IT Tower In Suryapet: ద్వితీయ శ్రేణి నగరాలకు ఐటీ సేవలను విస్తరించాలనే లక్ష్యంతో తెలంగాణ ప్రభుత్వం ముందుకెళ్తోంది. ఇప్పటికే తెలంగాణలోని ఆదిలాబాద్, నిజామాబాద్, వరంగల్, సిద్దిపేట, ఖమ్మం, కరీంనగర్ నగరాల్లో ఐటీ టవర్లు ఏర్పాటు చేసి ఐటీ పరిశ్రమ అభివృద్ధి దిశగా తెలంగాణ ప్రభుత్వం అడుగులు వేస్తోంది. తాజా సూర్యాపేటలో ఐటీ హబ్‌ ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. పాత కలెక్టరేట్‌లో 8 కంపెనీలతో ఐటీ టవర్‌ ఏర్పాటు చేస్తున్నట్లు మంత్రి జగదీశ్‌ రెడ్డి తెలిపారు. ఈ ఐటీ టవర్‌ను అక్టోబర్‌ 2వ తేదీన మంత్రి కేటీఆర్‌ ప్రారంభించనున్నట్లు వెల్లడించారు. ఈ మేరకు టాస్క్‌ అధికారులతో కలిసి బ్రోచర్‌ను విడుదల చేశారు.


ఈ సందర్భంగా జగదీశ్ రెడ్డి మాట్లాడుతూ.. సూర్యాపేటలో ఏర్పాటు చేయబోయే ఐటీ టవర్‌లో తొలి దశలో భాగంగా 180 మందికి ఉపాధి కల్పించనున్నట్లు మంత్రి జగదీశ్‌ రెడ్డి తెలిపారు. ఈ నెల 26న సూర్యాపేటలో ఐటీ జాబ్‌ మేళా నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు. ఈ నేపథ్యంలోనే వచ్చే నెల 2న మంత్రి కేటీఆర్‌ సూర్యాపేటతో పాటు నల్లగొండ జిల్లాలోనూ పర్యటించనున్నారు. నల్లగొండలో ఇప్పటికే నిర్మాణం పూర్తి చేసుకున్న ఐటీ హబ్‌ను కూడా ప్రారంభించనున్నారు. వాటితో పాటు నల్లగొండలో రూ.234 కోట్లతో నిర్మించనున్న కళాభారతి, పానగల్‌ ఉదయ సముద్రం చెరువు, వల్లభరావు చెరువులను ట్యాంకుబండ్‌లుగా తీర్చిదిద్దే పనులకు శంకుస్థాపన చేయనున్నారు. నల్లగొండ జిల్లా కేంద్రంలో ఇప్పటికే పూర్తయిన పలు అభివృద్ధి పనులను ప్రారంభించనున్నారు.


ద్వితీయ శ్రేణి నగరాలకు వేగంగా ఐటీ వ్యాప్తి
ఐటీ రంగాన్ని తెలంగాణలోని ద్వితీయ శ్రేణి నగరాలకు తీసుకెళ్లాలని 2015–16 నుంచే ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. ఈ క్రమంలోనే ఖమ్మం, నిజామాబాద్, సిద్దిపేట, కరీంనగర్, వరంగల్, మహబూబ్‌నగర్‌లలో ఐటీ హబ్‌లు నిర్మించారు. కరీంనగర్, ఖమ్మం, నిజామాబాద్, సిద్దిపేట, వరంగల్‌లలో ఐటీ సంస్థలు ఇప్పటికే తమ కార్యకలాపాలను ప్రారంభించాయి. స్థానిక యువతకు ఉపాధి అవకాశాలు కల్పించేలా ప్రభు త్వం చర్యలు చేపడుతోంది. త్వరలోనే నల్లగొండ, రామగుండంలోనూ ఐటీ హబ్‌లు ఏర్పాటు చేయ బోతున్నారు. మొత్తం మీద 2026 నాటికి 20 వేల మందికి నేరుగా ఈ పట్టణాల్లో ఉద్యోగ అవకాశాలు కల్పించాలని రాష్ట్ర ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది.


జూన్‌లో సిద్ధిపేటలో ఐటీ టవర్ ప్రారంభం
సిద్దిపేటలో రూ.63 కోట్లతో నిర్మించిన ఐటీ టవర్‌ను జూన్ నెలలో ఆర్థిక మంత్రి టీ హరీశ్‌రావుతో కలిసి మంత్రి కేటీఆర్ ప్రారంభించారు. మరోవైపు, ప్రజలకు రుచికరమైన, నాణ్యమైన మాంసాన్ని అందించాలనే లక్ష్యంతో ఇర్కోడ్ వద్ద 2 ఎకరాల స్థలంలో రూ. 6 కోట్లతో ఏర్పాటు చేసిన ఆధునిక స్లాటర్ హౌజ్(కబేళా)ను మంత్రి హరీశ్ రావు ప్రారంభించారు. దీంతోపాటు రూ. 20 కోట్లతో సీసీ, బీటీ రోడ్ల నిర్మాణ పనులకు మంత్రి కేటీఆర్ శంకుస్థాపన చేశారు.


నిజామాబాద్‌లో..
నిజామాబాద్‌‌లో రూ.50 కోట్లతో మొత్తం 49,460 చదరపు అడుగుల విస్తీర్ణంలో ఆకట్టుకునే రీతిలో ఐటీ టవర్‌ను నిర్మించారు. బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌, ఐటీ శాఖ మంత్రి కల్వకుంట్ల తారకరామారావు (KTR) ఆగస్టు నెలలో ఐటీ టవర్‌, న్యాక్‌ కేంద్రాన్ని ప్రారంభించారు. రూ.50 కోట్లతో నిర్మించిన ఈ టవర్‌లో ప్రభుత్వపరంగా టీఎస్‌ఐఐసీ ద్వారా మౌలిక వసతులు, అత్యాధునిక సౌకర్యాలను కల్పించింది. ఐటీ సంస్థలను నెలకొల్పబోయే వారితో ఐటీ శాఖతో ఒప్పందం చేసుకుంది.