Munugodu By Elections: నల్గొండ జిల్లా అంటేనే కమ్యూనిస్టు ఉద్యమాలకు కేంద్రం. తెలంగాణ సాయుధ పోరాటంలో కూడా నల్గొండ జిల్లాకు ప్రత్యేక స్థానం ఉంది. దీంతో మొదటి నుంచీ నల్గొండ జిల్లాలో కాంగ్రెస్‌ పార్టీ నేతలకి, కమ్యూనిస్టులకు మధ్య గట్టి పోటీ ఉండేది. ప్రధానంగా నల్గొండ జిల్లాలో కమ్యూనిస్టులు బలమైన శక్తిగా ఉన్నారు. నల్గొండ జిల్లాలో ప్రతి నియోజకవర్గంలో ప్రత్యేకమైన ఓటు బ్యాంకు కలిగి ఉన్నారు. ప్రధాన పార్టీలతో పొత్తులతో సైతం కమ్యూనిస్టులు వారి గెలుపు కోసం కీలకంగా పనిచేశారు. 
ఐదు సార్లు విజయం సాధించిన సీపీఐ
మునుగోడు నియోజకవర్గంలో మొదటి నుంచి సీపీఐ పార్టీ బలంగా ఉంది. ఈ నియోజకవర్గానికి ఇప్పటివరకు 12 సార్లు ఎన్నికలు జరగ్గా ఐదు సార్లు సీపీఐ పార్టీ విజయం సాధించింది. సీపీఐ పార్టీకి చెందిన ఉజ్జని నారాయణరావు మూడు సార్లు ఈ నియోజకవర్గం నుంచి హ్యాట్రిక్‌ విజయం సాధించారు. 1985లో సీపీఐ పార్టీ నుంచి విజయం సాధించిన ఉజ్జని నారాయణరావు ఆ తర్వాత 1989, 1994లో జరిగిన ఎన్నికల్లో వరుసగా మూడుసార్లు విజయకేతనం ఎగరవేశారు. కాంగ్రెస్‌ పార్టీకి చెందిన పాల్వాయి గోవర్థన్‌రెడ్డిపై ఈ విజయాలు సాధించారు. అనంతరం 2004లో సీపీఐ పార్టీకి చెందిన పల్లా వెంకటరెడ్డి మునుగోడు నుంచి గెలుపొందగా, 2009లో ఉజ్జని యాదగిరిరావు ఈ స్థానంలో నెగ్గారు. సీపీఐ పార్టీ ఈ నియోజకవర్గంలో బలమైన పార్టీగా ఉంది. ఆ తర్వాత జరిగిన ఎన్నికల్లో వరుసగా కాంగ్రెస్‌ పార్టీ విజయం సాధించినప్పటికీ 2014లో మాత్రం టీఆర్‌ఎస్‌ పార్టీ ఈ నియోజకవర్గం నుంచి విజయాల ఖాతా తెరిచింది. 
బండి వ్యాఖ్యల వెనుక కారణం అదేనా..?
మునుగోడులో విజయం సాధిస్తే.. అదే ఫామ్ కొనసాగిస్తూ వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో తెలంగాణలో పాగా వేయాలని భావిస్తోంది. దాంతో బీజేపీ ఇక్కడ తమ విజయాలను శాసించే కమ్యూనిస్టు ఓటు బ్యాంకు ప్రత్యర్థులకు దక్కకుండా ఉండాలనే ఉద్దేశంతోనే ఆ పార్టీలపై విమర్శలు చేస్తున్నట్లు తెలుస్తోంది. ఇక్కడ ఐదు సార్లు విజయం సాధించిన సీపీఐ పార్టీతోపాటు సీపీఎం పార్టీ సైతం బలంగా ఉంది. సైద్ధాంతిక పరంగా కమ్యూనిస్టులు బీజేపీని వ్యతిరేకిస్తున్నారు.  కాంగ్రెస్‌కు లేదా టీఆర్‌ఎస్‌కు ఆ పార్టీ మద్దతు లేకుండా ఉండేలా చూడటంలో భాగంగా కమ్యూనిస్టులపై ఇలాంటి వ్యాఖ్యలు చేసినట్లు రాజకీయ విశ్లేషకులు పేర్కొంటున్నారు. కమ్యూనిస్టులు మద్దతు ఇస్తే ఈ నియోజకవర్గంలో గెలుపు సునాయాసంగా సాగుతుందనే ఉద్దేశంతోనే ఆ పార్టీలకు మద్దతు ఇవ్వకుండా చూసేందుకు తెలంగాణ బీజేపీ చీఫ్ బండి సంజయ్‌ కమ్యూనిస్టులు అధికార పార్టీకి దాసోహమంటూ వ్యాఖ్యానించారు. 
సీపీఐ పోటీ చేస్తుందా..?
రాష్ట్ర వ్యాప్తంగా వచ్చే ఎన్నికల్లో టీఆర్‌ఎస్‌ పార్టీతో కలిసి సాగాలని భావిస్తున్న సీపీఐ పార్టీ ఇప్పుడు మునుగోడులో టీఆర్‌ఎస్‌కు మద్దతు ఇస్తుందా..? లేక పోటీలో ఉంటుందా..? అనే విషయం కూడా చర్చానీయాంశంగా మారింది. నాగార్జునసాగర్‌ ఎన్నికల్లో కమ్యూనిస్టులు టీఆర్‌ఎస్‌ పార్టీకి మద్దతు ప్రకటించారు. ఇప్పుడు మునుగోడులో కూడా ఆ పార్టీకి మద్దతు ఇస్తారా..? లేదా అనే విషయం ఇప్పుడు రాజకీయ చర్చకు దారి తీస్తోంది. ఏది ఏమైనప్పటికీ నల్గొండ జిల్లాలో బలంగా ఉన్న కమ్యూనిస్టులు ఇప్పుడు ఎవరికి మద్దతు ఇస్తారు..? ఎవరి గెలుపులో భాగస్వాములవుతారు అనే విషయంపై చర్చ సాగుతుంది. కమ్యూనిస్టులు మాత్రం మునుగోడు నియోజకవర్గంలో గెలుపు ఓటములను శాసించే శక్తులు అవుతారని, వీలైతే వారిని తమతో కలిసి పని చేయడం, లేదా తమ ప్రత్యర్థులకు వారి మద్దతు లేకుండా చేయాలని బీజేపీ కసరత్తులు చేస్తోంది.