Munugode Election Results Delay: మునుగోడు ఉప ఎన్నికల ఫలితాల వెల్లడిలో కాస్త ఆలస్యం కావడంపై బీజేపీ ఆగ్రహం వ్యక్తం చేసింది. నాలుగో రౌండ్ వరకూ ఎప్పటికప్పుడూ ఫలితాలను ప్రకటిస్తూ వచ్చిన అధికారులు ఐదో రౌండ్ లెక్కలు మాత్రం చాలా జాప్యం చేశారు. దీంతో బీజేపీ, టీఆర్ఎస్ నాయకులు తీవ్ర అభ్యంతరం తెలిపారు. రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి వికాస్ రాజ్ కు కేంద్ర మంత్రి జి.కిషన్ రెడ్డి ఫోన్ చేశారు. రౌండ్ల వారీగా ఫలితాల వెల్లడిలో జాప్యం జరగడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎప్పటికప్పుడు ఎందుకు ఫలితాలు వెల్లడించడం లేదని కిషన్ రెడ్డి సీఈవోను ప్రశ్నించారు. కేంద్ర మంత్రి ఫోన్ చేసిన 10 నిమిషాల్లోనే 4 రౌండ్ల ఫలితాలను సీఈవో అప్ లోడ్ చేశారు. 


బండి సంజయ్ ఆగ్రహం
మునుగోడు ఉప ఎన్నికల ఫలితాల వెల్లడిలో రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి (సీఈవో) వైఖరి అనుమానాస్పదంగా ఉందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు, ఎంపీ బండి సంజయ్ ఆరోపించారు. టీఆర్ఎస్ లీడ్ వస్తే తప్ప రౌండ్ల వారీగా సీఈవో ఫలితాలను అప్ డేట్ చేయడం లేదని బండి సంజయ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. బీజేపీ లీడ్ వచ్చినప్పటికీ ఫలితాలను సీఈవో వెల్లడించడం లేదని విమర్శించారు. మొదటి, రెండు రౌండ్ల తరువాత మూడు, నాలుగు రౌండ్ల ఫలితాలను అప్ డేట్ చేసేందుకు జాప్యానికి కారణాలేమిటో సీఈవో చెప్పాలని బండి సంజయ్ డిమాండ్ చేశారు. ఎన్నికల ఫలితాల వెల్లడిలో ఎన్నడూ లేనంత ఆలస్యం ఇప్పుడే ఎందుకు జరుగుతోందని బండి సంజయ్ నిలదీశారు. మీడియా నుండి తీవ్రమైన ఒత్తిడి వస్తే తప్ప రౌండ్ల వారీగా ఫలితాలను ఎందుకు వెల్లడించడం లేదని ప్రశ్నించారు. ఫలితాల విషయంలో ఏమాత్రం పొరపాటు జరిగినా కేంద్ర ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేస్తామని బండి సంజయ్ తేల్చి చెప్పారు.


ఎన్నికల కమిషన్ స్పందించాల్సిందే  - మంత్రి జగదీష్ రెడ్డి
రౌండ్ ల వారీగా ఎన్నికల కౌంటింగ్ ఫలితాలు వెల్లడి ఆలస్యం కావడంపైన మంత్రి జగదీష్ రెడ్డి కూడా ఆగ్రహం వ్యక్తం చేశారు. కౌంటింగ్ కేంద్రం నుంచి మీడియాకి అధికారులు లీకులు అందుతున్నాయన్న వార్తల పైన ఎలక్షన్ కమిషన్ స్పందించాలని డిమాండ్ చేశారు. ప్రతి రౌండ్ కౌంటింగ్ పూర్తయిన తర్వాత వెంటనే అధికారులు మీడియాకి స్వయంగా వివరాలు తెలిపాలని డిమాండ్ చేశారు. ఎన్నికల ఫలితాల జాప్యంపైన మీడియా ప్రతినిధులు కూడా నిరసన తెలిపారు.


స్పందించిన కలెక్టర్
అధికారికంగా ప్రకటించే వరకు వేచి చూడకుండా కొన్ని మీడియా ఛానళ్లు లేదా కొన్ని ఇతర మాధ్యమాలు ఊహగానాలతో ఫలితాలను ముందస్తుగా, ఊహిస్తూ ప్రసారం చేస్తున్నాయని జిల్లా కలెక్టర్ వినయ కృష్ణారెడ్డి అన్నారు. కాబట్టి, =వాటిని అధికారికమైన వాటిగా పరిగణనలోకి తీసుకోవద్దని జిల్లా కలెక్టర్ వినయ కృష్ణారెడ్డి కోరారు. ఇప్పటివరకు కేవలం మూడవ రౌండ్ ఫలితాలు మాత్రమే అధికారికంగా వెలువడ్డాయని ఆయన తెలిపినట్లుగా జిల్లా పౌర సంబంధాల అధికారి (డీపీఆర్వో) ఓ ప్రకటన విడుదల చేశారు.