Mungode By-Election: వ్యవసాయ భూములకు మీటర్లు పెట్టే మోడీ సర్కారుకు మునుగోడు ప్రజలు ఓట్లతో బుద్ధి చెప్పాలని టీఆర్ఎస్ ఎమ్మెల్సీ పాడి కౌశిక్ రెడ్డి అన్నారు. మునుగోడు ఉపఎన్నికల ప్రచారంలో భాగంగా 500 ద్విచక్ర వాహనాలతో బైక్ ర్యాలీ నిర్వహిచారు. ఊకొండి, సింగారం గ్రామాల్లో బైకులపై తిరుగుతూ ఓట్లు అభ్యర్థించారు. టీఆర్ఎస్ అభ్యర్థి కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డిని గెలిపించాలని కోరారు. మునుగోడు ఉపఎన్నికల్లో వామపక్షాలు బలపరిచిన టీఆర్ఎస్ అభ్యర్థిని భారీ మెజార్టీతో గెలిపించి బీజేపీకి బుద్ధి చెప్పాలన్నారు. ఇప్పుటికే టీఆర్ఎస్ గెలుపు ఖాయం అయిందని.. భారీ మెజార్టీ దిశగా మాత్రమే కార్యకర్తలు కృషి చేయాలన్నారు. 



గ్యాస్, పెట్రోల్, డీజిల్ ధరలతో పాటు నిత్యావసర సరుకుల దిగి రావాలంటే మునుగోడులో బీజేపీని చిత్తుగా ఓడించాలని పాడి కౌశిక్ రెడ్డి ప్రజలకు సూచించారు. ఆయన వెంట స్థానిక ఎంపీటీసీ పొలగాని విజయలక్ష‌్మి, సైదులు గౌడ్, సింగారం సర్పంచ్ గుర్రాల పరమేష్, మాజీ సర్పంచ్ రమేష్ తదితరులు ఉన్నారు. 


వడ్లు కొనరు కానీ వందల కోట్లతో ఎమ్మెల్యేలను కొంటారా - సీఎం కేసీఆర్


తెలంగాణలో యాసంగి వడ్లు కొనాలని అడిగితే కేంద్ర ప్రభుత్వానికి చేతగాలేదని, అలాంటిది డబ్బు సంచులతో ఎమ్మెల్యేలను కొనేందుకు హైదరాబాద్ వచ్చారని సీఎం కేసీఆర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. మునుగోడు నియోజకర్గంలోని చండూరు మండలం బంగారిగడ్డ వద్ద టీఆర్ఎస్ పార్టీ ఎన్నికల ప్రచార సభ నిర్వహించింది. ఈ సభలో ముఖ్యమంత్రి కేసీఆర్ మాట్లాడారు. 


‘‘మన పంట వడ్లు కొనాలని అడిగితే స్పందించరు కానీ, రూ.వందల కోట్ల సంచులు పట్టుకొని ఎమ్మెల్యేలను కొనాలని వస్తరా? ఈ బీజేపీకి బుద్ధి చెప్పాలా వద్దా? మీరంతా ఆలోచించాలి. వీటన్నింటికీ మీరు జవాబు చెప్పకపోతే వాళ్లు ఇష్టారాజ్యంగా ప్రవర్తిస్తరు. మేం చేసేది ఏమీ ఉండదు’’ అని కేసీఆర్ అన్నారు.


చేనేత ఉత్పత్తులపై 5 శాతం జీఎస్టీ వేసిన ప్రధాని మోదీనే అని విమర్శించారు. కేంద్రానికి బుద్ధి రావాలంటే చేనేత కుటుంబాలు ఒక్క ఓటు కూడా బీజేపీకి వేయొద్దని పిలుపునిచ్చారు. జాగ్రత్తగా ఆలోచించి ఓటు వేయకపోతే పెట్టుబడి దారులను, కార్పొరేట్ సంస్థలకు కొమ్ముకాసే వాళ్లను మనమే ప్రోత్సహించినట్లుగా అవుతుందని అన్నారు. బీజేపీకి ఓటు వేస్తే విద్యుత్ చట్టాలను కూడా అంగీకరించినట్లే అవుతుందని అన్నారు.


‘‘మన భారత విద్యుచ్ఛక్తి సంస్థలు ఇన్నేళ్ల నుంచి రూ.లక్షల కోట్లతో ఒక వ్యవస్థలా ఏర్పడ్డాయి. అలాంటి సంస్థలను పేలాలు అమ్మినట్లుగా ప్రైవేటు సంస్థలకు ఇస్తరట. వాడు మళ్లీ మన దగ్గర్నుంచే డబ్బులు ముక్కు పిండి వసూలు చేస్తరు. అలాంటి వ్యవస్థలను ప్రైవేటు కార్పొరేటు గద్దలకు అప్పజెప్తమా? అందరూ ఆలోచించండి.’’


"గ్యాస్ రేటు పెరిగింది.. పెట్రోల్ రేట్లు పెరిగాయి.. జీఎస్టీ ఎస్తున్నారు అని మనం కొట్లాడాలి. కత్తి ఒకరి చేతిలో పెట్టి యుద్ధాన్ని ఇంకొకడ్ని చేయమంటే చేస్తడా? వారి చేతిలో కత్తి పెడితే.. వాడు మన మెడ కోసేస్తడు. కాబట్టి, కత్తి ఒకడి చేతిలో పెట్టి యుద్ధాన్ని మరొకరిని చేయమంటే సమంజసం కాదు. ప్రజల ఆస్తులు కాపాడే పార్టీలను మీరు గౌరవిస్తే అందరం మంచిగుంటమని గమనించాలి’’ అని కేసీఆర్ పిలుపునిచ్చారు.