తెలంగాణ నుంచి జాతీయ రాజకీయాల్లోకి అడుగుపెడుతున్న కెసిఆర్ పార్టీ మునుగోడు ఉపఎన్నికలో ఎలాంటి ఫలితం అందుకుంటుంది. విపక్షాలు విమర్శలకు తగ్గట్టు ప్రజల తీర్పు ఉంటుందా లేదంటే కెసిఆర్ వెంటే మరోసారి ప్రజలు ఉంటారా ? ఇప్పుడిదే రాజకీయవర్గాల్లో ఆసక్తికరమైన చర్చకు కారణమవుతోంది.
టీఆర్‌ఎస్ నుంచి బీఆర్‌ఎస్‌కి పార్టీ పేరు మారుతోంది. ఇప్పటి వరకు రాష్ట్ర రాజకీయాలపై దృష్టి పెట్టిన కెసిఆర్ ఇప్పటి నుంచి దేశ రాజకీయాలపైనా కన్నేయాల్సిందే ! 2024 సార్వత్రిక ఎన్నికల్లో బీఆర్‌ఎస్ పోటీ చేయాలంటే ఇప్పటి నుంచే దేశరాజకీయాలపై ప్రత్యేక దృష్టి పెట్టాల్సి ఉంటుంది. కెసిఆర్ జాతీయపార్టీపై ఎప్పటిలాగానే విపక్షాల నుంచి వ్యతిరేకత వ్యక్తమయ్యింది. ఈ పరిస్థితుల్లో మునుగోడు ఉపఎన్నిక అంశం రాజకీయ వర్గాల్లో హైలెట్ అవుతోంది.
నిన్నటి వరకు ఈ ఉపఎన్నిక గురించి కెసిఆర్ పెద్దగా శ్రద్ధ చూపలేదన్న వార్తలు వచ్చాయి. కానీ ఇప్పుడు ఆయన చూపంతా మునుగోడుపైనే పడింది. ఇప్పటి వరకు జరిగిన ఏ ఉపఎన్నికపైనా చూపని శ్రద్ధని ఇప్పుడు చూపిస్తున్నారు. ఇప్పటికే మంత్రి జగదీష్‌తో పాటు జిల్లా నేతలకు మునుగోడు ఉపఎన్నిక టాస్క్ అప్పజెప్పిన కెసిఆర్ ఇప్పుడు మరింత మందిని రంగంలోకి దింపారు. కీలక నేతలతో పాటు జిల్లా, నియోజకవర్గంపై పట్టున్న స్థానిక నేతలు, కార్యకర్తలకు ఉపఎన్నిక బాధ్యతలను అప్పజెప్పినట్లు వార్తలు వినిపిస్తున్నాయి.
ఇప్పటికే కాంగ్రెస్ నుంచి పాల్వాయి స్రవంతి, బీజేపీ నుంచి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి మునుగోడు ఉపఎన్నిక బరిలో ఉన్నారు. ఇంకా టీఆర్‌ఎస్ పార్టీ అభ్యర్థిని ప్రకటించలేదు. రేపో మాపో గులాబీ పార్టీ అభ్యర్థిని కెసిఆర్ ప్రకటించడంతోపాటు గెలుపు వ్యూహాలను అమలు పరచబోతున్నారని ఇన్ సైడ్ టాక్.
నిన్నటివరకు మునుగోడు ఉప ఎన్నికలో గెలుపుపై కెసిఆర్ అంతగా ఆలోచించలేదు కానీ ఇప్పుడు ఈ విజయం తప్పనిసరైందని రాజకీయ విశ్లేషకులు సైతం అభిప్రాయపడుతున్నారు. జాతీయపార్టీలు కాంగ్రెస్, బీజేపీ మునుగోడు ఉపఎన్నికను రానున్న అసెంబ్లీ ఎన్నికలకు సెమిఫైనల్‌గా భావిస్తున్నాయి. కానీ కెసిఆర్‌కి మాత్రం ఈ ఉపఎన్నిక విజయం భారత్ రాష్ట్ర సమితికి ఊపిరినిచ్చేదిగా అంచనా వేస్తున్నారు. పార్టీ పేరు మార్చిన తర్వాత జరుగుతున్న తొలి ఉపఎన్నిక కాబట్టి ఈ ఫలితం తప్పకుండా గులాబీదళానికి కీలకమని ఆపార్టీ నేతలు కూడా భావిస్తున్నారు. అందుకే కెసిఆర్ తన బలం, బలగాన్నంతా మునుగోడుకి తరలిస్తున్నారని చెప్పుకుంటున్నారు.
నవంబర్ 3న ఉపఎన్నిక 6వ తేదీన జరిగే కౌంటింగ్‌తో మునుగోడులో ఎవరిది గెలిచేది తేలిపోతుంది. అంతేకాదు ఈ గెలుపుతో ప్రజల తీర్పు ఎవరికి అనుకూలంగా ఉంటుందో కూడా తెలిసిపోతుందంటున్నారు రాజకీయవిశ్లేషకులు.