ములుగు ఉప ఎన్నికల సందర్భంగా ప్రచారం మరింత రంజుగా సాగుతోంది. తాజాగా కాంగ్రెస్ ఎమ్మెల్యే సీతక్క, అదే పార్టీకి చెందిన ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డిని తీవ్ర స్థాయిలో దూషించారు. ఉప ఎన్నిక కోసం కాంగ్రెస్ పార్టీ స్టార్ క్యాంపెయినర్ గా కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి ఉన్న సంగతి తెలిసిందే. ఆయన బీజేపీ అభ్యర్థి అయిన తన తమ్ముడి తరఫున ప్రచారం చేస్తున్నారంటూ సీతక్క ధ్వజమెత్తారు. వెంకట్ రెడ్డి ఓ దుర్మార్గుడు అని అన్నారు. అలాంటి వ్యక్తిని కాంగ్రెస్ పక్కన పెట్టాల్సిందేనని డిమాండ్ చేశారు. కాంగ్రెస్ పార్టీలో ఉంటూ బీజేపీ అభ్యర్థిని గెలిపించాలని ప్రచారం చేయడం ఎంత వరకు కరెక్టు అని సీతక్క నిలదీశారు.
కోమటిరెడ్డి కోవర్ట్ ఆపరేషన్ పనికిమాలిన చర్య అని సీతక్క అన్నారు. కాంగ్రెస్ అధిష్ఠానం ఇచ్చిన షోకాజ్ నోటీసులకు కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి సమాధానం చెప్పాల్సిందేనని సీతక్క డిమాండ్ చేశారు. రాజకీయాలు బంధాలకు అతీతం అని అన్నారు. నిబద్ధతతో రాజకీయాలు చేయాలనుకుంటే.. పార్టీ నిబంధనలు, సిద్ధాంతాలకు కట్టుబడి పని చేయాలని హితవు పలికారు. తమ్ముడి గెలుపే కావాలని అనుకుంటే కాంగ్రెస్ కండువాను తీసి పక్కనపడేసి, బీజేపీ కండువా కప్పుకోవాలని అన్నారు. కాంగ్రెస్ పార్టీ గెలవడానికి పని చేయాల్సింది పోయి ఈ క్లిష్ట సమయంలో ఆస్ట్రేలియాకు పోవడం ఏంటని సీతక్క నిలదీశారు.
రేవంత్ రెడ్డే మాట్లాడిస్తున్నారా?
తెలంగాణ పీసీసీ చీఫ్ పదవి తనకు రాకుండా రేవంత్ రెడ్డికి దక్కడంతో కోమటిరెడ్డి ఏ స్థాయిలో అసహనం వెళ్లగక్కారో తెలిసిందే. మరోవైపు, సీతక్క ప్రతి విషయంలోనూ రేవంత్ రెడ్డికే మద్దతు పలుకుతూ ఉంటారు. రేవంత్‌రెడ్డి వర్గంగా సీతక్క గుర్తింపు పొందారు. అయితే, ఈ విషయంలో రేవంత్ రెడ్డే సీతక్కతో అలా మాట్లాడిస్తున్నారని కోమటిరెడ్డి అనుచరులు భావిస్తున్నారు. రేవంత్ రెడ్డికి కోమటిరెడ్డి వెంకట రెడ్డి సహాయ నిరాకరణ చేస్తున్న తరుణంలో అనేక ప్రచారాలు ఊపందుకుంటున్నాయి. పాత కోపాన్ని మనసులో పెట్టుకొని మునుగోడులో కాంగ్రెస్‌కు కోమటిరెడ్డి మద్దతు ఇవ్వకుండా, తెర వెనుక తమ్ముడికి మేలు జరిగేలా పావులు కదుపుతున్నారని కూడా ప్రచారం జరుగుతూ ఉంది.
ఒకరిపైఒకరు దాడులు
మునుగోడు నియోజకవర్గంలో బీజేపీ, కాంగ్రెస్ నాయకులు ఒకరిపై ఒకరు దాడులు చేసుకుంటున్న సంగతి తెలిసిందే. ఆదివారం కాంగ్రెస్ అభ్యర్థి పాల్వాయి స్రవంతి రెడ్డి కాన్వాయ్‌పై బీజేపీ కార్యకర్తల దాడికి పాల్పడ్డారు. నాంపల్లి మండలంలో స్రవంతి ప్రచారానికి వెళుతుండగా కొందరు బీజేపీ కార్యకర్తలు అడ్డుకున్నారు. ఓ వాహనాన్ని ధ్వంసం చేయడంతో కాంగ్రెస్ కార్యకర్తలు ఫైర్ అయ్యారు. దీనిపై నాంపల్లి అంబేద్కర్ చౌరస్తా వద్ద స్రవంతి, ఎమ్మెల్యే సీతక్క, పార్టీ నేతలు ఆందోళనకు దిగారు.
ఈ క్రమంలోనే ఓ కాంగ్రెస్ కార్యకర్త బీజేపీ అభ్యర్థి రాజగోపాల్ రెడ్డిపై కూడా దాడి యత్నించాడు. ఎన్నికల ప్రచారంలో భాగంగా ఆయన మాట్లాడుతుండగా.. కాంగ్రెస్ కార్యకర్త చెప్పు తీసుకుని ప్రచార వాహనంపైకి ఎక్కాడు. చెప్పుతో కొట్టేందుకు యత్నించగా రాజగోపాల్ రెడ్డి గమనించి వెంటనే దూరం జరిగారు. అప్రమత్తం అయిన బీజేపీ కార్యకర్తలు అతడిని పక్కకు లాగారు. దీంతో కాసేపు అక్కడ ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. ఆదివారం రాజగోపాల్ రెడ్డి చౌటుప్పల్ మండలం జైకేసారంలో ప్రచారం నిర్వహిస్తున్న సమయంలోనూ క్వాన్వాయ్‌పై ఓ వ్యక్తి మైక్ లాగేసుకున్నాడు. అతణ్ని బీజేపీ నాయకులు పట్టుకుని పోలీసులకు అప్పగించారు. మునుగోడులో ఈ ఘటనల వేళ పోలీసులు మరింత అప్రమత్తం అయ్యారు.