భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డికి టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి బేషరతుగా క్షమాపణ చెప్పారు. నల్గొండ జిల్లా చుండూరు సభలో అద్దంకి దయాకర్ చేసిన కామెంట్స్‌కు సారీ చెప్పారు. ఇలాంటి భాష వాడటం మంచి పద్దతి కాదంటూ  ఓ వీడియో విడుదల చేశారు. 


చుండూరు సభలో కాంగ్రెస్ లీడర్ అద్దంకి దయాకర్‌ చేసిన కామెంట్స్ ఆ పార్టీలో తీవ్ర దుమారం రేపాయి. రేవంత్‌ సమక్షంలోనే ఈ ఘటన జరగడంతో కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఫైర్ అయ్యారు. పిల్లబచ్చాగాళ్లతో తనను తిట్టించారని తీవ్రంగా హర్ట్ అయ్యారు. రేవంత్‌రెడ్డి క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. దయాకర్‌పై చర్యలు తీసుకోవాలని అభిప్రాయపడ్డారు. 






ఇప్పటికే దయాకర్‌ చేసిన కామెంట్స్‌పై క్రమశిక్షణ సంఘం రియాక్ట్ అయింది. వారం రోజుల్లో సమాధానం చెప్పాలని వారం క్రితం నోటీసులు కూడా ఇచ్చింది. దీంతో ఆయన ఎలా స్పందిస్తారనే అంశంపై ఉత్కంఠ నెలకొంది. ఇంతలో సమస్య మరింత ముదిరిపోకుండా రేవంత్ ఓ అడుగు తగ్గి వెంకట్‌రెడ్డికి క్షమాపణచెప్పారు. ఇప్పుడు  వెంకట్‌రెడ్డి రియాక్షన్ ఏంటనది అంతా ఆసక్తిగా చూస్తున్నారు. 


అసలు ఏం జరిగింది అంటే...


మునుగోడు నియోజకవర్గం చండూరులో కాంగ్రెస్ పార్టీ నిర్వహించిన సభలో ఆ పార్టీ నేత అద్దంకి దయాకర్ కోమటిరెడ్డి సోదరులను ఉద్దేశించి వివాదాస్పద కామెంట్స్ చేశారు. ఘాటైన పదజాలంతో విరుచుకుపడ్డారు. రేవంత్‌రెడ్డి  సోదరులు అమ్ముడుపోయారంటూ మాట్లాడారు. కోమటిరెడ్డి వెంకటరెడ్డిని పార్టీలో ఉంటే ఉండు.. లేకపోతే లేదన్నట్లుగా అద్దంకి దయాకర్ మాట్లాడారు. 


దయాకర్ చేసిన అసభ్యకర కామెంట్స్‌పై చర్యలు తీసుకోవాలన్న డిమాండ్ అప్పుడే ప్రారంభైంది. కాస్త ఘాటైన పదాలు వాడటంతో ఈ అంశం వివాదాస్పదమైంది. దీనిపై తెలంగాణ కాంగ్రెస్‌లో రేవంత్ వ్యతిరేక వర్గంగా పేరు పడిన కొంత మంది సీనియర్ నేతలు ప్రశ్నించడం ప్రారంభించారు. 


అద్దంకి దయాకర్‌పై హైకమాండ్‌కు జానారెడ్డి ఫిర్యాదు


కొంత కాలంగా ప్రత్యక్ష రాజకీయాల్లో కనిపించని సీనియర్ నేత జానారెడ్డి కూడా అద్దంకి దయాకర్ స్పీచ్‌పై హర్ట్ అయ్యారు. పార్టీ తెలంగాణ వ్యవహారాలను చూసే ఢిల్లీ నేతల్లో ఒకరైన బోసురాజుకు ఫోన్ చేశారు. అద్దంకి దయాకర్ లాంటినేతలు దూకుడుగా మాట్లాడం వల్ల పార్టీకి నష్టమని బోసురాజు దృష్టికి జానారెడ్డి తీసుకెళ్లారు. అలాంటి నేతల్ని దూరం పెట్టాలని ఆయన సూచించారట.


క్షమాపణ చెప్పాలని వెంకట్‌రెడ్డి డిమాండ్ 


మునుగోడు ఉపఎన్నిక గురించి తనతో ఎవరూ మాట్లాడట్లేదని ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి అన్నారు. చండూరులో కాంగ్రెస్ నిర్వహించిన సభలో ఓ చిన్న పిల్లాడితో తనను తిట్టించారన్నారు. తమని అవమానించిన వారు క్షమాపణ చెప్పాలని వెంకటరెడ్డి డిమాండ్ చేశారు. సీనియర్‌ను తిట్టిన అతడిని పార్టీ నుంచి సస్పెండ్‌ చేయాలన్నారు. కాంగ్రెస్‌ పాదయాత్రకు తనకు ఆహ్వానం లేదన్నారు. తనను అవమానించిన తర్వాత  కూడా ఎలా వెళ్తానని కోమటిరెడ్డి వెంకటరెడ్డి ప్రశ్నించారు. దీంతో పరిస్థితి కూల్‌డౌన్ చేసేందుకు రేవంత్ క్షమాపణ చెప్పారు.