నల్గొండ జిల్లాలో భారీ పేలుడు, ఉలిక్కిపడ్డ పల్లెలు!

Reactor Explosion: నల్గొండ జిల్లాలో భారీ పేలుడు సంభవించింది. హిందీస్ రసాయన పరిశ్రమలోని రియాక్టర్ పేలింది. ఒకరు మృతి చెందారు. 

Continues below advertisement

Reactor Explosion: నల్గొండ జిల్లా చిట్యాల మండలం వెలిమినేడు పరిధిలో భారీ పేలుడు సంభవించింది. భారీ పేలుడు ధాటికి పక్కనున్న పల్లె వాసులంతా ఉలిక్కి పడ్డారు. స్థానిక హిందీస్ రసాయన పరిశ్రమలో ఈ ప్రమాదం జరిగింది. ఫ్యాక్టరీలోని రియాక్టర్ పేలిందని అధికారులు తెలిపారు. ఈ ఘటనలో ఒకరు సజీవ దహనం అయ్యారు. పలువురికి తీవ్ర గాయాలు కాగా.. అందులో ప్రొడక్షన్ మేనేజర్ కూడా ఉన్నట్లు సమాచారం. 

Continues below advertisement

భారీగా ఎగిసిపడ్డ మంటలు ఒకరు మృతి..

హిందీస్ రసాయన పరిశ్రమలో రియాక్టర్ పేలిన సమయంలో లోపల 8 మంది సిబ్బంది, కార్మికులు ఉన్నట్లు సమాచారం. ప్రమాదంలో గాయపడ్డ వారిని నార్కట్ పల్లి కామినేని ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. స్థానికులు ప్రమాద ఘటనపై అగ్నిమాపక సిబ్బందికి సమాచారం అందించగా.. వారు హుటాహుటినా అక్కడికి చేరుకున్నారు. భారీగా ఎగిసిపడ్డ మంటలను అదుపు చేసే ప్రయత్నం చేశారు. ఈ ఘటనలో మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశాలు ఉన్నాయని అక్కడి ప్రజలు, ప్రమాదాన్ని చూసిన వారు చెబుతున్నారు. 

ఎంపీ బండి పార్థసారథికి చెందిన ప్యాక్టరీ..

హిందీస్ రసాయన పరిశ్రమ డి బ్లాక్ లోని రియాక్టర్ పేలినట్లు అధికారులు గుర్తించారు. అయితే ప్రమాద ఘటన తర్వాత పరిశ్రమ పరిసరాల్లోకి కంపెనీ యజమాన్యం సెక్యూరిటీ ఎవరిని అనుమతించడం లేదు. ఈ కంపెనీ రాజ్యసభ సభ్యుడు బండి పార్థసారధి రెడ్డికి చెందినది అధికారులు తెలిపారు. ఈ పరిశ్రమలో బాల్క్ డ్రగ్స్ తయారు చేస్తారని వెల్లడించారు. 

భారీగా కమ్మేసిన పొగ, భయాందోళనలో గ్రామస్థులు

రసాయ పరిశ్రమలో భారీ పేలుడుతో వెలిమినేడు శివారులో భారీగా పొగ కమ్మేసింది. వెలిమినేడు, పిట్టoపల్లి, బాంగోని చెర్వు, పేరేపల్లి, గుండ్రం పల్లి, పెద్ద కాపర్తి సమీప గ్రామస్తుల భయాందోళనలో ఉన్నారు. రియాక్టర్ పేలుడు శబ్ధం ఆయా గ్రామాల వరకు వినిపించినట్లు గ్రామస్థులు తెలిపారు. ప్రశాంతంగా ఉండే పల్లెల్లో కెమికల్ ఫ్యాక్టరీస్ రాకతో భయంతో గడుపుతున్నట్లు స్థానిక పల్లె వాసులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. కిలో మీటర్ల వరకు పేలుడు శబ్దం వినిపించిందంటే..  అది ఎంత పెద్ద పేలుడో అర్థం అవుతోందని గ్రామస్థులు అంటున్నారు. పల్లెల చెంత ఏర్పాటైన చాలా పరిశ్రమలు నిబంధనలను తుంగలో తొక్కుతున్నాయని, కనీస జాగ్రత్తలు పాటించడం లేదని స్థానికులు వాపోతున్నారు. స్థానిక రెవెన్యూ అధికారులు, ఇతర సంబంధిత అధికారులు చూసీ చూడనట్లు వ్యవహరిస్తున్నారని ఆరోపిస్తున్నారు. 

నిబంధనలు పాటించని పరిశ్రమలు: గ్రామస్థులు

నిబంధనలు పాటించని పరిశ్రమల వల్ల తమ ప్రాణాలకు ముప్పు పొంచి ఉందని గ్రామస్థులు భయాందోళన వ్యక్తం చేస్తున్నారు. హిందీస్ పరిశ్రమలో జరిగిన పేలుడుతో అయినా.. అధికారులు స్పందించి నిబంధనలు ఉల్లంఘించే ప్యాక్టరీలపై చర్యలు తీసుకోవాలని గ్రామస్థులు కోరుతున్నారు. 

హిందీస్ రసాయన పరిశ్రమలో అంత పెద్ద పేలుడు జరిగితే.. అధికారులు, ఫ్యాక్టరీ యాజమాన్యం పెద్ద ప్రమాదం కానట్టు చెబుతున్నారని స్థానికులు ఆరోపిస్తున్నారు. ఈ ప్రమాదంలో ఎక్కువ మందే కార్మికులు చనిపోయి ఉంటారని అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. ప్రమాదం జరిగిన బ్లాకులో 30 మంది వరకు కార్మికులు ఉన్నట్లు తెలుస్తోందని.. కానీ యాజమాన్యం మాత్రం ఆరుగురు కార్మికులే గాయపడ్డారని అంటోందని అనుమానం వ్యక్తం చేశారు. పేలుడు ఘటనపై సమగ్ర విచారణ జరపాలని కోరారు.

Continues below advertisement