Minister Komatireddy Venkatreddy Comments: సంపదపై ఆశతో కేసీఆర్, అల్లుడు హరీశ్ రావు, కొడుకు కేటీఆర్ దోపిడీకి పాల్పడ్డారని మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి అన్నారు. హైదరాబాద్‌లో టానిక్ షాపులు, ఢిల్లీలో లిక్కర్ షాపులు, కాళేశ్వరం ప్రాజెక్టుల పేరుతో దోపిడీ చేసి దక్షిణ తెలంగాణను నాశనం చేశారని కోమటిరెడ్డి వారిని విమర్శించారు. అందుకే తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు వచ్చిన రోజే కేసీఆర్.. కింద పడడం ద్వారా ఆయన తుంటి విరగ్గొట్టి దేవుడు శిక్ష వేశారని ఎద్దేవా చేశారు. నల్గొండ మున్సిపాలిటీలో తాగునీటి సమస్యలపై మంత్రి కోమటిరెడ్డి రివ్యూ నిర్వహించారు. పానగల్ లో తాగునీటి శుద్ధి ప్లాంటును పరిశీలించారు. ఆ తర్వాత అధికారులకు సూచనలు ఇచ్చారు.


తెలంగాణలో తమ ప్రభుత్వం ఆరు గ్యారెంటీలు అమలు చేస్తుందని అన్నారు. కొన్ని గ్రామాలకు వెళ్తే నీళ్ల సమస్యలతో కళ్ళలో నీళ్లు వస్తున్నాయని మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి అన్నారు. దిండి, ఎస్ఎల్బీసీ పూర్తి చేస్తే నల్గొండ జిల్లాలో ఈ పరిస్థితి వచ్చేది కాదని అభిప్రాయపడ్డారు. బీఆర్ఎస్ పార్టీలో నేతలు అందరూ అసమ్మతికి లోనవుతున్నారని.. క్రమంగా వారు పార్టీ మారిపోతుంటే.. ఇకపై బీఆర్ఎస్ ఎక్కడ ఉంటుందని ప్రశ్నించారు. కేసీఆర్ దళితుడిని ముఖ్యమంత్రి చేస్తానన్నారని.. ఆయన ఇంత వరకూ తన మొదటి హామీనే అమలు చేయలేదని అన్నారు.


బీఆర్‌ఎస్ మొదటి ఐదేళ్లలో మహిళా మంత్రి లేని రాష్ట్రం కాబట్టే వారి ఉసురు తగిలిందని అన్నారు. అందుకే అప్పుడు కరువు వచ్చిందని కోమటిరెడ్డి మాట్లాడారు. మొదటి నుంచి అన్ని వర్గాలకు న్యాయం చేసింది కాంగ్రెస్ పార్టీ అని అన్నారు. ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ చచ్చిన పాము లాంటిందని అన్నారు. ఎంపీ ఎన్నికల్లో ఈసారి బీఆర్ఎస్ కు ఒక్క సీటు కూడా రాదని మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి తేల్చి చెప్పారు.