Munugode ByElections: మునుగోడు ఉప ఎన్నికలు కాంగ్రెస్ పార్టీలో విభేదాలను బయట పెడుతున్నాయి. కాంగ్రెస్ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి రాజీనామా వచ్చిన ఉప ఎన్నికలను వచ్చే అసెంబ్లీ ఎన్నికలకు దిక్సూచిగా అన్ని రాజకీయ పార్టీలు భావిస్తున్నాయి. ఆయన బీజేపీ అభ్యర్థిగా బరిలో దిగడంతో సోదరుడు కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి కాంగ్రెస్ ప్రచారానికి దూరంగా ఉన్నారు. కాంగ్రెస్ గెలిచే ప్రసక్తే లేదంటూ ఆస్ట్రేలియా పర్యటనలో ఉన్న వెంకట్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. అంతకుముందే కొందరు కాంగ్రెస్ నేతలకు ఫోన్ చేసి సోదరుడు రాజగోపాల్ రెడ్డి ఎప్పుడూ అండగా ఉంటాడని, ఆయనకు మద్దతు తెలపాలంటూ ఆడియో టేపులు కలకలం రేపాయి. ఈ వరుస ఘటనలతో టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి (TPCC Chief Revanth Reddy ) మునుగోడు ఉప ఎన్నికల విషయంలో కాస్త సీరియస్‌గా ఉన్నారు. కాంగ్రెస్ పార్టీ పెట్టిన భిక్షతో ఎదిగిన నేతలు నేడు పార్టీకి వెన్నుపోటు పొడిచారని రేవంత్ రెడ్డి ఆరోపించారు.
దుష్ట శక్తులు ఏకమయ్యాయి..
కొందరు నేతలు పార్టీకి వెన్నుపోటు పొడిచారని ఆరోపించిన రేవంత్ రెడ్డి ఈ మేరకు తెలంగాణలో ఉన్న కాంగ్రెస్ శ్రేణులకు బహిరంగ లేఖ రాశారు. పార్టీ విజయం కోసం కాంగ్రెస్ శ్రేణులంతా మునుగోడుకు తరలిరావాలని రేవంత్ పిలుపునిచ్చారు. దుష్టశక్తులన్నీ ఏకమై కాంగ్రెస్‌ను ఒంటరి చేయాలనుకుంటున్నాయని, ఇక కాంగ్రెస్ శ్రేణులంతా ఏకం కావాల్సిన సమయం ఆసన్నమైందన్నారు. రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీని అంతం చేయాలని కేంద్రంలోని బీజేపీ, టీఆర్ఎస్ పార్టీలు కుట్ర చేస్తున్నాయని పార్టీ శ్రేణులు ఈ ప్రయత్నాలను తిప్పికొట్టాలన్నారు. కేంద్రంలోని బీజేపీ ఎన్నికల కమిషన్, ఈడీ, సీఆర్పీఎఫ్ లను దుర్వినియోగం చేస్తోందని ధ్వజమెత్తారు. మరోవైపు అధికార టీఆర్ఎస్ నేతలు, మంత్రులు పోలీసులను వినియోగించుకుని ప్రతిపక్ష పార్టీల నేతల్ని ఇబ్బందులకు గురిచేస్తున్నారని చెప్పారు. యాదగిరి గుట్ట నరసింహస్వామి దేవస్థానాన్ని సైతం రాజకీయ లబ్ధి కోసం వాడుకోవడం సరికాదన్నారు.
ఆడబిడ్డపై రాళ్ల రాడులా చేస్తారా.. !
ఎన్నికలు జరుగుతుంటే పోరాడి విజయం సాధించాలి కానీ ఆడబిడ్డ అని కూడా చూడకుండా కాంగ్రెస్ అభ్యర్థి పాల్వాయి స్రవంతిపై రాళ్ల దాడులకు పాల్పడటం మీ రాజకీయమా అని ప్రశ్నించారు రేవంత్. కాంగ్రెస్ పార్టీ కుటుంబ సభ్యులపై దాడి జరుగుతుంటే చూస్తూ ఊరుకుందామా? తెలంగాణ రాష్ట్రాన్ని ఏర్పాటు చేసిన సోనియా గాంధీకి పార్టీలో ఎదిగిన నేతలు ద్రోహం చేస్తుంటే వదిలేద్దామా? అని పార్టీ శ్రేణులను అడిగారు. ఈ పరిస్థితుల్లో రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న కాంగ్రెస్ శ్రేణులు ఉన్నపళంగా మునుగోడుకు కదలి రావాలని పిలుపునిచ్చారు. కుల మతాలకు అతీతంగా కలిసి కదం తొక్కుతూ కాంగ్రెస్ పార్టీని గెలిపిద్దామని పిలుపునిచ్చారు. కాంగ్రెస్ శ్రేణుల కోసం మునుగోడులో ఎదురు చూస్తుంటానని రేవంత్ రెడ్డి అన్నారు.
పీసీసీ చీఫ్ అయినప్పటినుంచీ పార్టీలో తనకు మద్దతు కరువైందని రేవంత్ రెడ్డి ఇటీవల కంటతడి పెట్టుకున్నారు. మునుగోడులో కాంగ్రెస్ ను ఓడించేందుకు సొంత పార్టీ నేతలు బీజేపీ, టీఆర్ఎస్ పార్టీలతో కుమ్మక్కయ్యాయని ఆరోపించారు. ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ ను ఓడించి తనను పీసీసీ చీఫ్ పదవి నుంచి తొలగించడమే కొందరు లక్ష్యంగా చేసుకుని పావులు కదుపుతున్నారని రేవంత్ రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. ఈ క్రమంలో కాంగ్రెస్ శ్రేణులు తరలివచ్చి మునుగోడులో పార్టీ అభ్యర్థిని గెలిపించుకుందామని పిలుపునిచ్చారు.