలో.. కోమటి రెడ్డి ఫ్యామిలీ అంతా బ్రాందీ షాపులపై బతికేటోళ్లు, కాంగ్రెస్ లేకపోతే వాళ్లకు ఏమీ ఉండేది కాదు అంటూ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. రేవంత్ మాటలు రాజగోపాల్ రెడ్డి సోదరుడు కోమటిరెడ్డి వెంకట్‌ రెడ్డికి కోపం తెప్పించాయి. మాటలు తిన్నగా రానివ్వు లేదంటే మ్యాటర్‌ వేరేగా ఉంటుంది  అన్న లెవల్లో హెచ్చరిస్తూ తనకి క్షమాపణలు చెప్పాలని డిమాండ్‌ చేశారు.


ఆర్థిక లావాదేవీల కోసం పార్టీపై విమర్శలా ?
కోమటిరెడ్డి బ్రదర్స్ వర్సెస్ రేవంత్ వివాదం విషయంపై మిగిలిన సీనియర్‌ నేతలెవరూ స్పందించకపోయినా రేవంత్‌ రెడ్డికి బాగా సన్నిహితురాలైన ములుగు ఎమ్మెల్యే సీతక్క మాత్రం తన స్టైల్లో రియాక్ట్‌ అయ్యారు. రాజగోపాల్‌ రెడ్డి విమర్శలను తప్పుబడుతూ.. ముసుగు వీరులు కొందరు తమ ఆర్థిక లావాదేవీలు, ప్రధాని నరేంద్ర మోదీ, కేంద్ర మంత్రి అమిత్‌ షా ఇచ్చే కాంట్రాక్ట్‌ ల కోసం కన్నతల్లి లాంటి పార్టీని అవమానిస్తున్నారని ఆరోపించారు. నిజమైన తెలంగాణ వాదులెవరూ మునుగోడులో రాజగోపాల్‌ రెడ్డిని తిరిగి గెలిపించరని ఆమె ధీమా వ్యక్తం చేశారు. అంతేకాదు రేవంత్‌ పై విమర్శలు చేసిన కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి వెంటనే క్షమాపణలు చెప్పాలని ఆమె డిమాండ్‌ చేశారు.


కాంగ్రెస్ శ్రేణుల్లో ఆందోళన
ఇలా రేవంత్‌ రెడ్డి వర్గం వర్సెస్‌ కోమటి బ్రదర్స్ గొడవల మధ్య మరో న్యూస్‌ కూడా కాంగ్రెస్ శ్రేణులను ఆందోళనకు గురిచేస్తోంది. తమ్ముడి బాటలోనే అన్నయ్య కోమటి రెడ్డి కూడా హస్తానికి హ్యాండివ్వబోతున్నారన్న టాక్‌ వినిపిస్తోంది. ఒకవేళ రేవంత్‌ క్షమాపణలు చెప్పకపోతే వెంకట రెడ్డి కూడా పార్టీని విడిచే ఛాన్స్‌ లేకపోలేదంటున్నారు. ఇప్పటికే రాజగోపాల్‌ రెడ్డి రాజీనామాతో జిల్లాలో మూడు నియోజకవర్గాలను కాంగ్రెస్‌ కోల్పోయే అవకాశం ఉందంటున్నారు. ఒకవేళ వెంకట రెడ్డి కూడా భువనగిరి ఎంపీ స్థానానికి, పార్టీకి రాజీనామా చేస్తే ఆరు నియోజక వర్గాలను వదులుకోవాల్సి వస్తుందన్న భయం పార్టీ శ్రేణుల్లో వ్యక్తమవుతోంది. ఇదే జరిగితే నల్గొండ జిల్లాలో కాంగ్రెస్‌ పని ఖతమేనంటున్నారు.


సొంత పార్టీతోనే పోట్లాట తగునా ?
అధికార టీఆర్‌ఎస్‌, బలం పుంజుకుంటున్న బీజేపీని టార్గెట్‌ చేయాల్సిన కాంగ్రెస్‌ నేతలు ఇంటిపోరుతో ఒకరినొకరు తిట్టుకుంటూ పార్టీని నాశనం చేస్తున్నారన్న వాదనలు రాజకీయవర్గాల్లో వినిపిస్తున్నాయి. రేవంత్‌ ని కాంగ్రెస్‌ నుంచి వెళ్లగొట్టాలనే ఆలోచనే తప్ప పార్టీని తెలంగాణలో బలోపేతం చేయాలన్న కసి సీనియర్లలో కనిపించటం లేదన్న వాదన కార్యకర్తల్లోనూ వ్యక్తమవుతోంది. ముందస్తు ఎన్నికలు తెలంగాణలో తప్పవన్న ప్రచారం జరుగుతుండటంతో కాంగ్రెస్‌ పార్టీలో కుమ్ములాటలు ఆపార్టీ ప్రతిష్టని మరింత దిగజార్చుతున్నాయి. ఇది ఇలాగే కంటిన్యూ అయితే రానున్న ఎన్నికల్లో ఆ పార్టీ మూడో స్థానానికి పరిమితం కావాల్సి ఉంటుందని రాజకీయ విశ్లేషకులు జోస్యం చెబుతున్నారు.