తెలంగాణలో అన్ని పార్టీలకు ఎంతో కీలకమైన మునుగోడు ఉప ఎన్నికలకు నోటిఫికేషన్‌ వచ్చింది. అన్ని పార్టీలు గ్రామాల్లో తమ నాయకులను నియమించి ప్రచారం మొదలుపెట్టేశాయి. అయితే ఇప్పుడు అక్కడ ప్రధాన చర్చ సాగేది భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డిపైనే. తమ్ముడు రాజగోపాల్ రెడ్డి రాజీనామాతో వచ్చిన ఉప ఎన్నికల్లో ఆయన తమ్ముడి కోసం పనిచేస్తారా..? లేక సొంత పార్టీ అయిన కాంగ్రెస్‌ విజయం కోసం పనిచేస్తారా..? అనే విషయంపై చర్చ నడుస్తోంది. రాజగోపాల్‌రెడ్డి రాజీనామా తర్వాత జరిగిన పరిణామాలతో కోమటిరెడ్డి వెంకటరెడ్డి శైలి ఇప్పుడు కాంగ్రెస్‌ పార్టీ నాయకత్వానికి అంతు చిక్కడం లేదు.


రాజగోపాల్‌రెడ్డి రాజీనామా తర్వాత కాంగ్రెస్‌ పార్టీ నిర్వహించిన సభలో కొందరు నాయకులు అన్న వెంకటరెడ్డిపై కూడా విమర్శలు చేశారు. దీనిపై స్పందించిన ఆయన వారిని పార్టీ నుంచి సస్పెండ్‌ చేయాల్సిందే అని పట్టుబట్టారు. ఆ తర్వాత జరిగిన పరిణామాలతో ఈ విషయంపై కాస్త సద్దుమణిగినట్లే కనిపించింది. మునుగోడు ఉప ఎన్నికలపై ప్రియాంకా గాంధీ ప్రత్యేక దృష్టి సారించడంతో ఆమె నేరుగా వెంకటరెడ్డితో మాట్లాడటం, ఆ తర్వాత ఆయన ఎలాంటి వ్యాఖ్యలు చేయకపోవడంతో ఈ వివాదానికి చెక్ పెట్టినట్లేనని అందరూ బావించారు.


పార్టీ కార్యక్రమాలకు మాత్రం దూరంగానే ఉంటున్నారు ఎంపీ వెంకటరెడ్డి. ఏఐసీసీ నేత, కాంగ్రెస్ ఎంపీ రాహుల్‌ గాంధీ నిర్వహిస్తున్న భారత్‌ జోడో యాత్రలో వెంకటరెడ్డి పాల్గొనడంతో వెంకటరెడ్డి మునుగోడుపై దృష్టి సారిస్తారని అంతా భావించారు. అయితే అక్కడ పాదయాత్రలో పాల్గొన్న వెంకటరెడ్డి మాత్రం రాష్ట్ర కాంగ్రెస్‌ పార్టీ చేస్తున్న కార్యక్రమాలకు మాత్రం దూరంగానే ఉంటున్నారు. మరోవైపు భారత్‌ జోడో యాత్ర సన్నాహక సమావేశానికి సైతం ఆయన డుమ్మా కొట్టడం చూస్తే రాష్ట్ర పార్టీ కార్యక్రమాలకు ఆయన దూరంగా ఉండేందుకు సిద్దమయ్యారని గమనించవచ్చు.  
తాను సూచించిన అభ్యర్థికి న్యాయం చేస్తాడా..?
మునుగోడు ఉప ఎన్నికల్లో కాంగ్రెస్‌ పార్టీ టిక్కెట్‌ కోసం నలుగురు పోటీ పడ్డారు. ఈ విషయంపై అధిష్టానానికి కోమటిరెడ్డి సూచించిన పాల్వాయి స్రవంతికే టిక్కెట్‌ లబించింది. వెంకటరెడ్డి పార్లమెంట్‌ నియోజకవర్గంలోనే మునుగోడు ఉండటంతోపాటు ఆయనకు ప్రాధాన్యత కల్పించాలనే విషయంపై దృష్టి సారించిన కాంగ్రెస్‌ అధిష్టానం ఆయన మాటకే విలువిచ్చింది. ఈ క్రమంలో అభ్యర్థిగా ఉన్న పాల్వాయి స్రవంతి సైతం వెంకటరెడ్డిని కలిసి ప్రచారానికి రావాల్సిందిగా అభ్యర్థించారు. నోటిఫికేషన్‌ వెలువడిన తర్వాత తాను ప్రచారానికి వస్తానని వెంకటరెడ్డి చెప్పినట్లు ప్రచారం జరిగింది. అయితే ఇప్పుడు నోటిపికేషన్‌ విడుదల కావడం, నామినేషన్ల ప్రక్రియ మొదలు కావడంతో వెంకటరెడ్డి ప్రచారానికి వస్తారా..? లేదా..? అనేది మునుగోడు కాంగ్రెస్‌ శ్రేణుల్లో చర్చ సాగుతుంది.


తాను సూచించిన అభ్యర్థికే మునుగోడు టిక్కెట్‌ ఇచ్చిన కాంగ్రెస్‌ అధిష్టానానికి మునుగోడులో పార్టీని గెలిపిస్తారా..? లేక సోదరుడు రాజగోపాల్ రెడ్డి విజయం కోసం పరోక్షంగా పని చేస్తారా అనే దానిపై చర్చ జరుగుతుంది. మరోవైపు వెంకటరెడ్డి ప్రచారానికి వస్తారని పాల్వాయి స్రవంతి చెబుతునప్పటికీ ఆయన మాత్రం ఇప్పటివరకు ఎలాంటి వ్యాఖ్యలు చేయకపోవడం, మరోవైపు పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉండటం చూస్తే అసలు ఇంతకీ వెంకటరెడ్డి ఎలాంటి నిర్ణయం తీసుకుంటాడనేది ఆసక్తికరంగా మారింది. మరోవైపు ఇప్పటికే టీఆర్‌ఎస్, బీజేపీలు చేరికలతో బీజీగా మారడంతో వెంకటరెడ్డి ప్రచారానికి వస్తే మునుగోడులో కాంగ్రెస్‌ పార్టీకి బలం పెరిగే అవకాశాలు ఉన్నాయి.