మునుగోడు ఉప ఎన్నికల ప్రచారంలో ప్రత్యేకంగా నిలుస్తున్నారు.. ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు, స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేస్తున్న కేఏ పాల్. ప్రచారం ప్రారంభం నుంచి ఎంతో ప్రత్యేకతను చాటుకుంటున్నారు. ప్రధాన పార్టీల నాయకులు సైతం వెళ్లని విధంగా వినూత్న గెటప్‌లు, పనులు చేస్తూ జనంలోకి చొచ్చుకుపోతున్నారు. ఆ మేరకు రోజుకు ఓ గెటప్‌లో కనిపిస్తున్నారు.


పార్టీల నాయకులు ఓటర్లకు హామీల జల్లు కురిపిస్తుండగా ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేపాల్ మాత్రం విభిన్నంగా ప్రచారం చేస్తున్నారు. తనదైన స్టైల్లో ప్రచారం చేస్తూ మీడియా దృష్టిని తన  వైపునకు తిప్పుకుంటున్నారు. రకరకాల వేష ధారణలలో కనిపిస్తూ వెరైటీగా ప్రచారం చేస్తున్నారు. ఒక రోజు డ్యాన్సులు చేస్తూ, ఇంకో రోజు రైతు వేషంలో పంచె కట్టి సైకిల్ తొక్కుతూ, చేలో పత్తి ఏరుతూ ఇలా అన్ని వేషాలూ కట్టారు. ఈ క్రమంలో ఆయన సోమవారం ఉదయం స్కూల్ పిల్లలకు గాలిలో ముద్దులు పెడుతూ బాయ్ బాయ్ చెప్పారు. అంతకుముందు వారితో కలిసి డాన్సు చేశారు. మునుగోడు ఉప ఎన్నికలో గెలుపు తనదేనంటూ ధీమా వ్యక్తం చేశారు. తాజాగా మునుగోడులో ప్రచారం సందర్భంగా చిన్న పిల్లలతో కలిసి కేఏ పాల్ డ్యాన్స్ చేశారు. ఆయన పేరు రూపొందించిన పాటకు చిన్నారులతో కలిసి డ్యాన్స్ చేశారు.



ఆదివారం గొర్రెల కాపరి వేషం


ఆదివారం నాటి ఎన్నికల ప్రచారంలో కేఏ పాల్ ఏకంగా గొర్రెల కాపరి వేషం కట్టారు. మేకలు, గొర్రెలను కాస్తూ టీఆర్ఎస్ ప్రభుత్వంపై విమర్శలు చేశారు. కేసీఆర్ పాలనలో గొర్రెల కాపరులు నరకం చూస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. డిగ్రీలు చేసిన యువతకు గొర్రెలు కాయాల్సిన పరిస్థితి వచ్చిందని, ఈ పరిస్థితికి కారణం ఎవరని ప్రశ్నించారు. ఆదివారం (అక్టోబరు 30) నాంపల్లి మండలంలో ప్రచారం చేశారు.


అన్ని వర్గాల ప్రజలు టీఆర్ఎస్ పాలనలో కష్టాలు పడుతున్నారని అన్నారు. వారిలో గొర్రెల కాపరులకు సైతం కష్టాలు తప్పడం లేదని కేఏ పాల్ ఆరోపించారు. డిగ్రీ, పీజీలు చదివినా యువతకు ఉద్యోగాలు లేకపోవడంతో చాలా మంది గొర్రెలు కాయాల్సిన పరిస్థితి ఏర్పడిందని మండిపడ్డారు. ఉప ఎన్నికలో తనకు ఓటేస్తే గ్రామానికి 20 మందికి చొప్పున ఉద్యోగం ఇప్పిస్తానంటూ కేఏ పాల్ హామీ ఇచ్చారు. కేసీఆర్ ఇంటికో ఉద్యోగం ఇస్తానని చెప్పి, ఒక్క ఉద్యోగం కూడా ఇవ్వకుండా ప్రజలను మోసం చేశారని విమర్శించారు. 


రేపటితో ముగియనున్న ప్రచారం


మునుగోడు ఉప ఎన్నికల ప్రచారం చివరి దశకు చేరింది. నవంబర్ 1 మంగళవారం సాయంత్రం 3 గంటలతో ప్రచారం ముగియనుంది. దీంతో అన్ని పార్టీలు, అభ్యర్థులు హోరాహోరీగా ప్రచారం. ముఖ్యమంత్రి కేసీఆర్ ముందుగా ఊహించినట్లుగా చండూరు సభలో బీజేపీపైన విమర్శలు చేయడంతో గులాబీ కార్యకర్తలు మంచి ఊపుపైన ఉన్నారు. అటు బీజేపీ చాలా చోట్ల నేడు ర్యాలీలు ప్లాన్ చేసింది. ఇంటింటి ప్రచారాలు చేస్తూ, రోడ్ షోలలో పాల్గొంటూ కాంగ్రెస్ లీడర్లు ప్రచారంలో పాల్గొంటున్నారు. ఇవాళ, రేపు సాధ్యమైనంత వరకు నేరుగా ఓటర్లను కలిసేందుకు ప్లాన్ చేసుకున్నారు


రేపటితో ఉప ఎన్నిక గడువు ముగియనుండడంతో పార్టీల నాయకులు చేసే ప్రలోభాలపై ఎన్నికల సంఘం ప్రత్యేకంగా ఫోకస్ చేసింది. అధికారులు, పోలీసుల సాయంతో సోదాలు, తనిఖీలు ముమ్మరం చేయించింది. ఇక అభ్యర్థులు, వారి అనుచరులు కూడా ఆఖరి అస్త్రం అయిన తెరవెనుక ప్రలోభాలకు సిద్ధం అవుతున్నారు.