మునుగోడు నియోజకవర్గంలో ఉప ఎన్నికల ప్రచారం రోజు రోజుకూ హీటెక్కుతోంది. నేడు జరుగుతున్న ప్రచారంలో టీఆర్ఎస్, బీజేపీ వర్గాలు ఏకంగా కొట్టుకున్నారు. నల్గొండ జిల్లా మునుగోడు నియోజకవర్గం నాంపల్లి మండలం పసునూరు గ్రామంలో బీజేపీ టీఆర్ఎస్ వర్గాల మధ్య ఘర్షణ వాతావరణం చోటు చేసుకుంది. బీజేపీ శాంతియుతంగా ర్యాలీ చేస్తుండగా టీఆర్ఎస్ కార్యకర్తలు డీజే పెట్టి కవ్వింపు చర్యలకు పాల్పడ్డారని కాషాయ కార్యకర్తలు ఆరోపిస్తున్నారు. దీంతో బీజేపీ కార్యకర్తలకు టీఆర్ఎస్ నేతలకు మధ్య తోపులాట జరిగింది. వెంటనే పోలీసులు రంగ ప్రవేశం చేశారు.


పోలీసులను డీజే పర్మిషన్ ఎవరిచ్చారు అంటూ బీజేపీ కార్యకర్తలు నిలదీశారు. రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి టీఆర్ఎస్ కు ఇంచార్జిగా వ్యవహరిస్తున్న ఈ గ్రామంలో ఈ ఘటన చోటు చేసుకుంది. పోటా పోటీగా నినాదాలతో ఈలలు కేకలు వేస్తూ టీఆర్ఎస్ బీజేపీ నేతలు కార్యకర్తలతో ర్యాలీలు కొనసాగిస్తున్నారు.


ప్రత్యేకత చాటుకుంటున్న కేఏ పాల్


మునుగోడు ఉప ఎన్నికల ప్రచారంలో ప్రత్యేకంగా నిలుస్తున్నారు.. ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు, స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేస్తున్న కేఏ పాల్. ప్రచారం ప్రారంభం నుంచి ఎంతో ప్రత్యేకతను చాటుకుంటున్నారు. ప్రధాన పార్టీల నాయకులు సైతం వెళ్లని విధంగా వినూత్న గెటప్‌లు, పనులు చేస్తూ జనంలోకి చొచ్చుకుపోతున్నారు. ఆ మేరకు రోజుకు ఓ గెటప్‌లో కనిపిస్తున్నారు.


పార్టీలు ఓటర్లకు హామీల జల్లు కురిపిస్తుండగా ప్రజాశాంతి పార్టీ అధ్యక్షులు కేపాల్ మాత్రం విభిన్నంగా ప్రచారం చేస్తున్నారు. తనదైన స్టైల్లో ప్రచారం చేస్తూ మీడియా దృష్టిని తనవైపునకు తిప్పుకుంటున్నారు. రకరకాల వేషధారణలలో కనిపిస్తూ వెరైటీగా ప్రచారం చేస్తున్నారు. ఒక రోజు డ్యాన్సులు చేస్తూ, సైకిల్ తొక్కుతూ, చేనులో పత్తి ఏరుతూ ఇలా అన్ని వేషాలూ కట్టారు. ఈ క్రమంలో ఆయన సోమవారం ఉదయం స్కూల్ పిల్లలకు గాలిలో ముద్దులు పెడుతూ బాయ్ బాయ్ చెప్పారు. అంతకుముందు వారితో కలిసి డాన్సు చేశారు. మునుగోడు ఉప ఎన్నికలో గెలుపు తనదేనంటూ ధీమా వ్యక్తం చేశారు. తాజాగా మునుగోడులో ప్రచారం సందర్భంగా చిన్నపిల్లలతో కలిసి కేఏ పాల్ డ్యాన్స్ చేశారు. ఆయన పేరు రూపొందించిన పాటకు చిన్నారులతో కలిసి డ్యాన్స్ చేశారు.


రేపటితో ముగియనున్న ప్రచారం


మునుగోడు ఉప ఎన్నికల ప్రచారం చివరి దశకు చేరింది. నవంబర్ 1 మంగళవారం సాయంత్రం 3 గంటలతో ప్రచారం ముగియనుంది. దీంతో అన్ని పార్టీలు, అభ్యర్థులు హోరాహోరీగా ప్రచారం. ముఖ్యమంత్రి కేసీఆర్ ముందుగా ఊహించినట్లుగా చండూరు సభలో బీజేపీపైన విమర్శలు చేయడంతో గులాబీ కార్యకర్తలు మంచి ఊపుపైన ఉన్నారు. అటు బీజేపీ చాలా చోట్ల నేడు ర్యాలీలు ప్లాన్ చేసింది. ఇంటింటి ప్రచారాలు చేస్తూ, రోడ్ షోలలో పాల్గొంటూ కాంగ్రెస్ లీడర్లు ప్రచారంలో పాల్గొంటున్నారు. ఇవాళ, రేపు సాధ్యమైనంత వరకు నేరుగా ఓటర్లను కలిసేందుకు ప్లాన్ చేసుకున్నారు


రేపటితో ఉప ఎన్నిక గడువు ముగియనుండడంతో పార్టీల నాయకులు చేసే ప్రలోభాలపై ఎన్నికల సంఘం ప్రత్యేకంగా ఫోకస్ చేసింది. అధికారులు, పోలీసుల సాయంతో సోదాలు, తనిఖీలు ముమ్మరం చేయించింది. ఇక అభ్యర్థులు, వారి అనుచరులు కూడా ఆఖరి అస్త్రం అయిన తెరవెనుక ప్రలోభాలకు సిద్ధం అవుతున్నారు.