మునుగోడు ఉప ఎన్నికల కౌంటింగ్ లో అధికార టీఆర్ఎస్ పార్టీకి బీజేపీ గట్టి పోటీ ఇస్తోంది. తొలి రెండు రౌండ్లలో టీఆర్ఎస్ ఓవరాల్ ఆధిక్యం సాధించింది. మూడో రౌండ్ నుంచి బీజేపీ పుంజుకుంది. 4వ రౌండ్ లో బీజేపి ఆధిక్యం కనబరిచింది. కానీ ఓవరాల్ గా చూస్తే ఇప్పటికీ టీఆర్ఎస్ దాదాపు 700 ఓట్ల ఆధిక్యంలో బీజేపీతో పోటీ పడుతోంది. ప్రస్తుత కౌంటింగ్ ఓట్ల వివరాలు గమనిస్తే ఎగ్జిట్ పోల్ సర్వేలు తారుమారు అవుతాయా అనే అనుమానాలు మొదలయ్యాయి.


మునుగోడు ఓటర్లు తెలంగాణ మంత్రులకు షాకిచ్చారు. రాష్ట్ర మంత్రులు ఇంఛార్జ్ లుగా ఉన్న ప్రాంతాల్లో బీజేపీ అభ్యర్థి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి సత్తా చాటారు. మంత్రులు మల్లారెడ్డి, శ్రీనివాస్ గౌడ్ కు సీఎం కేసీఆర్ బాధ్యతలు అప్పగించిన చోట బీజేపీ దూసుకెళ్తోంది. మంత్రి శ్రీవాస్ గౌడ్ ఇంచార్జ్ ఉన్నా లింగోజిగుడెం గ్రామంలో బీజేపీ దాదాపు 400 ఓట్ల లీడ్ తెచ్చుకుంది. మంత్రి మల్లారెడ్డి ఇంచార్జి గా ఉన్న అరెగుడెంలో కూడా బీజేపీ ఆధిక్యం కనబరిచింది. 


నాలుగు రౌండ్ల తరువాత పార్టీల ఓట్ల వివరాలు..
టీఆర్ఎస్ అభ్యర్థి ప్రభాకర్ రెడ్డికి 26,443 ఓట్లు రాగా, బీజేపీ అభ్యర్థి రాజగోపాల్ రెడ్డికి 25,729 ఓట్లు పోలయ్యాయి. కాంగ్రెస్ అభ్యర్థి పాల్వాయి స్రవంతికి 7,380 ఓట్లు రాగా, అందోజు శంకరాచారికి 907 ఓట్లు వచ్చాయి.


బీజేపీ అభ్యర్థి గ్రామంలోనూ బీజేపీదే హవా
మునుగోడులో సొంత గ్రామ ప్రజలే టీఆర్ఎస్ అభ్యర్థి కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డికి షాకిచ్చారు. టీఆర్ఎస్ అభ్యర్థి ప్రభాకర్ రెడ్డి గ్రామం సంస్థాన్ నారాయణ పురం మండలం లింగవారి గూడెంలో బీజేపీ ఆధిక్యం తెచ్చుకోవడంతో గులాబీ శ్రేణుల్లో ఆందోళన మొదలైంది. 


కౌంటింగ్ సెంటర్ నుండి వెళ్లిపోయిన పాల్వాయి స్రవంతి
మునుగోడు కౌంటింగ్ సెంటర్ నుండి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి పాల్వాయి స్రవంతి అకస్మాత్తుగా వెళ్లిపోయారు. మూడో రౌండ్ కౌంటింగ్ కొనసాగుతుండగా ఆమె బయటికి వచ్చారు. అయితే ఆమె అందరికంటే ముందుగానే కౌంటింగ్ కేంద్రానికి చేరుకుని గెలుపుపై ధీమాను వ్యక్తం చేశారు. మొదటి రెండు రౌండ్లలో పాల్వాయి స్రవంతికి బీజేపీ, TRS కంటే తక్కువ ఓట్లు వచ్చాయి. కాంగ్రెస్ పార్టీ ఆశించినంతగా ఓట్లు రాకపోవడం పార్టీ శ్రేణులను నిరుత్సాహపరిచింది. ప్రస్తుత కౌంటింగ్ శైలి గమనిస్తే బీజేపీ, టీఆర్ఎస్ మధ్య పోటాపోటీ కొనసాగనుంది.


Munugode Bypoll Counting News Live: ఓట్ల లెక్కింపు తీరు ఇలా



- 1, 2, 3 రౌండ్లు చౌటుప్పల్


- 4, 5, 6 రౌండ్లు నారాయణపురం 


- 7, 8 రౌండ్లు మునుగోడు


- 9, 10 రౌండ్లు చండూరు
- 11, 12, 13, 14, 15 రౌండ్లు మర్రిగూడ, నాంపల్లి, గట్టుప్పల్
- తొలుత చౌటుప్పల్ మండలం లెక్కింపు పూర్తయింది. ప్రస్తుతం సంస్థాన్ నారాయణపుర్ లో ఓట్ల లెక్కింపు కొనసాగుతోంది. చివరకు గట్టుప్పల్ మండల ఓట్లను అధికారులు లెక్కించనున్నారు.